మెప్పించే కెప్టెన్‌ మిల్లర్‌

ధనుష్‌ నటిస్తున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40 నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ధనుష్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా రూపొందుతోంది. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి.జి.త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, నివేదితా సతీష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే స్టన్నింగ్‌ మేకింగ్‌ విజువల్స్‌తో అందరి దష్టిని ఆకర్షించింది. తాజాగా మేకర్స్‌ ఎక్సైటింగ్‌ అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ని జూన్‌లో, టీజర్‌ని జూలైలో రిలీజ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.