అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు

A digital health profile card for all– ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం
– మెడికల్‌ కాలేజీ ఉన్న ప్రతి చోటా నర్సింగ్‌, పారా మెడికల్‌ కాలేజీలు
– పూర్తి స్థాయిలో సేవలందించేలా బీబీనగర్‌ ఎయిమ్స్‌ : వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డును అత్యవసర పరిస్థితిలో సరైన వైద్యం అందించేందుకు వీలుగా ఒక యూనిక్‌ నెంబర్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఈ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆయన కోరారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్‌ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెడికల్‌ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్‌, ఫీజియోథెరపీ, పారా మెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, ఇందుకోసం కామన్‌ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపాల్‌ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్‌ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తు , కమిషనర్‌ కర్ణన్‌, డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కమలాసన్‌ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి పాల్గొన్నారు.
వరంగల్‌, ఎల్బీనగర్‌, సనత్‌ నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా చూసేందుకు మెడికల్‌ కాలేజీలను ఆస్పత్రులకు అనుసంధానం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇంకా ప్రారంభానికి నోచుకోని మెడికల్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ కాలేజీల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కొడంగల్‌లో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించారు.
బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం అన్నారు. ఆ ఆస్పత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని తెలిపారు. ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్‌ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి విస్తరణపై కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఫార్మా కంపెనీలు ముందుకు రావాలి
మెడికల్‌ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్‌ కీపింగ్‌ మెయింటెనెన్స్‌ నిర్వహణ కోసం పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధులను ఉపయోగించాలని సీఎం కోరారు. తద్వారా ఆయా సేవలను మెరుగుపరచాలని సూచించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిలో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రూ.270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదల
బోధనాస్పత్రులు, ప్రభుత్వాస్పత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులకు ఇక నుంచి ప్రతి నెలా ఆయా బిల్లులను విధిగా విడుదల చేయాలనీ, అదే విధంగా ప్రయివేటు ఆస్పత్రులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించేలా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. జూనియర్‌ డాక్టర్లు , ఆశా వర్కర్లు, స్టాఫ్‌ నర్సుల జీతాలు ప్రతి నెల క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 108,102 సేవల పనితీరును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అరా తీశారు. వాటి ద్వారా మెరుగైన సేవలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.