భగత్ సింగ్ భరతజాతి దాస్యవిముక్తి కోసం బ్రిటీష్ అధికారానికి ఎదురొడ్డి పోరాడి అమరుడయిన ధీశాలి. భారత దేశ స్వాతంత్య్ర సమరంలో విప్లవాగ్నిని రగిలించిన అద్వితీయ దేశభక్తుడు. భగత్‌సింగ్ ఈ దేశం గర్వించదగిన వారసత్వ సంపద. కొంతమంది బతికుండగానే మరణిస్తారు. మరి కొంత మంది మరణించిన తరవాత కూడా జీవిస్తారు. కొన్ని మరణాలు ఆ తదనంతరం జరిగే విముక్తి పోరాటాలకి ఉపిరిలూదే విప్లవ గీతాలకి ఉద్యమ చరణాలుగా పరిమళిస్తాయి.
భగత్‌సింగ్ నేటికీ రగులుతున్న ఉద్యమాలకి ఉపిరిలూదే ఒక విప్లవాగ్నికణం. మాతృదేశ విముక్తికి తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన అమర వీరుడు భగత్‌సింగ్ ఈ దేశంలో పుట్టి సరిగ్గా 116 సంవత్సరాలు అయ్యింది. అయినప్పటికీ ఆయన నేటికీ కోట్లాది భారతీయుల గుండెల్లో జాతీయ సమైఖ్య స్పూర్తిని రగిలిస్తూనే ఉన్నాడు. స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం పట్ల అతనికి ఉన్న అచంచలమైన నిబద్ధత ఆయన్ని చరిత్ర చిత్రపటంలో చెరిగిపోని సంతకంగా నిలబెట్టింది. భగత్‌సింగ్ బ్రిటిష్ వలస పాలనను నిర్భయంగా ఎదుర్కొన్న స్వాతంత్య్ర సమరయోధుడు. అతని విప్లవాత్మక పోరాటం, అతని రచనలు నేటి తరానికి ఎనలేని స్పూర్తిని అందిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి ఎంతటి ప్రధాన్యతనిచ్చాడో, మూడత్వాన్ని అంతగా వ్యతిరేకించాడు. భగత్ సింగ్ జన్మత: సిక్కుగా జన్మించాడు. కానీ సిక్కుగా మరణించలేదు. దేశంలో ప్రజల్ని విభజిస్తూ జరుగుతున్న హిందూ-ముస్లిం మధ్య చెలరేగుతున్న అల్లర్లను, ఇతర మతపరమైన తిరుగుబాట్లను చూసిన తర్వాత, అతను నాస్తికత్వాన్ని అనుసరించటం ప్రారంభించాడు. ‘నేను నాస్తికుణ్ణి’ అని తనకు తానుగా స్వచ్చంధంగా ప్రకటించుకున్నాడు. మతం పేరుతో దేశంలో జరుగుతున్న సామాజిక దోపిడీని భగత్ సింగ్ తీవ్రంగా నిరసించాడు. భగత్ సింగ్ విప్లవ వారసత్వం నేటికి భారతీయుల మదిలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంది.
పంజాబ్ రాష్ట్రంలోని ఖత్కర్ కలాన్ ప్రాంతంలో సెప్టెంబరు 28, 1907 తేదీన కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ పైన ఆయన తాత, స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన అర్జున్ సింగ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆయన పుట్టకముందే అయన ఇంటిలో రాజకీయాలు ఉండేవి. అయన నాన్న, చిన్ననాన్నలు గదర్ పార్టీ సభ్యులుగా ఉండేవారు. వీటన్నింటి ప్రభావం భగత్ సింగ్ పైన ఉండేది. చదువు మీద వీపరీతమైన అనురక్తి ఉండటం వల్ల చిన్నప్పుడే అనేక మంది దేశభక్తుల, విప్లవకారుల చరిత్రలను ఇష్టంగా చదివేవాడు. పదమూడేళ్ళ వయసులోనే మహాత్మగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్‌సింగ్‌కు పెళ్లి చేయాలని అతని తల్లితండ్రులు ప్రయత్నించారు. అయితే ‘నా జీవితం ఈ దేశానికి అంకితం చేయాలని అనుకుంటున్నాను… అది తప్ప నాకు ఇంకేమి కోరికలు లేవు’ అని ఉత్తరం రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన విశ్వవిద్యాలయ టీచరైన విద్యాలంకార్ సూచన మేరకు రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల నాయకత్వంలో సాగుతున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలో సభ్యుడిగా చేరి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ పత్రికల్లో అనేక మారుపేర్లతో వ్యాసాలు రాశాడు.
