‘అన్నదాత’కు ఆయువు పోసిన నృత్యరూపకం

ఇగ అయిపోయింది ”అన్నదాత” పని అన్నోళ్ళకు…
వ్యవసాయం దండుగ అని వెర్రికెేకలు వేసినోళ్ళకు..
వ్యవసాయం ఒక జీవన విధానం అని కనువిప్పు కలిగించింది. అగ్రికల్చర్‌ నుండి ‘కల్చర్‌’ పుట్టిందని పదునెక్కిన చూపుతో ‘అన్నదాత’ అనే నృత్యరూపకాన్ని ఆధునిక కాలంలో కూడా హిమాలయమంత ఎత్తులో.. ప్రపంచానికి పరిచయం చేశారు నందిని సిద్దారెడ్డి‌.
తన కలం నుంచి సత్యం ఖడ్గధారలాగా మెరిస్తే.. ‘అన్నదాత’ ఆవేదనకు పసందైన జతులతో ఆమె కూర్చిన నృత్యం, పదపదాన తన పాండిత్యానికి తార్కాణాలు, రైతు సంస్కృతి వైభవానికి ఒక నృత్య గోపురం. అంతే కాదు నా తెలంగాణ రైతుదే.. అంటూ ఎలుగెత్తి చాటింది నృత్య గురువు అయిన ఇందిరా పరాశరం. తెలుగు రాష్ట్రాలల్లో పల్లెపల్లెన ప్రదర్శించే చక్కటి నృత్యరూపకం. చక్కని సంగీతాన్ని సమకూర్చిన శాస్త్రీగారి ప్రతిభ విభిన్నభరితంగా సాగుతుంది.
అన్నదాత నృత్యరూపకం ప్రదర్శించిన చోటల్లా కంట నీరు పెట్టని కఠిన హృదయులుండరు. ప్రదర్శన చూసిన ప్రతి ఒక్కరు వేనోళ్ళా పొగిడారు. ఇది మా జీవితమే.. అని తడిమి చుసుకున్నారు. తన్మయత్వం చెందారు. సాత్విక, ఆహర్యాభినయంతో ఆరితేరిన పిల్లలే.. నటనలో కూడా నవీన మార్గంలో నడుస్తూ.. అన్నదాతల వద్దకే ‘అన్నదాత’ అనే నృత్యరూపకం ప్రదర్శించడంతో రైతులంతా, ఇది మా నాటకం, మా పాట, మా కథ, మా కన్నీళ్లు, మా కడగండ్లు, మా కష్టాలు, ఇది మా పై జరిగే దోపిడి అంటూ ఆట ఆటకు, పాట పాటకు, పదపదమున పరవశించిన ప్రజలు శహబాస్‌, అన్నదాత జయహో అన్నదాత అంటూ నినదించిన నృత్యరూపకం.
ఆగస్టు 31న ఇబ్రహింపట్నంలో ‘తెలంగాణ రైతు సంఘం’ రాష్ట్ర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రదర్శించిన ‘అన్నదాత’ నాటికకు రైతు ప్రముఖులు, రైతు నేతలు, రైతుల సమక్షంలో ప్రశంసలు పొందినది. రైతుపై కవి నందిని సిద్దారెడ్డికి చెక్కు చెదరని విశ్వాసం ఉంది. రైతు పట్ల తనకు ధృడమైన సంకల్ప శక్తి ఉంది.
అక్షరాలు సరళంగా.. భావాలు మృదువుగా సందేశాలు మిత్ర సమ్మితంగా.. సంఘటనలు కంటి శోకంగా, ఆరని దు:ఖంగా ‘నిత్యం పోరాటంగా’ సాగే రైతు జీవితాన్ని ఆవిష్కరించారు.
రచయిత, అహరహం సమాజ చింతనతో స్వప్నించే భావుకుడు కావడం వల్లనే ఈ నేలను స్వప్నించాడు. నాగేటి చాల్లల నా తెలంగాణ బతుకు పాటలు రాసి జనం నాలుకలపై నర్తింపజేశాడు. సిద్దారెడ్డిని స్పృశించడమంటే తెలంగాణ సాహిత్యంతో సంభాషించడం. ఆయన వ్యక్తిత్వాన్ని తూచడం అంటే తెలంగాణ ఆర్ధ్రతను, ఆగ్రహాన్ని ఆవాహాన చేసుకోవడమే.
ఆయన రక్తరలోనే తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఉంది. తండ్రి బాల సిద్దారెడ్డి తుఫాకి చేత బట్టి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దొరలపై, భూస్వాములపై, రజాకార్లపై తలపడిన సాయుధ యోధుడికి స్వయాన బిడ్డ! ఆయన తల్లి రత్నవ్వ పేదల పక్షపాతి. పొయ్యి మీద బువ్వ కుండ ఉడుకుతునే ఉంటుంది. పోరాట దళాలు ఇంటికొచ్చినప్పుడు కడుపునిండా అన్నం పెట్టే అన్నదాత ఇల్లు, అన్యాయంపై తిరుగుబాటు చేసే స్వభావం చిన్ననాడే అలవడింది. ఒక కంట్లో కత్తులు, మరో కంట్లో కన్నీళ్లు కలసి సాగినా జీవనయానం తనది.
