పట్టపగలు ఆకాశంలో చుక్కలైనా కనిపిస్తాయేమో కానీ ఆర్ అండ్ బి అధికారులు మచ్చుకైనా కనిపించరు. సంవత్సరాలు గడుస్తున్న రహదారి పరిస్థితులను చూడడానికి ఒక్కసారైనా రాకపోవడం హేయమైన విషయం. మండలం గుండా వెళ్లే వరంగల్ ఖమ్మం జాతీయ (563) రహదారిపై మైలారం బస్టాండ్ వద్ద ప్రమాద స్థాయిలో గుంత ఏర్పడింది. దాంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ.. కొన్నిసార్లు గుంతను తప్పించపోయి వాహనాలు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లడం జరుగుతుందని స్థానికులు తెలుపుతున్నారు. దాంతో పెద్ద శబ్దాలు రావడంతో పాటు దుమ్ము విపరీతంగా లేస్తుంది అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారీ గెట్ విరిగిపోవడంతో అదే ప్రమాద సూచికగా ప్రస్తుతానికి నిలుస్తుందని తెలిపారు. నిత్యం వందల వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై అధిక సంఖ్యలో ఏర్పడిన గుంతలను పూడ్చడానికి మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని వాహనదారులు మండల ప్రజలు కోరుతున్నారు. గుంతల కారణంగా వాహనదారులు ఆచితూచి ప్రయాణించినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా రోడ్డు నిర్వాహణ అధికారులు అలసత్వం మత్తును వదిలించుకొని ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.