ఇరా సింఘాల్… దీర్ఘకాలిక వెన్నెముక సమస్యతో బాధపడుతూ కూడా కృషి, పట్టుదలతో అధిగమించింది. చాలెంజ్డ్ అన్న పదానికి అర్థాన్నే మార్చివేసింది. తనలాంటి వారు ఈ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వంతో బతకాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించింది. యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి గాజు కప్పును బద్దలు కొట్టింది. నేడు ఓ ఐఏఎస్ అధికారిగా ఇతరులకు మార్గం సుగమం చేసిన ఆమె పరిచయం నేటి మానవిలో…
మీరట్‌కు చెందిన ఇరా తల్లి అనితా సింఘాల్, తండ్రి రాజేంద్ర సింఘాల్. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్న తన తల్లిదండ్రులను చూస్తూ పెరిగింది ఇరా. కనుక సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన చిన్నతనంలోనే ఆమె మనసులో నాటుకుపోయింది. అయితే చిన్నతనం నుండి ఇరా హైపర్‌కైఫోసిస్ స్కోలియోసిస్ అనే వెన్నెముక సమస్యతో బాధపడేది. వంగడానికి వచ్చేది కాదు. కాలక్రమేణా ఆ సమస్య ఆమెను అంగవైకల్యానికి గురి చేసింది. అలాంటి ఆమె 2014 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
పోస్టింగ్ నిరాకరించింది
2010, 2011, 2013 ఇలా మూడుసార్లు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ ర్యాంకులకు ఐఆర్‌ఎస్ వస్తుంది. యూపీఎస్సీ పరీక్షలో అన్ని సార్లు ఆమె ఉత్తీర్ణత సాధించినప్పటికీ వైకల్యం కారణంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆమెకు పోస్టింగ్ నిరాకరించింది. మరో అధికారైతే ఎగతాళిగా ‘మీకొచ్చే బరువైన పార్సిళ్లను ఈ వైకల్యంతో విప్పలేరు’ అన్నాడు. అంతేనా. ‘అటెండర్ పనికి కూడా పనికి రావు’ అని అభ్యంతరం పెట్టారు. అందుకే మరింత కసిగా చదివి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఒక్కసారిగా అందరి చూపూ తనవైపు తిప్పుకున్నారు. భారతదేశంలో ప్రతిభావంతులైన సివిల్ సర్వీసెస్ ఆశించేవారి మార్గంలో వైకల్యం ఎలా వస్తుందో ఆమె మొదటిసారిగా గ్రహించారు. ‘నా వైకల్యం కారణంగా ఏ డిపార్ట్‌మెంట్ నన్ను అంగీకరించదని చెప్పి వారు నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. యుపిఎస్‌సి పరీక్షకు రెండు ప్రమాణాలు ఉన్నాయి. వైకల్యాలు, సామర్థ్యాలు. నేను నా పోస్టింగ్‌కి సంబంధించిన విషయంలో అవసరమైన సామర్థ్యం కలిగి ఉన్నాను. అయినప్పటికీ తిరస్కరించబడ్డాను’ అంటూ ఇరా పంచుకున్నారు.
నాలుగేండ్ల పోరాటం చేసి
2014లో తన చివరి ప్రయత్నం తర్వాత ఇరా తనను తిరస్కరిస్తున్న వారిని సవాలు చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేండ్ల న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్‌లోని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించబడ్డారు. ఇలా పోరాడి విజయం సాధించారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడే వీరవనితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
అల్లర్ల ప్రభావం
తన సామర్థ్యాలను మెరుగుపరుచుకుని బలంగా నిలబడాలనే సంకల్పం ఆమెలో దశాబ్దాల కిందటే పుట్టింది. 1990వ దశకంలో ఆమె పెరిగిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తరచూ అల్లర్ల చెలరేగేవి. దాంతో కొన్ని రోజుల కర్ఫ్యూ విధించేవారు. ఇలా జరిగినప్పుడు ఇరా ఆరు నెలలు పాఠశాలకు వెళ్లలేకపోయేవారు. ఇలా సంఘర్ణణలతో నిండిన ప్రాంతంలో పెరిగిన ఆమె వాటి పట్ల బాగా ప్రవితమయ్యారు. చిన్నతనం నుండి విద్యలో చాలా చురుగ్గా ఉండేవారు. కనుక ఈ అల్లర్లపై అవగాహన పెంచుకున్నారు. అస్థిరమైన సమయాల్లో నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే అధికారాన్ని ఉపయోగించే ప్రభుత్వ అధికారులు సివిల్ సర్వెంట్లని ఆమె గమనించారు.