1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన భగత్‌సింగ్‌ని తీవ్రంగా కలచి వేసింది. అప్పటికి భగత్ వయస్సు 12 సంవత్సరాలు. భారతీయులపై బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న అమానవీయ విధానాల్ని ఆయన తట్టుకోలేక పోయాడు. దెబ్బకి దెబ్బే పోరాట విధానం కావాలనుకున్నాడు. 14 సంవత్సరాల వయస్సులోనే స్వత్రంత పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, ఆ తర్వాత యంగ్ రివల్యూషనరీ మూమెంట్‌లో చేరాడు. 1926 మార్చిలో ఇండియన్ సోషలిస్ట్ యూత్ ఆర్గనైజేషన్ నవజవాన్ భారత్ సభను స్థాపించాడు. ఇటలీ విప్లవకారుడు గుస్సెప్పే మజ్జినీ స్పూర్తితో ఈ సంస్థను స్థాపించినట్టు ఆయన రాసుకున్నాడు. భగత్ సింగ్ మదిలో బ్రిటిష్ వ్యతిరేక అగ్రజ్వాలలు ఎగిసిపడుతున్నట్లే, దేశంలో స్వతంత్ర పోరాటాలు ఉవెత్తున ఎగిసిపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమకారులను అణచివేయడం కోసం సైమన్ కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్‌ను వ్యతిరేకిస్తూ లాలా లజపతిరారు నాయకత్వంలో ఒక పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటాన్ని అణచివెయటానికి బ్రిటీష్ అధికారులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన లజపతిరారు కొన్ని రోజుల తర్వాత మరణించారు. ఇది భగత్ సింగ్ మనసులో రగులుతున్న అగ్రహాజ్వాలల్ని మరింత పెంచింది. చౌరీ చౌరా ఘటన తర్వాత గాంధీ నేతృత్వంలో జరుగుతున్న అహింస పోరాటాన్ని భగత్ సింగ్ నిరసిస్తూ విప్లవ పోరాట పంథాను ఎంచుకున్నాడు. అప్పటి నుండి వివిధ దేశాల్లో జరుగుతున్న విప్లవ పోరాటాల చరితను అధ్యయనం చేయటం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే మార్క్స్ సామ్యవాద సిద్దాంతాల పట్ల సింగ్ విశేషంగా ఆకర్షితుడయ్యాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ భారత దేశంలోని తొలితరం మార్క్సిస్టుల్లో ‘ఆరంభ మార్కిస్టు’గా భగత్‌సింగ్‌ని తన రచనల్లో అభివర్ణించాడు. ఆ తర్వాత కాలంలో భగత్‌సింగ్ రాడికల్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (న=A)లో చేరాడు, మార్క్స్ ప్రభావంతో అతను తన సహచర విప్లవకారులు చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్‌లతో కలిసి హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (నూ=A)గా దానికి పేరు మార్చాడు.భగత్ సింగ్ దేశభక్తి నిరుపమానమైనది. అతని చిన్నతనంలో దేశంలో నెలకొన్న పరిస్ధితులతో పాటు అతని కుటుంబ నేపథ్యం అతన్ని స్వతంత్ర పోరాటాల పైపు నడిపించింది. భగత్‌సింగ్ జాతీయవాద రాజకీయాలకి ఎక్కువ విలువనిచ్చేవాడు. బ్రిటిష్ పాలన నుండి స్వతంత్ర భారతదేశం విముక్తి పొందాలని నిరంతరం ఆరాటపడేవాడు. స్వాతంత్య్రం సాధించాలంటే సామ్రాజ్యవాద దోపిడీని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని భగత్ సింగ్ భావించేవాడు. అతని అభిప్రాయం ప్రకారం, రష్యాలో బోల్షివిక్ విప్లవం తరహాలో సాయుధ విప్లవం మాత్రమే అటువంటి మార్పుని తీసుకురాగలదని విశ్వసించాడు. లజపతి రారు హత్యకి ప్రతీకారంగా ఆ ఘటనకి కారణమయిన పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి సింగ్ బృందం పథక రచన చేశారు. అయితే పొరపాటున స్కాట్‌కి బదులుగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జెపి సాండర్స్‌ని హతమార్చారు. దీంతో భగత్ సింగ్, అతని అనుచరులపై నిర్భందం పెరిగింది. ఈ నిర్భందం నుండి తప్పించుకోడానికి భగత్ సింగ్ సిక్కులు పవిత్రంగా భావించే జుట్టుని, గడ్డాన్ని కూడా కత్తిరించుకున్నాడు. దేశంకోసం మత విలువల్ని, అవి ఆపాదించిన కట్టుబాట్లని సైతం పక్కన పెట్టిన భగత్‌సింగ్ నిజంగా ఆదర్శనీయుడు.
