అనాది కాలంలో అన్ని దేశాల్లో మానవుని జీవనాధారం వ్యవసాయం. కాలక్రమేణా మానవుని మేధస్సు వృద్ధి చెందుతూ అనేక అవసరతలు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే అనేక వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. పారిశ్రామికీకరణ ఊపందుకుంది. ఆదాయం పెరిగి, వలసలు ప్రారంభమయ్యాయి. 17వ శతాబ్దం నుండి ప్రారంభం అయిన వివిధ రంగాల అభివృద్ధి, నేడు 21వ శతాబ్దంలో సాఫ్ట్‌వేర్ రంగం పురోగాభివృద్ధితో అత్యున్నత స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం చదువులో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్వం పొట్ట పోషణకు, విజ్ఞానానికి సంబంధించిన సిలబస్ మాత్రమే అభ్యసించే పరిస్థితి. నేడు అనేక అద్భుతాలు, ఆవిష్కరణలు చేయడమే ప్రధాన ధ్యేయంగా అనేక నూతన సిలబస్ ప్రవేశపెడుతున్నారు. దీనికి తోడు ప్రతీ రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలు రోజురోజుకూ నూతన ఒరవడులు సంతరించుకుంటున్నాయి. రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి చదువులు ప్రవేశపెట్టడం చూస్తూనే ఉన్నాం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్ (స్టెమ్) అనే పేరుతో విద్యావిధానం దుస్సెల్లుతోంది.
గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచం అంతా కుగ్రామంగా మారింది. ప్రతీ పని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడింది. కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, రాడార్ వ్యవస్థ వంటి వాటితో అనుసంధానం కీలకమైంది. ప్రతీ విషయం డిజిటలైజేషన్ చేయబడుతుంది. వి.ఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ , ఇమేజ్ మిర్రరింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.. ప్రపంచంలో అనేక దేశాలు అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా వంటి దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో అగ్రభాగాన నిలుస్తున్నాయి. కారణం వారి విద్యా విధానంలో అనేక నూతన సిలబస్‌లతోపాటు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేయడం. దానికితోడు నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగడం. ప్రపంచ స్థాయిలో ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఈ దేశాల్లో ఉండుటచే మిగిలిన దేశాల విద్యార్థులు ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వలసెళ్లుతున్న పరిస్థితి ఉంది. దీనికి భిన్నంగా మనదేశంలో విద్యారంగం కూనరిల్లుతున్నది. దేశవ్యాప్తంగా ఏ కళాశాల, విశ్వవిద్యాలయం చూసినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కొరత, మౌలిక సదుపాయాలు లేమి, లేబరేటరీలు, గ్రంథాలయాలు లేకపోవడం వలన నాణ్యమైన విద్య ప్రశ్నార్థకమైంది. అశాస్త్రీయ ప్రమాణాలతో విద్యార్థులు ఉత్తీర్ణత పట్టాలు పట్టుకుని బయటకు వచ్చి, నైపుణ్యాలు లేక నిరుద్యోగంతో మగ్గిపోతున్న దుస్థితి ఉంది. ప్రభుత్వ విద్యా రంగానికి నిధులు లేక సతమతమవుతున్నాయి. కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం లేక చాలామంది ప్రయివేటుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది విద్యార్థులకు సరైన ప్రమాణాలు నైపుణ్యాలు లేక, ప్రపంచ పోటీలో నిలువలేక ఉద్యోగ లేమితో బాధపడుతున్నారు… నైపుణ్యాలు లేక పోవడంతో అసంఘటిత రంగంలో కార్మికులుగా, తక్కువ జీతంతో పనివారిగా మారుతున్న పరిస్థితి. కువైట్, యు.ఏ.ఈ , ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు అతి తక్కువ వేతనాలకు సమ్మతించి వలసెళ్లడం, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ కూలీలుగా మారడం, కొంతమంది ఏజెంట్ల మోసాలతో జైళ్లల్లో మగ్గడం నిత్యం వార్తల్లో కనిపిస్తున్న వాస్తవాలే. దీనికి ప్రధాన కారణం మన దేశంలో నైపుణ్యాలకు కొదవలేదు, కానీ దీన్ని అందిపుచ్చుకునే పాలకులు, నాణ్యమైన విద్యకు ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి వెంటాడుతోంది.
ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది యువత ఉన్న మనదేశంలో సరైన విద్యా సౌకర్యాలు లేక వెలవెలబోవడం ఎంతమాత్రం సరికాదనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. విద్యా రంగాన్ని బలోపేతం చేసి, ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత నిచ్చేలా నిధులు కేటాయించాలి. ” స్కిల్ డెవలప్మెంట్” కు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించడంతో పాటు దాన్ని అమలయ్యేలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. చిన్న సౌకర్యాలు ఉంటేనే మనవాళ్లు అనేక అద్భుతాలు ఆవిష్కరణలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రపంచ దేశాల సరసన అనేక రంగాల్లో మనదేశాన్ని ముందు వరుసలో నిలబెడతారని గ్రహించాలి. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలు చేపట్టాలి. అనుభవం, మేధస్సు గలవారిని నియమించాలి. కుల మత ఛాందస భావాలకు చరమగీతం పాడాలి. పారిశ్రామికీకరణ, సాప్ట్‌వేర్ రంగాన్ని పరుగు పెట్టించే చర్యలు తీసుకోవాలి. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఒరవడులు సృష్టించబడాలి. నిరుద్యోగం లేకుండా చూడాలి. యువత మేధస్సు, నైపుణ్యాలతో నూతన ఆవిష్కరణలు చేస్తూ, ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించాలి. తలసరి ఆదాయంతో పాటు జాతీయ ఆదాయం పెంచాలి. జీడీపీ వృద్ధి రేటు పెరగడానికి యువతలో నైపుణ్యాలు పెంచుట ద్వారానే సాధ్యం అని గ్రహించాలి. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించాలంటే, విద్యారంగాన్ని ప్రభుత్వం రంగంలో కొనసాగిస్తూ, అధిక నిధులు సమకూర్చి ప్రమాణాలు నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయుటయే రాబోయే 2047 సెంచున్యరీ స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలకు మనం దేశానికి ఇచ్చే పెద్ద బహుమతి. ఇది పాలకులు గుర్తించినప్పుడే ” వికసిత భారత్” సాధ్యం. అంతవరకు ఇది ఒక నినాదం మాత్రమే.
(జులై15 ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం)
– ఐ.ప్రసాదరావు, 6305682733