సుబ్బు, శ్రీవల్లి, కిట్టయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఐ హేట్ లవ్’. నేనూ ప్రేమలో పడ్డాను అనేది ఉపశీర్షి. ఈనెల 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వీరశంకర్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా బాగుంది సహజత్వంగా బాగా చిత్రీకరించారు. అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది’ అని తెలిపారు. ‘కథాపరంగా ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాం. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమాని అంత ప్రశాంతంగా ఆస్వాదించ వచ్చు’ అని నిర్మాత డాక్టర్ బాల రావి అన్నారు. కో- ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకట కష్ణ మాట్లాడుతూ, ‘మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రం తీశాం’ అని చెప్పారు. ‘గోదావరి జిల్లా యాసతో పూర్తిగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇది యూత్‌ని బాగా ఆకట్టుకునే సందేశాత్మక కథ. పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. పాటలకి మంచి స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏస్ కె యల్ ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని దర్శకుడు వెంకటేష్.వి అన్నారు.