భిన్న ప్రేమకథ

A different love storyఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి, ‘సిద్ధార్థ రారు’ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించారు దీపక్‌ సరోజ్‌. ఆయన హీరోగా రొమాంటిక్‌ కల్ట్‌ లవ్‌ స్టోరీ జోనర్‌ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నెం.1 ప్రాజెక్ట్‌గా గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో వైభవంగా ఆరంభమైంది. హరీష్‌ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్‌ ఆది, సత్య, యూట్యూబర్‌ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్‌ మద్దాలి, ‘కమిటీ కుర్రాళ్ళు’ ఫేమ్‌ యదు వంశీ , ‘క’ ఫేమ్‌ సుజిత్‌- సందీప్‌, సందీప్‌ సరోజ్‌, భరత్‌ పెద్దగాని, ఉదరు శర్మ, వంశీ చాగంటి, హైపర్‌ ఆది, రచ్చ రవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్‌ని ప్రదీప్‌ మద్దాల, యదువంశీ అందించగా, వేణు ఊడుగుల క్లాప్‌ కొట్టారు. సుజిత్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, ఫస్ట్‌ షాట్‌కి సందీప్‌ డైరెక్షన్‌ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ, ‘దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. కథ చెప్పగానే నిర్మాత వెంటనే మొదలుపెడదాం అన్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఇది కంప్లీట్‌ లవ్‌ జోనర్‌ సినిమా. రొమాంటిక్‌ కల్ట్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. జనవరిలో మొదలుపెట్టి, ఏప్రిల్‌లో ముగించాలని ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు. ”సిద్ధార్థ రారు’ సినిమా తర్వాత ఈ చిత్ర డైరెక్టర్‌ హరీష్‌ ఒక మంచి ప్రేమ కథ చెప్పారు. దీనికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. మా నిర్మాత హరిబాబుకి ఇది మొదటి సినిమానే అయినా ఆయన చాలా కాలం ఇక్కడ ఉంటారని నాకు అనిపించింది’ అని హీరో దీపక్‌ సరోజ్‌ చెప్పారు.
హీరోయిన్‌ అనైరా మాట్లాడుతూ, ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మా దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. మేం మా బెస్ట్‌ టీంతో ఎంటర్టైనింగ్‌ ధమాకా ప్యాకేజ్‌ సినిమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

నేను 20 ఏండ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నాను. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో లక్ష్మీనరసింహ ఆర్ట్స్‌ అనే బ్యానర్‌ స్థాపించాను. ఈ సినిమాతో నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఈ సినిమా కథ విన్న వెంటనే నాకు బాగా నచ్చి, గ్రీన్‌ సిగల్‌ ఇచ్చాను. మా సినిమాకు సంగీతం సమకూర్చడానికి ముందుకొచ్చిన అనూప్‌, సినిమాటోగ్రఫీ అందిస్తున్న సురేష్‌కి ధన్యవాదాలు. ఇదొక భిన్న ప్రేమకథ. ఈ కథ నచ్చి ఇందులో నటిస్తున్న నాయకానాయికలు దీపక్‌ సరోజ్‌, అనైరాకు మంచి పేరు రావడం ఖాయం
– నిర్మాత హరిబాబు