దేశంలో ఎగిసిపడుతున్న విప్లవాన్ని అణచివేయాలని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం పోలీసు అధికారులకి విశేష అధికారాలు కల్పిస్తూ ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకు వచ్చింది. భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర శాసనసభపై బాంబులు పెల్చాలని భగత్ సింగ్ నేతృత్వంలోని హిందూస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. అయితే ఈ బాంబు దాడిలో ఎవరూ గాయపడకుండా సింగ్ బృందం చర్యలు తీసుకుంది. ఈ దాడి అనంతరం భగత్ సింగ్ మాట్లాడుతూ ”చెవిటివారు వినాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి. మేము బాంబును విసిరినప్పుడు, ఎవరినీ చంపడం మా ఉద్దేశ్యం కాదు, అవసరమైతే మేం బ్రిటిష్ ప్రభుత్వంపై బాంబులతో దాడి చేయగలం అని చాటి చెప్పటమే ఈ దాడి అంతిమ లక్ష్యం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి, దేశానికీ తక్షణమే స్వాత్రంతం ప్రకటించాలి” అని డిమాండ్ చేశాడు. అనంతరాం సింగ్ బృందం విసిరిన బాంబులు మానవుల్ని గాయపరిచేటంత శక్తివంతమైనవి కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ అధికారులు కూడా తేల్చిచెప్పారు. ఈ దాడి అనంతరం అసెంబ్లీ హాలులో భగత్‌సింగ్ ”ఇంక్విలాబ్ జిందాబాద్.. ఇంక్విలాబ్ జిందాబాద్” అని నినాదాలు చేస్తూ, కరపత్రాలను పంచాడు. ఈ నినాదమే భారత సంగ్రామ పోరాటంలో యుద్ధనినాదంగా మారింది. ఈ నినాదమే ఆ తరవాతి కాలంలో దేశంలో జరిగిన అనేక విప్లవ పోరాటాలకి చోదక శక్తిగా మారింది. బాంబు దాడి తర్వాత భగత్‌సింగ్ తన సహచరుడు దత్ తో కలిసి పోలీసులకి లొంగిపోయాడు. వీరిద్దరికీ బ్రిటిష్ ప్రభుత్వం ‘జీవితకాల దేశ బహిష్కరణ’ శిక్ష విధించింది.
శిక్ష విధించిన అనంతరం భగత్‌సింగ్, అతని సహచరుడు లాహోర్ జైలుకి తరలించబడ్డారు. అక్కడ బ్రిటీష్ అధికారులు భారతీయ ఖైదీల పట్ల వివక్షపూరితంగా వ్యవహరించటం చూసి దానికి వ్యతిరేకంగా జైలులో నిరాహారదీక్ష చేశాడు. భారత రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, మరుగుదొడ్డి ఇతర దైనందిన సదుపాయాలు కల్పించాలని దీక్ష చేపట్టాడు. అదేవిధంగా, కార్మికుల హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని భగత్‌సింగ్ డిమాండ్ చేశాడు. సుమారు 116 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ నిరాహారదీక్ష డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గింది. అయితే ఈ దీక్షలో భగత్‌సింగ్ తో పాటు శిక్ష అనుభవిస్తున్న జతీంద్రనాథ్ దాస్ ఆకలి బాధని తట్టుకోలేక మరణించాడు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్య, బాంబుల తయారీ, లాహోర్ కుట్ర కేసు వంటి అనేక కేసుల విచారణ అనంతరం భగత్‌సింగ్‌కి ఉరిశిక్ష విధించబడింది. ఉరిశిక్ష తీర్పు అనంతరం తన కుమారుడిని క్షమించమంటూ భగత్‌సింగ్ తండ్రి బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు, పాశ్చాత్య విప్లవకారుడు టెరెన్స్ మాక్‌స్వినే మాటలను భగత్‌సింగ్ ఉటంకింస్తూ ”నా విడుదల కన్నా… నా మరణం ఈ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం” అని చెప్పి, పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తండ్రిని కోరాడు. దీనితో పాటు తన మిత్రుడు ప్రన్నత్ మెహతా రూపొందించిన క్షమాభిక్ష ముసాయిదా లేఖపై కూడా సంతకం చేయడానికి భగత్ సింగ్ నిరాకరిస్తాడు. భగత్‌సింగ్ ను ఉరితీయడానికి రెండు గంటల ముందు కూడా ఆయన ‘లెనిన్ రివల్యూషనరీ’ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు. ఆ సమయంలో భగత్‌సింగ్ తో దేశానికి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగితే ‘సామ్రాజ్యవాదం నశించి, విప్లవం వర్ధిల్లాలి’ అని పిలుపునిచ్చాడు. అనంతరం మార్చి 23, 1931 ఉదయం 7:30 గంటలకు, భగత్ సింగ్, అతని స్నేహితులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను లాహోర్ జైలులో ఉరితీశారు. దాంతో భారతదేశ స్వత్రంత సంగ్రామ చరిత్రలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఒక విప్లవ కెరటం భావితరాల పోరాటాలకి చుక్కానిగా మారింది. ”నాకూ జీవించాలనే సంకల్పం ఉంది, ఈ మాట చెప్పడానికి నేనేమీ సంకోచించను. కానీ ఉరి తప్పించుకోవాలనే దురాశ నాకు ఎంత మాత్రం లేదు. నా చివరి క్షణాల కోసం ఎదురుచూస్తుంటాను” అని భగత్ సింగ్ తన జైలు జీవితం గడిపిన రోజుల్లో అన్న మాటలే నేటి విప్లవ పోరాటాలకి స్ఫూర్తి గీతాలు కావాలి. మరణం వీరుల జీవితాలకే ముగింపు కానీ వారి ఆశయాలకి కాదు. వారి మరణం, తరవాత నడిచే విప్లవాలకి కొనసాగింపు.
