భిన్న ప్రేమకథ

భిన్న ప్రేమకథగంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది?, ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత చూపించారు అనే పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్‌ చిత్రం ‘శరపంజరం’. దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికష్ణ ఆశీస్సులతో నవీన్‌కుమార్‌ గట్టు, లయ జంటగా, నవీన్‌కుమార్‌ గట్టు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈనెల 19న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌తోపాటు ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ విచ్చేశారు. టి. గణపతిరెడ్డి మాట్లాడుతూ,’ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తేనే అనేక వర్గాలు, జాతుల ప్రజల నిజజీవితాలు ప్రపంచానికి తెలుస్తాయి. అందరూ ఆదరించాలని కోరుతున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమా విషయంలో నాకు ఎంతోమంది స్నేహితులు సహకరించారు. గణపతిరెడ్డి రూపంలో ఆ దేవుడే మాకు సహకరించినట్లు అనిపించింది. జీరో బడ్జెట్‌తో కేవలం స్నేహితుల సహకారంతో మొదలు పెట్టిన ఈ యజ్ఞం ఇప్పుడు విడుదలకు రావడం మేం సక్సెస్‌ అయ్యామనే అనిపిస్తోంది. మల్లిక్‌ సినిమాను తన భుజాలపై వేసుకుని మాతో కలిసి నడిచారు’ అని హీరో, దర్శకుడు నవీన్‌ గట్టు చెప్పారు.