అజ్ఞానంలో కాదు
జ్ఞానాహంలోనే,
విజ్ఞాన కాంతి వేగం శూన్య సమానమనీ
అసంపూర్ణతల అంగీకారమే
సంపూర్ణ మూర్తిమత్వ మూలసూత్రమనీ
విశ్వమంతటికి వినిపించేలా….
నినదించిన మూగస్వరం
వినూత్న పరిశోధక విశాల హృదయం
వ్యక్తిత్వ వికాస పుస్తకమస్తిస్కం
సమాజ హితమే సమస్త శాస్త్ర సమ్మతమన్న
సామూహికశక్తి సమ్మిళిత స్వరూపం
సకల జీవుల సౌఖ్యం కోరిన
సానుకూల జీవన పయనం
సకల శాస్త్ర గ్రహాలకు
మానవుడే కేంద్ర బిందువన్న మనిషితనం
భూగ్రహం బూడిదగాక ముందరే
గ్రహాంతరవాసం వెళ్లిన మేధోగ్రహకం
రోగపు రోదనలో
తడిసి నిలిచిన ఆశల సౌధం
మృత్యువు కౌగిలిలోనూ,
మురిసిన బతుకు చిద్విలాసం
భౌతికంగా దూరమనే భావాన్ని
భౌతిక శాస్త్రమై గెలిచిన మృత్యుంజయం
సమస్యల పిట్టగోడల మీదినుండి
చావు సముద్రంలోకి దూకే వాళ్లకి
ఆవలి తీరమున కనిపించే ఆశాదీపం
సమస్యకు, చావుకు మధ్య
కాలం కాంక్రీట్‌తో
అనుభూతుల అనుసంధానం
స్టీఫెన్ హాకింగ్-
చావుపైన ఒక చావుదెబ్బ
బతుకు ఫలంలోని బతుకుతీపి
కలమై కాలంతో కలకాలం
కలబడే, తలపడే, నిలబడే
కలల సాకారం.
– డాక్టర్ చందా అప్పారావు, 9951017565