12 వ శతాబ్దంలో రెండవ కులోత్తుంగ చోళుని కాలంలో శైవానికి, వైష్ణవానికి మధ్య కొన్ని యుద్ధాలు జరిగాయి. శివుడే దేవుడని, విష్ణువు దేవుడు కాదని, అందరూ పంచాక్షరి మంత్రాన్నే జపించాలని శాసిస్తాడు రాజు. అష్టాక్షరి మంత్రాన్ని జపించిన వాళ్ళను తీవ్రంగా హింసించి సముద్రంలో ముంచేస్తాడు. రాజు ఎన్ని కష్టాలు పెట్టినా సరే అష్టాక్షరి మంత్రాన్నే ఆరాధిస్తానన్న వైష్ణవ భక్తుని భక్త్యావేశాన్ని తెలియజేస్తూ వెన్నెలకంటి ఓ పాటను రాశాడు. దశావతారం (2008) సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
వెన్నెలకంటి శబ్దభావసౌందర్యం బాగా తెలిసిన కవి. కథాసన్నివేశానికి తగ్గట్టుగా పాటను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దగలడు. ఆయన రాసిన ప్రతీపాట లోతైన భావుకతతో తొణికిసలాడుతుంది.
2008లో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘దశావతారం’ సినిమాలో అలాంటి గొప్ప పాటను రాశాడు వెన్నెలకంటి. శైవం, వైష్ణవం రెండింటి మధ్యన కలిగిన వైరాన్ని తెలియజేస్తుంది ఈ పాట. ఒక వైష్ణవ భక్తుడి భక్తితత్త్వాన్ని వివరిస్తుందీపాట.
సినిమాకథపరంగా చూసినట్లయితే..
చిదంబరంలో నటరాజస్వామితో సమానంగా పూజలందుకుంటున్న గోవిందరాజస్వామిని సమూలంగా పెకిలించాలనుకుంటాడు రెండవ కులోత్తుంగచోళుడు. పరమ వైష్ణవ భక్తుడైన రంగరాజ నంబి గోవిందరాజస్వామి విగ్రహాన్ని తీసేయ్యనివ్వకుండా అడ్డుకుంటాడు. రాజు రంగరాజ నంబిని బంధించి, ‘ఓం నమ:శివాయ:’ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించమని, ‘ఓం నమో:నారాయణాయ:’ అనే అష్టాక్షరి మంత్రాన్ని పఠించకూడదని హెచ్చరిస్తాడు. కులోత్తుంగచోళునికి రంగరాజ నంబి చిన్ననాటి మిత్రుడవడం వల్ల మొదట నెమ్మదిగా చెప్పి చూస్తాడు. వినకపోతే అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి సముద్రంలో ముంచేయాలనుకుంటాడు. ప్రాణం మీదికి వచ్చినా అష్టాక్షరి మంత్రాన్ని వదిలిపెట్టని ఆ పరమ వైష్ణవ భక్తుని ఆవేశం ఈ పాటలో కనబడుతుంది. ఈ పాటను ఆ భక్తుడు హృదయంతో పాడుతాడు. తన మనసులో నారాయణునిపై ఉన్న ఆరాధనను, భక్తిభావనను తెలియజేస్తాడు.
గోవిందరాజస్వామి విగ్రహాన్ని పెకిలించి, తనను, గోవిందరాజస్వామిని సముద్రంలో ముంచేయాలనుకునే రాజుకి తాను హెచ్చరికగా ఈ పాటను వినిపిస్తున్నాడు. రాయిని మాత్రమే దేవుడనుకుంటే పొరపాటు. మనం రాయిని మాత్రమే చూస్తే అందులో దేవుడు కనిపించడు. అలా అని దేవున్ని మాత్రమే చూస్తే మనిషి దేహం కనిపించదని అంటాడు. శ్రీహరిని తలచే నా హృదయం నేడు శివున్ని తలవదని, అష్టాక్షరి మంత్రం జపించే నోరు పంచాక్షరి మంత్రం జపించదని చెబుతాడు. వంకర కన్నులతో ఉండే మీరు శంకర కింకరులు. వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు అని చెబుతూ తన భక్తిభావనను తెలియజేస్తాడు. రాజ్యలక్ష్మికి నాథుడు ఒక్క ఆ శ్రీనివాసుడే.. లోకాలేలే జగన్నాథుడే. ఆ శ్రీనివాసునికి వారసుడు ఈ రంగరాజనంబి అనే విష్ణుదాసుడేనని చెప్పుకుంటున్నాడు. ఈ దేశాన్ని పరిపాలించే వారంతా రాజ్యదాసులు. తాను మాత్రం విష్ణుదాసుడు.. రాజులందరికి రాజు ఈ రంగరాజ నంబియేనని ఆత్మవిశ్వాసంతో చెప్పుకుంటున్నాడు.
