మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి..

– బాలబాలికల కళాశాల సొంత వసతి గృహాలను ఏర్పాటు
నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, బాల బాలికల కళాశాల సొంత వసతి గృహాలను ఏర్పాటు చేయాలని, కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్యు) ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించి తాహాసిల్దార్ కార్యాలయం లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్ లు మాట్లాడుతూ డిచ్ పల్లి మండల కేంద్రం మూడు జిల్లాలకు, నాలుగు మండలాలకు కేంద్రంగా విద్యార్థులకు దగ్గరలో ఉన్నదనీ వేంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. నిజామబాద్ రూరల్, వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు హాస్టల్ లేకపోవాడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే బాల బాలికల కళాశాల సొంత వసతి గృహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మూత్రశాలాలు,  లేకపోవడం సిగ్గుచేటన్నారు. చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.వెంటనే డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, బాలబాలికల కళాశాల వసతి గృహాలను మంజూరు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్దు, సాయి తేజ,  నాయకులు హేమంత్, వైష్ణవి, నమిత, జోష్ణ లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.