మత్స్యకార కులాల జీవన చిత్రణ

A depiction of fishing caste lifeమత్స్యకార కులాలన్నీ చేపల వేటను వత్తిగా చేసుకొని జీవిస్తున్నాయి. అలా చేపల వేట పైనే ఆధారపడ్డ కులాలు, వర్గాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ప్రాంతాలవారీగా గమనిస్తే అగ్నికుల క్షత్రియ, బెస్త, పల్లి, వాడబలిజ, జాలరి, గంగపుత్ర, వన్యకుల క్షత్రియ, బోయ, నెయ్యల, పట్టపుకాపు- ఇలా వివిధ పేర్లతో వీరిని పిలుస్తుంటారు. ఇందులో ఎవరికి వారికి ప్రత్యేకమైన జీవన విధానం, ఆచార వ్యవహారాలు, వత్తిపరమైన అలవాట్లు, కట్టుబాట్లు ఉన్నాయి.
విశాఖపట్నం సముద్రతీరం అంతటా ఊళ్ళలో వాడబలిజలు ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ల వత్తి చేపలు పట్టడం. చేపలు పట్టే వాళ్ళని చాలా పేర్లతో పిలుస్తారు. ప్రధానంగా బెస్తలు, జాలర్లు అంటారు. వాడబలిజలు మాత్రం తమని తాము ‘వాడోళ్లు’ అనే చెప్పుకుంటారు. జాలర్లను వాళ్లకంటే కాస్త తక్కువ వాళ్ళుగా పరిగణిస్తారు. అనేక ఓడరేవులు, సువిశాలమైన సముద్ర తీర ప్రాంతంతో ఉన్న మన దేశంలో నౌకా నిర్మాణ కేంద్రాలు కూడా ఉండేటివి. ఆంగ్లేయుల నిర్బంధాలు- ఆంక్షల వల్ల అవన్నీ మూతబడ్డాయి. ఓడ నిర్మాణంలో పాలుపంచుకునే వాడబలిజలు నిరాశ్రయులై, గత్యంతరం లేక చేపలు పట్టుకునే వత్తిలోకి మళ్లాల్సి వచ్చింది. అందుకే వారు ”మేము పూర్వకాలంలో ఓడలు తయారు చేసే వాళ్ళం అనీ, ఏదో ఒక కాలంలో చేపలు పట్టుకునే వత్తికి మారిపోయాం” అని అంటారు. ఒక విధంగా ఈ మారిన పరిణామ క్రమాన్ని ప్రసాద సూరి ”మైరావణ” నవలలో చిత్రించడానికి ప్రయత్నం చేశారు.
ఈ నవలలో పలు రకాల వలలు, అవి తయారు చేసే విధానం, వాటితో చేపలు పట్టడం, వలలో పడిన రకరకాల చేపల గురించిన వర్ణన ఉంది. అంతవరకు వెదురు బద్దలతో అల్లిన పుట్లలోనే చేపలు పట్టేవారు. ఇది మూడు నాలుగేళ్లు పని చేస్తుంది. తర్వాత మళ్లీ కొత్త పుట్టు చేయించుకోవాలి. మన్నిక- నాణ్యత కోసం మైరావుడు ఆలోచించి ఫైబర్‌తో పుట్టు చేయిస్తాడు. ఫైబర్‌ పుట్టు పనితనం బాగానే ఉండటం చూసి ఊర్లో జనాలు కూడా మెల్లమెల్లగా ఫైబర్‌ పుట్లు కట్టించుకోవడం మొదలెడతారు.
