”..నేను డైరీ ఎందుకు రాద్దామను కుంటున్నాననే విషయానికి వస్తా. నాకు స్నేహితులు లేరు. నన్ను మరింత స్పష్టంగా చెప్పనియ్యి. పదమూడేళ్ల బాలిక ఈ ప్రపంచంలో పూర్తిగా ఒంటరితనం అనుభవిస్తోందంటే ఎవరూ నమ్మరు…” అంటూ 1942 జూన్ 12న మొదలు పెట్టి, 1944 ఆగస్టు 1 వరకు… 26 నెలల పాటు తనను అనాథను చేసిన యుద్ధం మిగిల్చిన ఒంటరితనాన్ని ఒక డైరీలో రాస్తుంది ఓ అనాథ. డచ్ భాషలో రాసిన ఈ డైరీ 1947లో ‘ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో ప్రచురితమైంది. ఇలాంటి అనాథలు రాయడానికి అవకాశం లేని విషాదగాథలు.. కన్నీళ్లు మిగిల్చిన జీవితాలు.. దిక్కుతోచని బతుకులు అనేకం. యుద్ధం, కరువు, వలసలు, సామాజిక హింస, పేదరికం, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు వంటివి పిల్లలు అనాథలుగా మారడానికి కారణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 18ఏండ్లలోపు పిల్లలు 15.3 కోట్లమంది అనాథలుగా మారుతున్నారని యునిసెఫ్ వెల్లడించింది. ‘ప్రపంచంలో ఎంతోమంది ఒక్కపూట తిండికోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మరెంతోమంది కన్నప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు’ అంటారు మదర్ థెరిసా.
రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులను అనాథలుగా మిగిల్చాయి. ఇది చరిత్ర రాసిన డైరీ. తాజాగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేండ్లకుపైగా అయింది. గాజాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన నరమేధం ఏడాది దాటిపోయింది. ఈ దేశాల నుంచి లక్షలాది మంది వలసపోయారు. లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి. గాజాపై ఇజ్రాయిల్ దాడిలో చనిపోయినవారు కాకుండా.. దాదాపు 19వేలకు పైగా చిన్నారులు అనాథలయ్యారని ఐరాస పిల్లల సంస్థ (యునిసెఫ్) నివేదించింది. ప్రపంచమంతా యుద్ధం గురించి, ఆర్థిక సంక్షోభం గురించే మాట్లాడుతోంది కానీ, యుద్ధం మిగిల్చిన చిన్నారుల గురించి, వారికి యుద్ధం చేసిన గాయాల గురించి… అనాథలుగా మారిన వైనం గురించి దృష్టి సారించాల్సిన సమయం ఇది. వారి భవిష్యత్ ఏమిటో అర్థంకాని దుస్థితిలో వారున్నారు. అలాగే, కరువు, వరదలు, విపత్తులు మిగిల్చిన అనాథలు మరికొందరు. అనాథలుగా మిగిలిన వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుంది. సరైన సంరక్షణ, పేదరికం, అనారోగ్యం, చదువు లేకపోవడం, దోపిడీకి గురవడం… వీరిని వేధించే ప్రధాన సమస్యలు. వీరెవరూ పుట్టుకతో అనాథలు కాదు. ఆధిపత్యం కోసం, మతవ్యాప్తి కోసం.. జాతి, భాష, ప్రాంతం వంటి వివక్షతలతో చెలరేగుతున్న యుద్ధాలు మిగిల్చిన అనాథలు వీరు. బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరైతే…ఏ తోడూ లేకుండా అనాథలుగా గడుపుతున్నవారు మరికొందరు. ఏ కొద్దిమందో తప్ప…ఎక్కువమంది జీవితాలు దారితప్పి ఆగమైపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల మందికి పైగా చిన్నారుల జీవితాలు కడు దుర్భరంగా మారాయి. ప్రతి పదిమందిలో తొమ్మిది మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారని డబ్ల్యుహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆండ్రూ జాక్సన్ వంటి ప్రపంచ నాయకులు, లియో టాల్‌స్టారు వంటి రచయితలు, ఆరోన్ హెర్నాండెజ్ వంటి క్రీడాకారులు, మార్లిన్ మన్రో వంటి సెలబ్రిటీలు కూడా అనాథలుగానే తమ జీవితాలను ప్రారంభించి…ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సంకల్పం వుంటే.. సాధించలేనిది లేదు. అనాథ పిల్లలు కూడా సమాజంలో అంతర్భాగమే. వారిని సంఘవిద్రోహ శక్తులుగా మారకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా దారి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అనాథ పిల్లల చదువు, సంరక్షణ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. ‘చిట్టితల్లుల బెదురు కళ్లలో/ చెదిరిపోతున్న నిదుర కలలు/ ప్రపంచ శాంతి కాముకులకు/ కునుకు పట్టని రాత్రుల్ని/ బహూకరి స్తున్నాయి’ అంటారొక కవి. అనాథలవుతున్న పిల్లల దుస్థితిని ఈ ప్రపంచానికి తెలియజెప్పడం కోసం, తల్లిదండ్రులు లేని పిల్లలకు అవగాహన కల్పించడం కోసం, వారి హక్కులను ప్రోత్సహిం చడం కోసం.. ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది నవంబర్ రెండోవారంలో ‘ప్రపంచ అనాథల దినోత్సం’ నిర్వహిస్తారు. ‘కూలిన ప్రతి కష్టం దగ్గర/ నిశ్శబ్దంగా కూర్చుని చూస్తాను/ మొలకలాంటిదేదైనా/ కవితని ఎత్తుకుని పైకి లేస్తుందని’ అంటారు కవయిత్రి మెర్సీ మార్గరెట్. చిన్నారుల జీవితాలకు భరోసానివ్వాలి. పిల్లలులేని తల్లిదండ్రులు అనాథ బిడ్డలను దత్తత తీసుకునే సత్ సాంప్రదాయం పరిఢవిల్లాలి. అన్నిటికీ మించి అనాథల శ్రేయస్సు కోసం సమగ్రచట్టం తేవాలి.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్