సివిల్ సర్వెంట్ అయితే…
‘అల్లర్లను తగ్గించడానికి జిల్లా మేజిస్ట్రేట్ చట్టాలను రూపొందించారనే విషయాలను మేము నిరంతరం వార్తల్లో వినేవాళ్ళం. ఇదే సివిల్ సర్వెంట్లతో నా తొలి పరిచయం. రాష్ట్రంలోని కీలక సమయాల్లో వారు కలిగి ఉన్న అధికారం నన్ను ప్రభావితం చేసింది’ అని ఆమె పంచుకున్నారు. 1995లో ఆమె కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. అక్కడ ఎవరూ ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆలోచించేవారు కాదు. అందరూ కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించాలనే లక్ష్యంతో ఉండేవారు. ఇది కూడా ఇరాను ప్రభావితం చేసింది. ఆమె కుటుంబ సభ్యుల్లో చాలామంది వ్యాపారవేత్తలుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా, చార్టర్డ్ అకౌంటెంట్లుగా స్థిరపడ్డారు.
విలువలతో కూడిన జీవితం
తర్వాత కాలంలో ఇరా కూడా నేతాజీ సుభాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బి.టెక్ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్సిటీలోని మేనేజ్‌మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుండి ఎంబీఏ చేశారు. తర్వాత కోకా-కోలా కంపెనీలో మార్కెటింగ్ ఇంటర్న్‌గా, క్యాడ్‌బరీకి స్ట్రాటజీ మేనేజర్‌గా కొంతకాలం పనిచేశారు. ‘ఈ ఉద్యోగాలు చేస్తూ నేను అత్యధిక ఇంక్రిమెంట్‌లను పొందుతున్నాను. కానీ ప్రజల కోసం విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని గ్రహించడానికి నాకు కొంత సమయం పట్టింది’ అని ఆమె పంచుకున్నారు. తను చేస్తున్న పని సమాజానికి ఎలా సహాయపడుతుందో ఆలోచించడం ప్రారంభించింది. ఇక ఉద్యోగం మానేసి యూపీఎస్సీ పరీక్ష రాసి సివిల్ సర్వీసెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఎక్కువ కష్టపడాలి
విద్యార్థిగా ఉన్నపుడు వైకల్యంతో పాటు ఓ మహిళాగా ఉన్న ఆమె కొన్ని అవకాశాలు ఎలా తగ్గిపోయాయో గ్రహించారు. ‘సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలకు స్టేజ్‌పై క్యాట్‌వాక్ చేయాల్సిన పాత్రలకు పరిమితం చేసేవారు. మగ విద్యార్థులు మహిళలకు ఇతర పాత్రలు ఇవ్వకుండా అడ్డుకునేవారు. ఇలాంటి సమాజంలో మీరు ఒక మహిళగా అందునా వైకల్యాలున్న వ్యక్తి అయితే ఏదైనా చేయడానికి మీరు అర్హులని నిరూపించుకోవడానికి ఇతరుల కంటే ఎక్కువ కష్టపడాలి’ అని ఆమె జతచేస్తున్నారు. ఇప్పటికీ తాను ఇదే చేస్తున్నానంటూ పంచుకున్నారు.
విద్య ఒక్కటే మార్గం
2014లో యూపీఎస్సీ పరీక్షలో తన చివరి ప్రయత్నంలో ఆమె నంబర్ వన్ కంటే తక్కువ ర్యాంక్ సాధించి ఉంటే ప్రభుత్వ పదవిని పొందే అవకాశం చాలా తక్కువ అని ఆమె అభిప్రాయపడ్డారు. ‘వైకల్యాలున్న వ్యక్తులు ఏమీ చేయలేరు, ఒకరిపై ఆధారపడి ఉంటారు అనే ఒక నిర్దిష్ట భావన ప్రబలంగా ఉంది. ఓటింగ్ కేంద్రాలు మాత్రం వికలాంగులకు అనుకూలంగా ఉంటాయి’ అని ఇరా అంటున్నారు. సమాజంలో సమానత్వం సాధించాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆమె బలమైన అభిప్రాయం. ‘సివిల్ సర్వెంట్ అవ్వడం లేదా కాకపోవడం అనేది ఇప్పటికీ నా ఎంపిక. అయితే చదువు విషయంలో అలా కాదు. ఎందుకంటే మన స్వేచ్ఛ, సమానత్వానికి చదువు ఒక టికెట్. అందుకే వికలాంగ పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనేది నా కల’ అంటూ ఆమె తన మాటలు
ముగించారు.