మతస్వేచ్ఛకు ప్రత్యక్ష భంగం

A direct violation of religious freedomనరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న ఆగస్టులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేస్తూ వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను తీసుకొచ్చింది. ప్రస్తుతం వక్ఫ్‌ బోర్డులో ఉన్న అవినీతిని, భూ మాఫియాను అరికట్టి పారదర్శకతను తీసుకురావడానికి ఈ సవరణలు తీసుకొస్తున్నామని కేంద్రం వాదిస్తున్నది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఈ సవరణ బిల్లు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్‌ బోర్డు స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గిన కేంద్రం ఈ సవరణ బిల్లును జాయింట్‌ పార్లమెంటు కమిటీకి పంపింది. దేశంలో మైనార్టీ తరగతుల ప్రజలు తమ విశ్వాసాలను, భాష, లిపి, సంస్కతిని కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం ప్రత్యేకంగా రాయితీలను కల్పించింది. ముస్లిం ప్రజల్లో సంపన్నులు తమ సంపదలో కొంత భాగాన్ని వక్ఫ్‌ పేరిట అంకితం చేస్తారు. ముస్లింలకు ధార్మిక, విద్యాభివద్ధి తదితర ప్రయోజనాలను అందించడానికి స్వాతంత్య్రం కంటే పూర్వం నుంచి ఈ ఆస్తులను వక్ఫ్‌ చేయడం జరుగుతోంది. వక్ఫ్‌గా నమోదు కాబడిన ఆస్తుల అభివద్ధి నిర్వహణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజల భాగస్వామ్యంతో బోర్డును ఏర్పాటుచేసి నిర్వహించడమనేదే చట్టపరంగా ఇంత వరకూ జరిగిన వాస్తవం. బ్రిటీష్‌ హయాంలో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణను ముస్లిం పెద్దలు ప్రత్యేకంగా చూశారు.
స్వాతంత్య్రానంతరం 1954లో ఒక సమగ్రమైన వక్ఫ్‌ చట్టాన్ని రూపొందించారు. దాని స్థానంలో 1995లో వక్ఫ్‌ ఆస్తులకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంగా మరో చట్టం చేశారు. అయితే ఇప్పుడు ఈ చట్టానికి 119 సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చర్చకు పెట్టింది. అయితే ఈ సవరణల్లో అత్యధికం వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు కాకుండా వాటి భక్షణకు ఉపయోగపడేలా ఉన్నాయి. ఆస్తుల స్వభావాన్ని పూర్తిగా మార్చివేయడంతో పాటు బోర్డు నిర్వహణను ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకోవడానికే ఈ సవరణలు చేసిందనే ఆందోళన ముస్లిం మైనార్టీలలో ఏర్పడింది. ఈ నవంబరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదించాలని బీజేపీ సర్కార్‌ పావులు కదుపుతోంది. ఈ సవరణల ద్వారా వక్ఫ్‌ బై యూజర్‌ అన్న భావనను తొలగిస్తూ రిజిష్టర్‌ కాబడిన ఆస్తులను మాత్రమే వక్ఫ్‌ ఆస్తులుగా పరిగణిస్తామని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల అనుభవం ద్వారా అనేక తరాలుగా ముస్లింలవిగా పరిగణింపబడుతున్న ఖబర స్తాన్‌లు, మసీదులు, దర్గాలన్నీ వివాదాల్లోకి పోయి ముస్లిం సమాజం చాలా నష్టపోతోంది. అనేక తరాల ఈ ఆస్తులకు డాక్యుమెంట్లు ఎవరి వద్దా ఉండవు. దీనిని ఉపయోగించుకుని హిందూత్వ మతోన్మాద శక్తులు వివాదాలు సష్టించేందుకు ఈ బిల్లు ఉపయోగ పడుతుంది. ఒక్క బాబ్రీ మసీదు వివాదంతోనే దేశం తీవ్రంగా నష్టపోయింది, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వందల బాబ్రీ మసీదు వంటి వివాదాలు సష్టించడానికి ఈ సవరణలు ఉపయోగపడతాయి కూడా. ప్రస్తుత ప్రతిపాదిత సవరణలు వక్ఫ్‌ సంస్థలు చేస్తున్న సామాజిక కార్యక్రమాలన్నింటిపై ఆంక్షలు విధిస్తాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే అనేక వందల ఏండ్లుగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులు కూడా మరలా ప్రభుత్వం పరిశీలనకు వస్తాయి. ఈ ఆస్తులకు సంబంధించిన ఏ వివాదమైనా కలెక్టర్‌ నిర్ణయమే తుది నిర్ణయంగా ప్రతిపాదిత సవరణలు చెబుతున్నాయి. వక్ఫ్‌ సర్వే కమిషనర్‌ వ్యవస్థను,వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను అధిగమించే అధికారం కలెక్టర్లకు ఇవ్వబడుతుంది.
