
– పేద కుటుంబానికి తప్పని ఆర్థిక ఇబ్బందులు
– ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
నవతెలంగాణ – కోహెడ
తల్లిదండ్రుల రెక్కల కష్టంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారికి కాలేయవ్యాధి సమస్య తోడై ఆ కుటుంబ సంతోషాల్ని వెనక్కి నెట్టేసింది. తోటి చిన్నారులతో ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన నాలుగేళ్ల చిన్నారి పెద్ద జబ్బు బారిన పడి లివర్ సంబందిత సమస్యతో ఇబ్బందులు పడుతుంది. శస్త్ర చికిత్సకు అవసరమైన ఆర్థికస్థోమత లేక ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన పున్నం శిరీష`రాజశేఖర్ దంపతులకు 4 సంవత్సరాల కూతురు (రియాన్షిక) గత రెండు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దీంతో పలు ఆసుపత్రులలో వైద్యం కోసం తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని రేన్‌బో బంజారహిల్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. డాక్టర్స్ చిన్నారికి కాలేయ మార్పిడి చేయాలని కాలేయ మార్పిడికి రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబానికి ఇప్పుడు పెద్ద ఆపద వచ్చింది… ప్రేమ ఆప్యాయతలతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ పాప తల్లిదండ్రులు మా పాప ప్రాణాన్ని నిలబెట్టమని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం 8 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సహాయం అందించాలనుకునే వారు ఫోన్ పే నంబర్ 9848924347 పోలు శ్రీనివాస్, గూగుల్ పే 9666338616 బండిపెల్లి శ్రీకాంత్ నంబర్‌లకు సహాయం అందించాలని వేడుకుంటున్నారు.