ప్రస్తుతం దేశంలో ఒక పక్క మతతత్వ రాజకీయాలు రాజ్యమేలుతుంటే, మరొక పక్క రాజ్యాంగ విలువల్ని రక్షించుకునే శక్తులన్నీ పూర్తి నైరాశ్యంలో మునిగిపోయాయి. ఈ శక్తులన్నీ తిరిగి మతతత్వ విధానాలకి వ్యతిరేకంగా ఏకం కావడానికి, ముందుకు సాగడానికి భగత్ సింగ్ జీవితం, పోరాటం, త్యాగం ఉత్ప్రేరకంగా నిలుస్తుదనటంలో ఎటువంటి సందేహం లేదు. దేశ స్వాత్యంత్య్రం కోసం ఖైదు చేయబడిన రాజకీయ ఖైదీల న్యాయపరమైన హక్కుల కోసం పోరాడిన భగత్ సింగ్ తనకు విధించిన ఉరిని వ్యతిరేకించాడు. దానికి బదులుగా బ్రిటిష్ పాలకులకు తనతో యుద్ధానికి రమ్మని ఒక ఆహ్వాన లేఖ పంపించాడు. ”నేను విప్లవకారుడుని… మాతృదేశ విముక్తి కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడుతున్న వాడ్ని. నన్ను ఉరితాళ్ళతో బంధించే పిరికిపంద చర్యకు పాల్పడవద్దు. నేను యుద్ధాన్ని ప్రారంభించాను. నాతో యుద్ధానికి రండి, నన్ను ఫిరంగులతో ఎదుర్కొండి.. నాపై తుపాకులు ఎక్కు పెట్టండి.. నాపై యుద్ధం ప్రకటించండి… నేను సిద్ధంగానే ఉన్నాను” అని ఘర్జించిన విప్లవ వీరకిశోరం షహీద్ భగత్ సింగ్. న్యాయం కోసం నిలబడి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే వారందరికి ఆయన జీవితం కావలసినంత స్ఫూర్తిని అందిస్తుంది. విపరీతమైన ప్రతికూల పరిస్థితులలో కూడా విజయం వైపు అడుగులు ఎలా వేయ్యాలో ఆయన పోరాటం మనకి నేర్పుతుంది. తనకి ప్రాణభిక్ష పెట్టమని బ్రిటిష్ ప్రభుత్వం ముందు మోకరిల్లిన సావర్కర్ ప్రతినిధులు రాజ్యమేలుతున్న ఈ సమయంలో దేశభక్తికి, విప్లవానికి, తిరుగుబాటుకి, త్యాగానికి పర్యాయపదంగా నిలిచిన షహీద్ భగత్ సింగ్ స్పూర్తిని, ఆశయాల్ని, ఆచరణని జాతి యావత్తు గుండెలకి ఎత్తుకోవాల్సిన తరుణమిది. భగత్ సింగ్ పోరాటం దేశంలో అన్ని వర్గాల ప్రజల స్వేచ్చ, సమానత్వం కోసం జరుగుతున్న, జరగబోయే ఉద్యమాలకి విప్లవ గీతిక కావాలని కోరుకుంటూ… ఇంక్విలాబ్ జిందాబాద్.
(బ్రిటిష్ రాజ్యాన్ని యుద్ధానికి రమ్మని ఆహ్వానం పలికిన దేశీయ విప్లవకారుడు షహీద్ భగత్‌సింగ్ జయంతి సెప్టెంబరు 28 సందర్భంగా)
– డా|| కె. శశిధర్, 94919 91918