వక్ఫ్‌బోర్డుల ఏర్పాటులో, నిర్వహణలో కూడా రాజకీయ జోక్యానికి పూర్తిగా అవకాశం కల్పించి బోర్డులలో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలని, అధికారులను కూడా ముస్లిమేతరులను నియమించేలా సవరణ చేయ బోతున్నారు.ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం వక్ఫ్‌ ఆస్తుల విలువ 1 లక్షా 20 వేల కోట్ల రూపాయలు. వక్ఫ్‌ ఆస్తులను సక్రమంగా నిర్వహిస్తే ఏడాదికి వేల కోట్ల ఆదాయం వచ్చే మాట నిజమే. ఇలా వచ్చిన ఆదాయం పేద ముస్లింల విద్య,వైద్యం, సంక్షేమం కోసం ఏంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలకు కూడా కొంత భారం తగ్గుతుంది.కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి.వక్ఫ్‌ గెజిట్‌లో ఉన్న ఆస్తులు పూర్తిగా వక్ఫ్‌ బోర్డుల ఆధీనంలో లేవు.
దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వాల ఆధీనంలోను,ప్రయివేటు వ్యకుల చేతుల్లోనూ ఉన్నాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70శాతం వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని నివేదిక ఉంది. వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశంలోనే రైల్వే,ఆర్మీ తర్వాత అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థగా వక్ఫ్‌బోర్డు ఉందని కేంద్రం ప్రచారం చేస్తోంది. వక్ఫ్‌ ఆస్తులను కబ్జాలు చేసుకుంటుంది కేవలం ప్రయివేటు వ్యక్తులే కాదు, ప్రభుత్వాలు కూడా వేలాది ఏకరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.అనేక రాష్ట్రాలలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు,పార్కులు వక్ఫ్‌ భూములలోనే నిర్మాణమయ్యాయి. వక్ఫ్‌ బోర్డు అధికారాలకు కత్తెర వేసే వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలు,సమాఖ్యస్ఫూర్తిని ఉల్లంఘిస్తూ మత స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నది. మహారాష్ట్ర,హరియాణా ఎన్నికలను దష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ముస్లిమేతరులను వక్ఫ్‌ పాలకమండలిలో సభ్యులుగా చేర్చడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం.అయితే ఒక్క ముస్లింలపైనే గాకుండా క్రైస్తవులు, జైనులపై కూడా దాడులు చేయడం బీజేపీ లక్ష్యంగా ఉన్నది. రాజ్యాంగంలోని 30వ అధికరణే మైనారిటీలకు తమ ఆస్తులను నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తోంటే నేడు ఈ బిల్లు ఆ అధికరణకు వ్యతిరేకంగా రాజ్యాంగంలోని 14, 15, 35 మూడు అధికరణలను కూడా ఉల్లంఘిస్తోంది.దేశాన్ని విభజించడమే తప్ప సమైక్యం చేయడం ఈ బిల్లు ఉద్దేశంగా లేదు.కాబట్టి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ సభ్యులకు వక్ఫ్‌ భూములను అడ్డదారిలో కట్ట బెట్టాలని చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుందాం. దేశంలో లౌకిక విలువలకు పాతరేస్తున్న పాలకులను నిలదీయాలి.
యం.ఎ.జబ్బార్‌
9177264832