మైరావుడు అందరిలాగే వలతాళ్లు, పుట్టు, కత్తావలు చేసుకుని పాటోడ్డం మొదలెట్టాడు. పాటుపడటమే పాటోడ్డం. చేపలు పట్టడానికి వేటాడటం లాగే ఈ మాట కూడా ఎక్కువ వాడుతారు. అయితే పాటోడ్డటానికి అందరిలాగా మైరావుడు చేపలు కొనుక్కునే సేట్ల దగ్గర పెట్టుబడి తీసుకోలేదు. అది కొంతమందికి ఆశ్చర్యం అనిపించింది. మాచర్లలో మేదరి శీను దగ్గర ఓ మంచి దిట్టమైన గుండ్రటి బద్ద పుట్టు ఒకటి తయారు చేయించాడు. రెండు వాటమైన కత్తావలు, రెండు కుదురైన పుట్టుకర్రలు, నాలుగు వలమూటలు- ఆయన్ని ఏసుకొని మైరావుడు ఏటకు వెళ్తే చేపలు ఎదురువచ్చి వలలో పడిపోయేవి. ఊర్లో జనాలు మైరావుడి పాటుకు కుళ్ళుకునే వాళ్లు. పైగా చేపలు బాగా పడే జాగాలు అంజనం ఏసి చూసినట్టు పోయి అక్కడే వలలు ఏసివోడు. రాను రాను చేపలు పట్టడంలో కూడా కొత్త పద్ధతులు వచ్చాయి. బాంబులతో చేపలు పట్టడం మొదలుపెట్టారు.
ఆ ఏడాది కాలవ పాటు ఇరుక్కుమేసింది. పుట్లు అన్నీ చేపల బరువుకి దండి (అంచులు) దాకా మునిగిపోయి ఒడ్డుకు వస్తున్నాయి. ఆడా మగా పిల్లా జెల్లా అంతా నీళ్లలోనే ఉన్నారు. రాత్రి వేసిన వలలు ఉదయం ఎత్తేసి, మళ్ళీ అప్పుడే ఏసేసి, పడిన చేపలు జీపు దగ్గర గుమాస్తాలకి జోకేసి, మధ్యాహ్నం అన్నాలు తినేసి, మళ్ళీ నీళ్లలోకి వెళ్లి ఉదయం వేసిన వలలు ఎత్తివేసేసి, సాయంత్రం మళ్లీ చేపలు జోకేస్తున్నారు. ట్రేలు సరిపోవడం లేదు. ఐస్‌ మిగలట్లేదు. చేపల జీపు ఎప్పటికప్పుడు మాచర్ల వెళ్లి రావాల్సి వస్తుంది. రవ్వలు, చిత్తర్లు ఇరగబడి తగిలేస్తున్నాయి. ఇళ్ల దగ్గర ఆడోళ్ళు కత్తిపీటల ముందు నుంచి లేవడం లేదు. ఉన్న చేపలు కోసి, ఉప్పు ఎట్టేలోపు బేసిన్ల కొద్దీ చేపలు వచ్చేస్తున్నాయి. ఐస్‌ లేక చేపలు కుళ్ళిపోతే 100 కిలోల చిత్తర చేప పారబోశారు.
బుగ్గవాగు చెరువులో నీళ్లు నిండిపోయాక ఆరునెల్లు చేపలు పట్టకూడదు. ఆ సమయంలో చాలా కుటుంబాలు తాత్కాలికంగా వలతాళ్లు, తట్టా బుట్టా సర్దుకొని లారీలకెత్తుకుని గుమ్మడం వస్తుంటాయి. అలా వచ్చిన కుటుంబాలు అక్కడ చేపలు కొనే శేట్ల దగ్గర పెట్టుబడి తీసుకొని కొత్తవలలు కొనుక్కొని, ఆ కొన్ని నెలలు చేపలు పట్టి, పెట్టుబడి అప్పు తీరిపోను మిగిలిన దానితో తిరిగి వెళ్తారు. దసరాకి ముందు వచ్చిన వాళ్ళు సంక్రాంతి తర్వాత వెళ్లిపోతారు.
రామాయణం (అవాల్మికం) లో కనిపించే జిత్తులమారి, సాహస వీరుడు మైరావణుడికి ఈనాటి సాంఘిక రూపమే ”మైరావణ” నవల. ఈ నవలలో మైరావుడు చేసే పనులు, సాహసాలకు ప్రజలు కల్పనలు, అతిశయోక్తులు జోడించి అతన్ని ఒక జానపద కథానాయకుడిగా చెప్పుకునే విధానం ఇందులో కనిపిస్తుంది. తెలుగునాట నెలకొన్న సమకాలీన సంఘటనలు, రాజకీయాలను కూడా అత్యంత నేర్పుగా ఇందులో జోడించిన ఈ నవల, మ్యాజిక్‌ రియలిజం ధోరణిలో ఉండి పాఠకులను ఆకట్టుకుంటుంది.
కె పి అశోక్‌ కుమార్‌
9700000948