– ఇప్పటివరకు చూసింది అభివృద్ధి ట్రయలరే : మీరట్ ర్యాలీలో మోడీ
మీరట్ : మరికొద్ది రోజుల్లో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదని, వికసిత్ భారత్ కోసం కూడానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత పదేళ్లలో అభివృద్ధికి సంబంధించి కేవలం ట్రయలర్‌ను మాత్రమే ప్రజలు చూశారని, ఇప్పుడు దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లబోతున్నామని చెప్పారు. రాబోయే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌ను తమ ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఆదివారం నిర్వహించిన మొదటి ర్యాలీలో మోడీ ప్రసంగించారు. విప్లవానికి, విప్లవ వీరులకు పుట్టినిల్లు మీరట్ అని కొనియాడారు. చౌదరి చరణ్ సింగ్ వంటి గొప్ప నేతలను దేశానికి అందించిందని గుర్తు చేసుకున్నారు. మూడో దఫా పదవీకాలాన్ని చేపట్టడానికి తమ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిందని చెప్పారు. మొదటి వంద రోజుల్లో తీసుకోవాల్సిన ప్రధాన నిర్ణయాలు ఏమిటనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామన్నారు. తాను దారిద్య్రంలోనే పెరిగానని, అందుకే తనకు ప్రతి నిరుపేద కష్టం తెలుసునని చెప్పారు. వారి బాధలు, కష్టాలను తాను అర్ధం చేసుకుంటానన్నారు.
అందువల్లే వారి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేలానే తాను పథకాలు రూపొందిస్తున్నానన్నారు. పేదలకు సాధికారత కల్పించడమే కాకుండా వారికి ఆత్మగౌరవం కూడా కల్పిస్తామని చెప్పారు. అవినీతిపై పోరాడుతున్నందు వల్లే అవినీతిపరులు కటకటాల వెనుకవున్నారని, ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని అన్నారు. ఇటీవల ఎన్‌డిఎలో చేరిన ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు జయంత్ చౌదరి కూడా మోడీతో వేదికను పంచుకున్నారు. మీరట్ నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రామాయణ్ ఫేమ్ అరుణ్ గోవిల్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా సిఎం నయీబ్ సింగ్ సైనీ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.