ఆ రాజు ఎంత బాధపెట్టినా తాను మాత్రం అష్టాక్షరిని జపిస్తూనే ఉంటాడు. నిలువు నామాన్ని దాల్చే తన తలని ఆ రాజుకి వంచనని, నిలువునా తనను చీల్చుతున్నా మాట మాత్రం మార్చనని నిక్కచ్చిగా చెబుతాడు. వీరశైవుల ఈ బెదిరింపులకు పరమవైష్ణవం వణకదని చెబుతాడు. రాజు ఆజ్ఞ అని మమ్మల్ని మీరు భయపెట్టినా, ధిక్కరించినా, మేము భయపడినా పడమర దిక్కున సూర్యుడేం రాడులే. అని భక్త్యావేశంతో పాడుతుంటాడు. ఆ రాజు ఎన్నో శాసనాలు చేసినా, అధికారంతో, అహంకారంతో ఎంత క్రూరంగా ప్రవర్తించినా తనలోని భక్తిని ఆపలేరన్న విషయాన్ని ఆ భక్తుడు స్పష్టం చేస్తున్నాడు.
రంగరాజ నంబిని గోవిందరాజస్వామి విగ్రహంతో సహా నీటిలోకి ముంచేస్తున్న ఘట్టం వైష్ణవభక్తుల్ని కలచివేస్తుంది. అయినా రంగరాజ నంబి బాధపడడు. నీటిలోని ముంచినంత మాత్రాన నీతి చావదు కదా.. గుండెల్లో వెలుగును నింపే ఆ గోవిందరాజస్వామి అనే అఖండజ్యోతి ఆరిపోదు కదా.. సర్వాంతర్యామియై అణువణువునా తేజోమయ కాంతిపుంజాలతో ప్రకాశిస్తున్న నారాయణ స్వరూపం అందరికీ వెలుగులు పంచుతూనే ఉంటుంది. అందరిలోనూ వెలుగై వెలుగుతూనే ఉంటుంది. అది ఎన్ని కాలాలు మారినా, ఎన్ని రాజ్యాలు, అధికారాలు పంజా విసిరినా, ఎన్ని యుగాలు గడిచినా ఆ వెలుగు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు రంగరాజనంబి.
వైష్ణవాన్ని అంతం చేస్తున్నానని విర్రవీగే ఆ కులోత్తుంగచోళుడనే రాజుతో రంగరాజనంబి చెప్పిన మాటలివి. చిన్న దీపాలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పుతుందా? నేలను ముంచేసే జడివాన ఆకాశం నుంచి వస్తుంది.. కాని ఆ ఆకాశాన్నే అది తడుపుతుందా? రంగరాజనంబి అనే చిన్న దీపాన్ని ఈ వీరశైవం ఆర్పవచ్చు.. కాని విశ్వమంతా వెలుగుతున్న వైష్ణవజ్యోతిని ఎవరూ ఆర్పలేరు. అది వెన్నెలవెలుగు. జడివానలా మారి నేలను ముంచే రాజు అధికారం ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన వైష్ణవాన్ని ఏ మాత్రం తడపలేదన్న విషయాన్ని రంగరాజనంబి మాటలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు తప్పు చేస్తే రాజుకి దండించే అధికారముంటుంది. కాని ప్రజలు తమకు నచ్చిన దైవాన్ని, తమకు నచ్చిన రీతిలో పూజించుకునే స్వేచ్ఛను కాదనే హక్కు ఏ రాజుకీ లేదు. ఇక్కడ రంగరాజనంబి ఆవేశానికి, బాధకి కారణమిదే. వైష్ణవాన్ని, వైష్ణవభక్తులను, తనను ఇంత బాధించిన శైవాన్ని తాను దైవంగా ఒప్పుకోనంటాడు. దైవం కోసం పోరాడే సమయం తనకిక లేదంటాడు రంగరాజనంబి. గోవిందరాజస్వామితో కలిసి తాను సముద్రంలో మునిగిపోతూ రంగరాజనంబి చెప్పిన మాటలివి.
ఇది సినిమా సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాసిన పాట. హిందూమతంలో ఒకప్పుడు శైవానికి, వైష్ణవానికి మధ్యన తలెత్తిన యుద్ధాలను గురించి ఈ పాట తెలియజేస్తుంది. ఇప్పుడు ఇలాంటి తేడాలు లేక భక్తులంతా శివాయ విష్ణురూపాయ అనే నామంతో, శివునికి, విష్ణువుకి భేదం లేదని చెబుతూ ఆధ్యాత్మిక లోకంలో సంచరిస్తుండడం సంతోషించదగ్గ విషయం.
పాట:
ఓం నమో నారాయణాయ/ రాయిని మాత్రం కంటే/ దేవుడు కనరాడు/ దేవుని మాత్రం కంటే దేహం/ కనరాదు/ హరిని తలచు నా హృదయం/ నేడు హరుని తలచుట జరగదులే/ అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే/ వంకర కన్నుల మీరు శంకర కింకరులు/ వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు/ నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే/ నిలువునా నను చీల్చుతున్నా/ మాట మార్చనులే/ వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే/ ప్రభువు ఆనతికి జడిసే నాడు/ పడమట సూర్యుడు పొడవడులే/ రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే/ శ్రీనివాసుడి వారసుడీ విష్ణు దాసుడే/ దేశాన్నేలే వారంతా రాజ్యదాసులే/ రాజులకు రాజు ఈ రంగరాజనే/ నీటిలోన ముంచినంత నీతి చావదులే/ గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే/ దివ్వెలనార్పే సుడిగాలి/ వెన్నెల వెలుగును ఆర్పేనా/నేలను ముంచే జడివాన/ ఆకాశాన్నే తడిపేనా/ శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట/ దైవం కోసం పోరే సమయం లేదంట..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీగేయరచయిత, 6309873682