తెలం’గానాలు’ గద్యం, పద్యం, శ్లోకం, జానపదం, ఆటపాటల పల్లెసంస్కృతి తెలిసినవాడు, అసాధారణమైన కవితాధార ఉన్నవాడు. ధారణకు తోడు అమృత తుల్యమైన భాషాపటుత్వం ఉన్నవాడు. ఆయనను కేవలం కవి, రచయితగా చూస్తే తెలుగు సాహితీలోకం తనను తాను తక్కువ చేసుకున్నట్టే. అతడొక బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే.. శాస్త్రీయ సంగీత నృత్యరూపకాలలో ప్రజా ద్వారాలు తెరిచారు. సంగీతం ఆస్తీకుల ఆస్తి కాదు. ఒక సమూహం సొత్తుకాదు. సమస్త కళలు ప్రజలవి, శ్రమశక్తి ఫలితాలు, శ్రమ నుంచి సమస్తం ఉద్భవించినది అనే ఎరుక కలిగినవారు. కనకనే ‘అన్నదాత’ నృత్యరూపకాన్ని శాస్త్రీయ సంగీతానికి అభినయానికణుగుణంగా రైతు జీవిత పరిణామ క్రమాన్ని పరిచయం చేశారు. రచనలోని ప్రతి అక్షరానికి గవాక్షములు తెరిచి ప్రజల బాణిని, రేపటి స్వరంలో.. ఎన్నో వసంతాల గతానుభవాల నగిషీతో చెక్కిన సమిష్టి జీవనసంస్కృతిని ప్రతిబింబించారు. ఇగ ‘అన్నదాత’ నృత్యరూపకంలోకి ఒక్కసారి మనం వెళితే…
”ప్రణతి-ప్రణతి ప్రకృతీ/ ప్రపంచ మాతృ స్థితిమతి ప్రణతి అంటూ ప్రకృతిని వర్ణిస్తూ.. లయ బద్దంగా ఎనిమిది మంది నృత్య కళాకాణిలతో ప్రారంభమవుతుంది.
”సృష్టి పరిణామంలో విశిష్టజీవి నరుడు/ జీవన పోరాటాన చిరప్రయోగ తత్పరుడు”
ఆదిమ కాలం నుండే ఆకలి బాధిస్తే.. జంతు వేట, ఫల సంపదతో సమిష్టి శ్రమతో సహాజీవనం సాగిస్తూ.. భూమిని గుర్తించి, గింజ వేసి గింజలు పండించి, నాగలి కనిపెట్టి, నాగలి కర్రను ఆవిష్కరించి, ప్రాణమొడ్డి పంట తీసిన వాడే కదా కర్షకుడు. ఈ వ్యవస్థ పోషకుడు, అన్నదాత వెలుగు రేక, రైతుజాతి వెెన్నుముక, దేశానికి పేరెన్నిక అంటూ.. రైతుల పరిణామ క్రమానికి ప్రాణం పోశారు. చూసే ప్రతి ఒక్కరిని నాటకంలో భాగస్వామ్యం చేయడం, ఆసక్తిగా వాళ్ళను నటనలో లీనం చేయ్యడం, తెలియకుండానే అంతర్భాగం చేయడం రచన ప్రత్యేకత.
వ్యవసాయ కుటుంబం ఒక వసుదైక కుటుంబం ప్రేమలు, ఆనురాగాలకు, దానధార్మాలకు మనిషి తత్వానికే పుట్టిల్లు, వ్యవసాయ పండుగలు, కరువు కాటకాలలో, కప్పల పెండ్లిళ్లు, సకల వృత్తులు సబ్బండ కులాలకు రైతే జీవనాధారం, అతడే జీవగర్ర అంటూ రైతు నేపథ్యం మొత్తం వివరిస్తారు.
దొరలు, భూస్వాములు, పైగా అప్పు లోళ్లు ఎవరికైయినా భయపడడు, కోర్టులకు జడవడు, కొట్లాడి తీరుతాడు. బడుగుల సంఘం మాది, బరిగీసి పోరాడుతాం అంటూ నిలబడుతాడు. ధైర్యానికి పోరాటానికి ప్రతికగా రైతును నిటారుగాను నిలబడుతాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురునిల్చి ఆత్మ గౌరవ పతాకగా.. రైతును రాజుగా.. నిలబెడుతాడు.
”ఏ దేవుని మొక్కితే ఏమి ఫలము!/ ఆకాశము నమ్మితే ఏది జలము?/ ఏ మొక్కలు ఆదుకోవు- మన రెక్కలే మనకు బలము” అనే చక్కటి సందేశాన్నిస్తాడు.
