– కల్వర్టు, బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి
నవతెలంగాణ – పెద్దవంగర
మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు నుంచి పెద్దవంగర గ్రామానికి వెళ్లే రోడ్డు లోని కల్వర్టు దెబ్బతిని ప్రమాదకరం గా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహం పైనుండి వెళ్లడంతో కల్వర్టు లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతి కి కల్వర్టు కోతకు గురికావడం, మరోచోట కల్వర్టు లేకపోవడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా పెద్దవంగర, ఉప్పెరగూడెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోతున్నాయి. దీనికి తోడుగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ, ఆసుపత్రి పాలవుతున్నారని ప్రజలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కాగా గతేడాది క్రితమే పెద్దవంగర ఎక్స్ రోడ్డు నుండి ఉప్పెరగూడెం వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. కానీ ఈ కల్వర్టు లు దెబ్బతిన్న ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్ కాలయాపన చేస్తున్నాడు. నిత్యం వందలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు రాకపోకలు సాగించే ఈ రోడ్డు కల్వర్టు లకు మరమ్మతులకు నోచుకోవడం లేదనే విమర్శలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కల్వర్టు మరమ్మతులు చేయించాలని, నూతన కల్వర్టు, బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.