భిన్న ప్రయోగాత్మక చిత్రం

A different experimental imageవికాస్‌ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్‌ నందివాడ, కిషోర్‌ ప్రధాన పాత్రల్లో బి.బి.టి.ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భాను భవ తారక దర్శకత్వంలో కార్తీక్‌ సేపురు, భాను భవ తారక, తరుణ్‌ విఘ్నేశ్వర్‌ సేరుపు నిర్మిస్తున్న చిత్రం ‘ప్లాట్‌’. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా పాల్గొని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో దర్శక, నిర్మాత భాను భవతారక మాట్లాడుతూ, ‘వేణు తీసిన ‘నీదీ నాదీ ఒకే కథ’ నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా టైంలో ఈ కథ రాసుకున్నాను. నా స్నేహితులతో కలిసి సినిమాను నిర్మించాను. వికాస్‌ అయితే ఈ కథకు బాగుంటుందని అనుకున్నాం. మా దగ్గర ఉన్న వనరులతో సినిమాను తీశాం. ట్రైలర్‌, టీజర్‌ చూసిన తరువాత ఇదొక డిఫరెంట్‌ సినిమా అని ఆడియెన్స్‌కు అర్థమైంది, వారికి కచ్చితంగా నచ్చుతుంది. ప్రతీ క్రాఫ్ట్‌ను కొత్తగా చేశాం. అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడండి. కొత్త అనుభూతికి లోనవుతారు’ అని అన్నారు.
‘మా సినిమా నవంబర్‌ 3న రిలీజ్‌ అవుతోంది. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని నిర్మాత తరుణ్‌ విఘ్నేశ్వర్‌ చెప్పారు. వికాస్‌ ముప్పల మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. శంకర్‌ తీసిన ‘స్నేహితుడు’ చిత్రంలో నటించాను. ఈ సినిమా నాకు టర్నింగ్‌ పాయింట్‌. మేం ఎంతో నిజాయితీగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఎంతో ప్యాషన్‌తో సినిమాను తీశారు. ఓ ఫిల్మ్‌ స్కూల్‌ నుంచి వస్తే ఎంత డీటైలింగ్‌గా చేస్తారో అంత అద్భుతంగా ఈ సినిమాను తీశారు’ అని గాయత్రీ గుప్తా చెప్పారు. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకులు వేణు ఊడుగుల, ఉదరు, హర్ష, సంగీత దర్శకుడు కార్తిక్‌, సినిమాటోగ్రాఫర్‌ రమణ్‌ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.