శ్రమ మూలం మిదం జగత్‌ అంటూ తమ రెక్కల కష్టంతో బావులు తవ్వుకుందాం. బావులు తవ్వి, మోటలతో, కాలువలతో కలిసి పాడేపాటలు, మోటబాయి పాటలు, కల్లంలో పాటలు, ఏరువాక పాటలు, పాటలతో ప్రయాణం సాగుతున్నది. కొంత కాలం, మోటలు, ఏటి ఊటలు ఏతమెత్తి పోసినా ఎకరం పారదాయో చెరువుకు గూడేసినా చేటడంత పారదాయా… విచారంతో రైతు తడబడుతూ.. నడుస్తుండగా…అంతలోనే ఓ పాట ”ఏటికేతం బట్టి ఏయిపుట్లు పండించి ఎన్నడు మెతుకెరుగరన్నా నేను గంజిలో మెతుకెరుగరన్నా” వెనుక నుంచి వచ్చే సాంగ్‌తో.. ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తారు. రైతు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు, రెక్కలు అరిగిన ఆశలు, కాడి విరిగిన వ్యవసాయం, అలసిపోయి అప్పులతో తిప్పలు పడుతున్నప్పుడే ప్రవేశిస్తుంది.
యాంత్రీకరణ భూతం, అడుగడుగున ట్రాక్టర్లు, మిషన్లు చుట్టుముడుతాయి. ప్రపంచీకరణ పాముపడగనీడ రైతుల ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. రైతు చావులు సహజమైనవి. పాలకులు పట్టించుకొని కాలంలో…ఆదిగో…
”అప్పులు ఇస్తాం.. బ్యాంకోళ్ళ మోతలు/ ఫైనాన్సు సంస్థల.., మైకుల మోతలు”
తనఖా పెడితే చాలు తక్కువ వడ్డీ ఇస్తాం అంటూ ప్రచారం. బ్యాంకుల చుట్టు రైతుల తిప్పలు, బోరు మీద బోరు వేసి బొక్క బోర్ల పడిరి, చుక్కలు కనిపించినా.. చుక్క నీరు లేకపాయె ఇక లాభం లేదని పత్తి పంట, వేస్తే.. తరాల దరిద్రం కోట్టుకపోతుందని ప్రచారం, దాంతో పత్తి గింజలు, ఎరువు, పురుగుమందుల దుకాణాలు, మనుష్యులతో జూదం, గిట్టుబాటు ధర లేక ఆలుపిల్లల్ని సాదలేక రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఇలా రైతులు ఎంతమంది మరణించినా.. వ్యవసాయం మీద ఆశ చావట్లేదు. రైతు యుద్ధం నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. త్యాగాల చిగుళ్లతో కొత్త మొక్కలై మొలుస్తున్నయి అనే సందేశంతో.. కాడి, మేడి ఎద్దులతో ఒంటరి మహిళ రైతు వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఎరువాక సాగిస్తుంది. రైతు జైత్రయాత్ర తిరిగి ఆరంభం.
అంతం కాదిది.. ఆరంభం, ఆనంత జీవన సంగ్రమం భూమి కోసం, భుక్తి కోసం సాగే.. రైతుల పోరాటం ఆత్మగౌరవ పతాకాన్ని భుజానికెత్తుకుని సాగుతుంది.నృత్యరూపకం జయహో.. ‘అన్నదాత’ జయ జయ ధ్వనుల మధ్య ప్రజల హర్షధ్వనుల మధ్య సాగిపోతుంది, ఆగిపోతుంది. రైతు కుటుంబమంతా కలిసి ఈ నాటకం ఆడారా? అన్నట్టుగా ఉంటుంది. కూచిపూడి నాట్యంలోనే.. కాదు.. సాంఘీక నృత్య రూపకల్పనలో కూడా ఇందిర ప్రతిభ అనన్య సామాన్యం. నేత్రాభినయం, అంగీకాభినయం సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటాయి. రైతు ఇల్లాలి వేషంలో నిండైన నగలతో తూలతూగే.. నవధాన్యాలు నా ఇంట్లోనే.. తొణికిసలాడే పాత్రలో కనిపించినా.. వ్యవసాయానికి ఏ సహాయం లేక రోజురోజుకు అవసాన స్థితికి చేరుకున్నట్లే.. ఒకటొకటి వంటి మీద నగలన్నీ పోయి బోసి మెడతో చితికి పోయిన స్థితి కండ్లముందు ఉంచినప్పుడు కంటిలో కన్నీళ్లు జలజల రాలుతాయి. ఏక కాలంలో ఎన్ని అవతరాలు ఎత్తిందో అభినయం అబ్బుర పరిచింది. ఇలా.. ఏ కళ అయినా సమకాలీన వాతావరణానికి, కొత్తతరం అభిరుచులకు అనుగుణంగా మలచక పోతే.. మనుగడ ఉండదన్న సత్యాన్ని గ్రహించారు. సాంప్రదాయం నుండి సామాజికతకు కొత్త మెరుగులతో.. ప్రేక్షకుల ప్రశంసలతో ప్రయాణం సాగిస్తున్న నృత్య రూపకం ‘అన్నదాత’ తప్పని సరిగా చూడాల్సిన దృశ్యకావ్యం.

– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343