దశాబ్ది తెలంగాణ పేద ప్రజల విద్యా ఆకాంక్షలను పట్టించుకోలేదు. ప్రభుత్వ పెద్దలు ఉద్యమ ఆశయాలను పెడచెవిన పెట్టారు. తెలంగాణ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. నిజానికి ఏ సమాజ అభివృద్ధి అయిన అక్కడి విద్యా విధానంపై నిర్మాణమవుతుంది. విద్య, పరిశోధనలకు అవకాశం లేని నేలలో ప్రగతి ఏ మాత్రం సాధ్యం కాదు. తెలంగాణలో ఉన్నత విద్య పాతాళానికి పడిపోయింది. విశ్వ విద్యాలయాల్లోకి వస్తున్న విద్యార్థులకు, పరిశోధకులకు నాణ్యమైన విద్య, పరిశోధన అవకాశాలు అందటం లేదు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన వాతా వరణం కాకుండా, కోచింగ్ సెంటర్ల వాతావరణం క్రమంగా పెరిగింది. పరిశోధనల్లో సాధించిన ప్రగతిని గర్వంగా చెప్పుకోవాల్సిన యూనివర్సి టీలు మా విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పు కుంటున్నాయి. తెలంగాణలో ఉన్నత విద్య పతనావస్థకు ఇది నిదర్శనం.
విశ్వవిద్యాలయాల్లో బోధన ఫలితాలను పరిశోధనల్లో చూడాలి. ప్రభుత్వాలు యూనివర్సిటీ లతో ములాఖత్ అయి పరిశోధన ఫలితాను సమన్వయం చేసుకోవాలి. దీనికి మన ప్రభుత్వం సిద్ధమై లేదు. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే దిశగా ఆలోచనలను సాగిస్తున్నది. దీనికి గత పదేళ్ల తెలంగాణలో విద్యారంగంపై చూపిన వివక్షనే సాక్ష్యం. గ్రామీణ, పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, అవకాశాల కల్పన, పరిశోధన వాతావరణం వంటి విద్యా మౌలిక విషయాల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాల్లో ఉండాల్సిన బోధన సిబ్బంది ఇప్పుడు కేవలం 20శాతం లోపే ఉన్నారు. ఇంకా రెండేళ్లైతే ఈ పరిస్థితి 14శాతానికి పడిపోతుంది. విశ్వవిద్యాలయాల్లో హాస్టళ్ల నిర్వహణ, తరగతి గదులు, రీసెర్చ్ ల్యాబులు వంటి మౌలిక సదుపాలయాల కల్పనకు అవసరమైన బడ్జెట్‌ని కూడా కేటాయించడం లేదు. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్న బడ్జెట్లో సగభాగం కూడా కేటాయించడం లేదు. కేటాయించిన బడ్జెట్ కేవలం సిబ్బంది జీతాలకు మాత్రమే సరిపోతుంది.
వీటి కారణంగా యూనివర్సిటీ లకు వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఎక్కువగా నష్ట పోతున్నారు. వారిలో కూడా దళిత, బహుజన, మైనార్టీ విద్యార్థుల సంఖ్యే అధికం. వీరికి ప్రయివేట్ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే స్తోమత ఉండదు. రెక్కాడితే కానీ, డొక్కాడని పరిస్థితులు వీరివి. కనుక అనివార్యంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి వస్తున్నారు. ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పే ప్రభుత్వం, నాణ్యమైన ఉన్నత విద్య విషయంలో స్పష్టమైన భరోసాను ఇవ్వలేక పోతుంది. అరకొర వసతుల మధ్యే విద్యార్థులు చదువుకొని అనేక రకాల ఫెలోషిప్పులు సాధిస్తున్నారు. కానీ, పరిశోధన అవకాశాలు యూనివర్సిటీల్లో ఉండటం లేదు. విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలను గైడ్ చేసే వాళ్లు 20శాతం లోపే ఉన్నారు. ఈ పరిస్థితి వల్లే పీహెచ్డీ విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఫాకల్టీ నియామాకం జరిగితే వందలాది మంది విద్యార్థులకు పరిశోధన చేసే అవకాశం కల్పించవచ్చు. ఉదాహరణకు మన అధికార భాష తెలుగునే తీసుకుందాం. ప్రతియేట దాదాపు 50మంది తెలంగాణ విద్యార్థులు తెలుగులో జెఆర్ఎఫ్ సాధిస్తున్నారు. మన విశ్వవిద్యాలయాల తెలుగుశాఖల్లో సంవత్సరానికి 50మందికి కూడా పరిశోధన చేసే అవకాశం కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. మనం ప్రభుత్వం చెప్పే తెలంగాణ మోడల్ అంటే ఇదేనా? జెఆర్ఎఫ్ ద్వారా నెలకు రూ.40వేల వరకు ఫెలోషిప్ వస్తుంది. వారికి సరిపడా