నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో పదవ డివిజన్ లో మంచినీటి సరఫరా పైప్ లైన్లలో లీకేజీ కారణంగా నీరు వృధాగా పోతుందని, దానిని మరమ్మత్తు చేయించడం కోసమని మున్సిపల్ శాఖ వారు నీరు లీకేజీ ఎక్కడ ఉందో అక్కడ గత ఐదు రోజుల క్రితం పైప్ లైన్ సరి చేయడం కోసమని ఒక పెద్ద(5 ఫెట్స్ పైనే)గుంత తీయడం జరిగిందని ప్రమాదకరమైన గుంతను త్వరగా పూడ్చివేయాలని యు.ఎస్.ఎఫ్.ఐ నగర కమిటీ కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆ మంచినీటి సరఫరా పైపులైను మరమ్మత్తును చేయడం కోసం ఇతర ప్రాంతం నుండి పరికరాలను టెక్నీషియన్ ను తీసుకుని వస్తున్నామని గత మూడు రోజుల నుండి సంబంధిత అధికారులు చెబుతూ వస్తున్నారని అన్నారు. అయితే గత ఆరు రోజుల నుండి మంచినీటి సరఫరా లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే నానా మాత్రము వాటర్ ట్యాంకీలను ఆ డివిజన్లో పంపిస్తున్నప్పటికీ అవి అక్కడున్న ప్రజల నిత్య అవసరాలకు ఏమాత్రం సరిపోక ఒకరినొకరు గొడవలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఈ గుంత తీసిన ప్రదేశంలోనే ఒక ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూలు ఒక ప్రైవేటు స్కూలు కూడా ఉన్నదని, చిన్న పిల్లలకు తెలియక అందులో పడితే ఎవరు బాధ్యులని అన్నారు. అలాగే గతంలో నాగారం ప్రాంతంలోనే మొరం కొరకు తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నపిల్లలు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయని,ఇప్పుడు ఈ గుంత ఈ ప్రదేశంలో ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి వీలైనంత త్వరగా టెక్నీషియన్ ని తీసుకువచ్చి ఆ మరమ్మత్తును పూర్తి చేసి ఆ గుంతను పూడ్చాలని డిమాండ్ చేశారు.