‘దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి’ వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంటున్నారు ధీరజ్ మొగిలినేని. సుహాస్ హీరోగా జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మీడియాతో మట్లాడుతూ, ‘లాక్ డౌన్ తర్వాత డైరెక్టర్ దుశ్యంత్ నాకు ఈ సినిమా కథను డైలాగ్ వెర్షన్‌తో సహా చెప్పాడు. తన జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌తో రాసుకున్నాడు. స్టోరీ చాలా బాగుందని అనిపించింది. ఈ సినిమా కథ ఎలా సహజంగా ఉందో అలాగే కాస్టింగ్, లొకేషన్స్ ఉండాలని ప్లానింగ్ చేసుకున్నాం. ట్రైలర్ చూసి మా సినిమాలో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు.ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక ఇది లవ్ స్టోరీ కావొచ్చని అన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ ‘కలర్ ఫొటో’ లాంటి మూవీ చేశాడు. తన పర్‌ఫార్మెన్స్ ఇందులో ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. అయితే ఇందులో ఎలాంటి సందేశం చెప్పడం లేదు. సుహాస్ అక్క క్యారెక్టర్‌లో శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం. మా బ్యానర్‌లో ప్రస్తుతం రష్మికతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ చేస్తున్నాం. అలాగే మరో మూడు ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి’ అని చెప్పారు.