కవిత్వం ఎక్కువగా వచ్చిన వస్తువుల మీదే రావటం చూస్తుంటాం. అమ్మానాన్నల మీద, చెట్టు మీద ఇలా మరికొన్ని. ఇందుకు కారణం అనుభవిస్తున్న జీవితం కావచ్చు. ముందుతరం కవులను అనుకరిస్తూనో, అనుసరిస్తూనో రాసే తెలియనితనం కావచ్చు. అందుకు మినహాయింపుగా చాలా తక్కువ మంది మాత్రమే అరుదైన వస్తువుల మీద రాస్తుంటారు. మనం ఈ కాలమ్ లో మాట్లాడుకునే వడ్కపురం కష్ణలో కూడా ఆ భిన్నత కనబడింది. తను తలకింద పెట్టుకునే ‘మెత్త’ మీద కవిత్వం రాశాడు.
ఇల్లు, కుటుంబం, మనం ప్రేమగా చూసుకునే వస్తువులు, పెంచుకునే జంతువులు ప్రతి ఒక్కటి కవిత్వంలోకి తొంగి చూస్తాయి. ఎందుకంటే కవి భావోద్వేగ భరితుడు. బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా తను సాంత్వననొందేది కవిత్వంతోనే. కాబట్టి ప్రతిదీ అతని చేతిలో కవిత్వమై కూర్చుంటుంది. పూలమొక్కలు, పూలకుండీలు, గేటు, ఇంటి గోడ… వేటినీ వదల్లేదు కవులు. అందుకు జోడింపుగా ఈ కవి రాసిన ‘మెత్త’ కూడా చేర్చొచ్చు.
సాధారణంగా రోజువారీ పనులల్లో పడి అలసిపోయి ఇంటికొచ్చి సేదతీరుతాం. మెత్తటి కుర్చీల్లో మెత్తలకు ఒరిగి హాయిని పొందుతాం. అలాంటి సందర్భంలోంచి ఈ కవి రోజు పడుకునే సమయంలో ఉపయోగించుకునే మెత్తతో తనకున్న అనుభూతులను కవిత్వం చేశాడు.మెత్తతో ఏముంటాయి అనుభూతులు అనే సందేహం ఈ కవిత చదవక ముందుకు కలుగుతుంది. చదివాక మనం మెత్తతో పాటే కవిత్వమత్తులోకి కూరుకుపోక తప్పదు.
పలానా వస్తువు మీద రాయాలని అనుకోకముందే కవిత్వం ఒక్కోసారి తెలియకుండానే వచ్చేస్తుంది. కవి మెత్త మీద రాసిన ఎత్తుగడ వాక్యాలు సహజంగా వచ్చిన కవితావాక్యాలు. ఇవి కావాలని రాసినవి కావు. అనుభూతుల్లోంచి రాలిపడ్డ సజీవవాక్యాలు.
బాధను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో మెత్తతో పంచుకునే తీరును, గురకపెడుతే వచ్చే శబ్దాలను, తాగి తడిపి వచ్చిన రాత్రుల్లో కార్చే జొల్లును, పొద్దంతా మనసులో అనుకున్న మాటలను రాత్రంతా కలవరించే మాటలకు సాక్షిగా మెత్తను నిర్వచించి వస్తువును బలీయంగా చూపాడు.
మనిషి ఏవేవో లక్ష్యాలను సాధించాలనుకుంటాడు. కానీ ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవటం వల్ల అవి కల్లలుగా మిగిలిపోతాయి. ఒక్కోసారి అవి అసంభవంగా మారి పగటి కలలయి వెక్కిరిస్తాయి. కవి ఇలాంటి స్థితిని కవిత్వంలోకి తీసుకొచ్చాడు. మనిషి ఆలోచనలకు కేంద్రం. అందులోంచి తలనోప్పి పుడుతుంది. ఫలితాలు సాధించుకుంటూ పోయేకొద్ది గర్వం కానొస్తుంది. ఈ రెంటిని సమానంగా తీసుకుని మెత్త మౌనజీవిలా ఉంటుందని కవి వ్యక్తీకరించాడు.
చివరిదశలో మెత్త పోషించే పాత్ర గొప్పది. బతికున్నప్పుడు ఎలానో చచ్చాక కూడా అలాగే తోడుగా ఉంటుంది. మనుషులు ఎవరు చనిపోయినా వారితో పోరు. తలగడ కట్టెల్లో కాలేప్పుడు తోడొస్తుంది. ఇలాంటి పరిశీలనాత్మక చూపు కవితలో ఈ కవి జోడించడం కొసమెరుపు. తలగడకు మానవీయతను ఆపాదించి ఆ వస్తుస్థాయిని పెంచాడు.
ప్రతీ వస్తువుకు మనం ఋణపడ్డవాళ్ళమే. ఆ ఋణాన్ని గుర్తించనివాడు మనిషి నుండి దూరంగా జరుగుతాడు. అది మెత్త చేసే మేలయినా, ఇంకేదయినా. మెత్తను తనలోకి ఒంపుకున్న ఈ కవి మెత్త పట్ల చూపిన కతజ్ఞత మాములుది కాదు. మెత్తను మనిషంత ఎత్తున నిలబెట్టాడు. ఓదార్చే మనిషి స్థానంలో, ఒడిలోకి తీసుకునే అమ్మ స్థానంలో. ఇంతమంచి కవితరాసిన ఈ కవి కలంనుంచి ఇంకేం కోరుకుంటాం. ఇలాంటి మరో మంచి కవిత తప్ప.
‘మెత్త’ని pillow
ఉండుండి ఆలోచన అకస్మాత్తుగా
అలా ఆ మెత్త మీద వాలింది..?
ఇన్ని ఏండ్లు గడిచిన ఆ రాత్రుల ఆలోచనలు ఒక్కసారిగా మెత్తమీదకు ఉసిగొల్పినరు
ఎన్నెన్ని బాధలు భరించిందో ఆ ‘మెత్త’ని మనసు అలసిన గురకల రొదలు
మత్తులో జోగి కార్చిన జొల్లు
కునికిపాట్లకు మౌనపు జోలపాట
కలవరింపులకు, ఉలికిపాట్లకు సాక్షి
పగటి కలలకు ఎన్ని సార్లు పగలబడి నవ్వుకుందో? కాంతపక్షి మెత్తని ఈకల కలగలుపుతో
ఈ తలభారాన్ని, నా తలబిరుసును కూడా
మౌనంగా భరించిన మౌని
సచ్చి సల్లబడినా తగలబడే రోజొచ్చినా
తల వదలని తలగడకు
ఏమని నా కతజ్ఞత నిద్దును
ఇంకొక నిద్దుర రాత్రిని తప్ప…!!??
– డా|| వడ్కపురం కష్ణ