యూపీలో ద్వేషపూరిత సంస్కృతి

A culture of hate in UP– ముస్లిం బాలుడిని చెప్పుతో కొట్టాలంటూ..
– తోటి విద్యార్థులను ప్రోత్సహించిన టీచర్‌
– సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
– ఘటనపై ప్రతిపక్షాలు, న్యాయవాద సంఘాలు ఆగ్రహం
లక్నో: యూపీలో మైనారిటీల రక్షణ, గౌరవం గాలిలో దీపంలా మారుతున్నది. యోగి సర్కారు తీరుతో రాష్ట్రంలో ద్వేషపూరిత సంస్కృతి తీవ్రమవుతున్నది. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు విద్యాసంస్థలకూ చేరాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే.. ఆ వర్గం విద్యార్థులను తోటి విద్యార్థులతో కొట్టిస్తున్నారు. ముస్లిం బాలుడిని చెప్పుతో కొట్టాలంటూ ఒక టీచర్‌ విద్యార్థులను ప్రోత్సహించిన ఘటన ఇప్పుడు తీవ్ర వివాదా స్పదమవుతున్నది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, న్యాయవాద సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘ద్వేషపూరిత సంస్కృతి’గా వారు అభివర్ణించారు. యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖుబాపూర్‌ గ్రామంలోని నేహా పబ్లిక్‌ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. అనంతరం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తరగతి ముందు నిలబడి ఉన్న ముస్లిం అబ్బాయిని ఒక విద్యార్థి కొట్టడం, ఆ తర్వాత టీచర్‌ ఇతర విద్యార్థులను లేచి గట్టిగా కొట్టాలని కోరడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి ఇర్షాద్‌ త్యాగి ఆవేదన వ్యక్త చేశారు. టీచర్‌ను త్రిప్తా త్యాగిగా గుర్తించారు.
ఈ ఘటనపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ.. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మాట్లాడతారా? లేక ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండిస్తారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కిరోసిన్‌ను చల్లి బీజేపీ మంట రాజేస్తున్నదని కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”అమాయక పిల్లల మనస్సులలో వివక్ష అనే విషాన్ని నాటడం, పాఠశాల వంటి పవిత్ర స్థలాన్ని విద్వేషాల మార్కెట్‌గా మార్చే ఒక ఉపాధ్యాయుడు దేశం కోసం ఏమీ చేయలేడు” అని ఆయన అన్నారు. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ కూడా ఈ సంఘటనను ”ప్రబలమైన హిందూ రాడికలైజేషన్‌ ఫలితం”గా అభివర్ణించింది. గత తొమ్మిదేండ్ల మోడీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ కూడా ఈ సంఘటనపై దృష్టి సారించింది. ఈ విషయంలో చట్టపర మైన చర్యలు తీసుకోబడతాయని సంస్థ చైర్‌పర్సన్‌ ప్రియాంక్‌ కనూంగో తెలిపారు.