ఫ్యాకల్టీ లేని కారణంగా పరిశోధన చేసే అవకాశం లేకుండా పోతుంది. సాధించిన ఫెలోషిప్‌ని ఉపయోగించు కోలేని దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానాలే. ఇటువంటి పరిస్థితి మరే రాష్ట్రంలోను లేదు. నెలకు 40వేలు వచ్చే ఫెలోషిప్స్ ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు, నాణ్యమైన పరిశోధనలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ప్రభుత్వంగా సీరియస్‌గా ఆలోచించాలి. యూనివర్సిటీల్లోని కొన్ని డిపార్ట్మెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం వాటిల్లో ఒక్క రెగ్యులర్ ఫాకల్టీ లేనివి కూడా ఉన్నాయి. పీహెచ్డీ సీట్ల విషయంలో కొన్ని డిపార్ట్మెంట్స్ పరిశోధన అవకాశాలను పూర్తిగా నిలిపివేశాయి.
యూనివర్సిటీలు సమాజానికి, అభివృద్ధికి మధ్య అనుసంధానంగా ఉంటాయి. సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని చూయిస్తాయి. ప్రగతి మార్గంలో నడిపిస్తాయి. ప్రజల ఆకాంక్షలకు కార్యరూపం ఇస్తాయి. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను యూనివర్సిటీలే చర్చకు పెట్టాయి. ప్రొఫెసర్ జయశంకర్ ఒక ప్రొఫెసర్‌గా తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎంతో మంది తమ ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేశారు. ఈ ఆచరణ రూపాలన్నింటికి కార్యక్షేత్రం యూనివర్సిటీలే. పోరాటానికి, ఆరాటానికి ప్రతీకలు యూని వర్సిటీలు. కానీ, నేడు మన యూనివర్సిటీల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు గడిచినా, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ఉద్దేశ్య పూర్వక పట్టింపులేని తనం కారణమా? 2004, 2010, 2014, 2017లో ఓయూలో ఉద్యమ నాయకుడికి జరిగిన అవమానాలకు ప్రతీకారామా? ఆలోచించాలి.
యూనివర్సిటీల అభివృద్ధి నిధులు, నాణ్యమైన పరిశోధన అవకాశాల కొరకు వివిధ విద్యార్థి సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఉన్నత విద్యపై బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్ చేశాయి. ఫ్యాకల్టీల నియామాకాలపై ధర్నాలు చేశాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రొఫెసర్లే యూనివర్సిటీల్లో నియామాకాలు జరిపి, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని దీక్షలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన జీఓ వచ్చినప్పటికి అమలుకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితులు మారాలి. తెలంగాణ మోడల్లో ఉన్నత విద్యపై ఉన్న మచ్చలను తొలగించుకోవాలి. విశ్వవిద్యాలయాల పనితీరుపై సమీక్షలు నిర్వహిం చాలి. అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలి. నాణ్యమైన ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీలను నియ మించాలి. విశ్వవిద్యాలయాల పరిశోధనలతో తెలంగాణ ప్రభుత్వం ములాఖత్ కావాలి. పరిశోధన ఫలితాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఉపయోగించుకొని బంగారు తెలంగాణ దిశగా మన ప్రయాణం సాగించాలి. అస మానతలు, అవమానాలులేని ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవాలి. తెలంగాణ పునఃనిర్మాణంలో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం అనివార్యం. వీటిని దష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ విద్యార్థులకు ప్రభుత్వాలు మెరుగైన అవకాశాలు కల్పించాలి. అవకాశాలను కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. అప్పుడే నిజమైన ప్రజా ప్రభుత్వంగా నిలిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమా? ప్రభు ప్రభుత్వమా? అన్నది ప్రజలు తేల్చుకుంటారు.
– ఇమ్మిడి మహేందర్
9505645706