పశ్చిమ దేశాలలో ప్రజాస్వామ్యపు వికృత రూపం

A distorted form of democracy in the Westరెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో పశ్చిమ సంపన్న దేశాలలో కొనసాగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఏనాడూ చూడనంత వికృత స్థాయికి ప్రస్తుతం దిగజారిపోయింది. ఓటర్ల అభీష్టానికి అనుగుణంగా ఉండే విధా నాలను అనుసరించడమే ప్రజాస్వామ్యం అని భావి స్తాం. అయితే, ప్రభుత్వాలు ఓటర్లను ముందుగా అడిగి వారి అభీష్టాలేమిటో తెలుసుకుని ఆ తర్వాత విధానాలను రూపొందించడం అనేది ఎక్కడా జరగదు. బూర్జువా ప్రజా స్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పాలక వర్గాల ప్రయోజ నాలకు అనుగుణంగా విధానాలను రూపొంది స్తాయి. ఆ తర్వాత తమ ప్రచార యంత్రాంగం ద్వారా ఆ విధానాలు చాలా మంచివి అని ప్రజలను ఒప్పిస్తాయి. ఆ విధంగా తాము అనుసరించే విధానాలకు ప్రజానుకూలతను పొందడానికి ప్రయత్నిస్తాయి. అంటే, పాలక వర్గాలకు అను కూలంగా ఉండే విధానాలను అనుసరిస్తూనే వాటిని ప్రజలు అంగీకరించేలా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి.కాని ఇప్పుడు పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లో జరుగుతున్నది వేరు. పాలకుల ప్రచారం ఎంతగా ఊదర గొట్టినా, అక్కడ ప్రజలు పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలకు పూర్తి భిన్నంగా ఉండే విధానాలను కోరుతున్నారు. ఐనా, పాలకులు మాత్రం తమకు అనుకూలంగా ఉండే విధానాలను మాత్రమే అమలు చేస్తున్నారు. అనేక రకాల రాజకీయ పార్టీలను తమ విధానాలకు అనుకూలంగా ఉండేట్టు చేసి మెజారిటీ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నా పట్టించు కోకుండా తమ విధానాలనే అమలు చేస్తున్నారు. ఆ విధంగా, ప్రస్తుత పరిస్థితిలో అక్కడ రెండు లక్షణాలు మనకు గోచరిస్తున్నాయి. మొదటిది: అత్యధిక రాజకీయ పార్టీలలో విధానాల పట్ల ఒక విశాల ఐక్యత. రెండవది: ఈ పార్టీలన్నీ ఆమోదించే విధానాలకి, ప్రజానీకం కోరుకుంటున్నదానికి ఏ మాత్రమూ పొంతన లేకపోవడం. బూర్జువా ప్రజా స్వామ్యంలో గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. పోనీ ఆ విధానాలేమైనా చిన్న చిన్న అంశాలకో, అం తగా ప్రాధాన్యత లేని అంశాలకో సంబంధించినవేమో అని అనుకుందామంటే అదీ కాదు. అత్యంత ముఖ్యమైన యుద్ధం, శాంతి వంటి అంశాలకు సంబంధించినవి. అమెరికానే తీసుకోండి. అక్కడ ప్రజల్లో మెజారిటీ ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై యుద్ధం పేరుతో సాగిస్తున్న మానవ హననాన్ని తీవ్రంగా ఏవగించుకుంటున్నారని అన్ని ప్రజాభిప్రాయ సర్వేలూ వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరాను వెంటనే నిలుపుచేసి, అమెరికా ఆ యుద్ధాన్ని కొనసాగన్వికుండా చర్యలు తీసుకోవాలని మెజా రిటీ అమెరికన్లు బలంగా కోరుతున్నారు. కాని అమెరికన్‌ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో నడు స్తోంది. ఈ యుద్ధం మొత్తం గల్ఫ్‌ దేశాలన్నింటికీ విస్తరించే ప్రమాదం దాపురిస్తున్నా పట్టించుకోకుండా దాన్ని మరింత ఎగదోస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో కూడా అమెరికన్‌ ప్రజల అభిప్రాయం యుద్ధం కొనసాగడానికి అను కూలంగా లేదు. ఆ యుద్ధాన్ని నిలుపుచేసి, సంప్రదింపుల ద్వారా శాంతి నెలకొల్పేందుకు పూనుకోవాలని వారు కోరు తున్నారు. కాని అటువంటి శాంతియుత ఒప్పందం కుదిరేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ అమెరికన్‌ ప్రభుత్వం, (బ్రిటన్‌తో జట్టు కట్టి) చెడగొట్టింది. రష్యాకు, ఉక్రెయిన్‌కు నడుమ గతంలో మిన్స్క్‌లో కుదిరిన ఒప్పందాలేవీ తమకు ఆమోదయోగ్యం కాదని అప్పటి బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ద్వారా ఉక్రెయిన్‌కు సందేశం పంపి యుద్ధం మొదలవ డానికి దారి తీసింది అమెరికాయే. ఇప్పుడు కూడా పుతిన్‌ శాంతి స్థాపనకు దోహదం చేసే కొన్ని ప్రతిపాదనలు చేసినప్పుడు వాటిని తోసిరాజని, కుర్స్క్‌ ప్రాంతం మీద దాడికి పూనుకునేలా ఉక్రెయిన్‌ను ఎగదోసి శాంతి స్థాపనకు గల అవకాశాలను చెడగొట్టింది అమెరికాయే. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అమెరికాలోని మెజారిటీ ప్రజలు శాంతిని కోరుతున్నా, ఉక్రెయిన్‌ పాల్పడుతున్న దుందుడుకు చర్యలు అణుయుద్ధం జరిగే దిశగా పరిస్థితులను దిగజార్చుతు న్నాయని ఆందోళన చెందుతున్నా, అమెరికాలోని ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ, అటు రిపబ్లికన్లు, ఇటు డెమా క్రాట్లు నెతాన్యాహుకు, జెలెన్‌స్కీకి ఆయుధాలను సరఫరా చేసే విషయంలో ఏకాభిప్రాయంతోటే ఉన్నాయి. ఈ విధంగా మెజారిటీ ప్రజలు కోరుతున్నదానికి (వారిని పాలకులు ఎంతగా ప్రచారార్భాటంతో ముంచెత్తి నప్పటికీ), పూర్తి భిన్నంగా అక్కడ పాలక పార్టీల ఆచరణ ఉండడం మనకి అన్ని పశ్చిమ సంపన్న దేశాలలోనూ కనిపి స్తుంది. కాని తక్కిన దేశాలలో కన్నా ఈ తేడా మనకు జర్మనీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తక్కిన ఏ పశ్చిమ సంపన్న దేశాన్నీ ఇబ్బంది పెట్టనంత ఎక్కువగా ఉక్రెయిన్‌ యుద్ధం జర్మనీని ఇబ్బందులలో పడేసింది. తన ఇంధన అవసరాలకు పూర్తిగా రష్యా నుండి సరఫరా అయే సహజ వాయువు మీద జర్మనీ ఆధారపడి వుంది. యుద్ధాన్ని కారణంగా చూపి రష్యా మీద విధించిన ఆంక్షల ఫలితంగా ఆ సహజ వాయువుకు జర్మనీలో కొరత ఏర్పడింది. దానికి బదులుగా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న సహజ వాయువు బాగా ఖరీదు ఎక్కువ కావడంతో జర్మనీలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడి కార్మికుల బతుకులను దెబ్బ తీస్తున్నాయి. అందుచేత తక్షణమే ఉక్రెయిన్‌- రష్యా నడుమ సాగుతున్న యుద్ధాన్ని నిలుపుచేయాలని ఆ కార్మికులు బలంగా కోరుతున్నారు. కాని, ఇటు జర్మనీలో అధికారంలో ఉన్న కూటమి (ఇందులో సోషల్‌ డెమాక్రాట్లు, ఫ్రీ డెమాక్రాట్లు, గ్రీన్స్‌ పార్టీ ఉన్నాయి) గాని, అటు ప్రతి పక్షంలో ఉన్న కూటమి (ఇందులో క్రిస్టియన్‌ డెమాక్రాట్లు, క్రిస్టియన్‌ సోషలిస్టులు ఉన్నారు) గాని శాంతియుత పరిష్కారం సాధించే విషయంలో ఏ పాటి శ్రద్ధనూ కనపరచడం లేదు. పైగా రష్యన్‌ సైన్యాలు జర్మనీ మీదకు మోహ రించి వున్నాయని, ఎప్పుడైనా వచ్చి మీద పడవచ్చునని జర్మన్‌ ప్రజల్లో భయాందోళనలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రష్యా సరిహద్దుల మీద లిధువానియా దగ్గర జర్మనీ సైన్యాలే మోహరించి వున్నాయి!ఎలాగైనా యుద్ధానికి ముగింపు పలకాలన్న ఆతృతతో ఉన్న జర్మన్‌ కార్మికులు ఇప్పుడు నయా ఫాసిస్టు పార్టీ అయిన ఎఎఫ్‌డికి అనుకూలంగా మారుతున్నారు. ఆ పార్టీ తాను యుద్ధానికి వ్యతిరేకమని ప్రస్తుతానికి అంటోంది. కాని ఒకసారి అధికారానికి గనుక సమీపంగా వస్తే అది తన హామీలను గాలికొదిలేస్తుందని అందరికీ తెలుసు. ఆ పార్టీతోబాటు జర్మన్‌ కార్మికులు సహ్రా వేజెన్‌నెక్ట్‌ నాయకత్వంలోని నయా లెఫ్ట్‌ పార్టీ వైపు కూడా మొగ్గుచూపు తున్నారు. ఈ పార్టీ తన మాతృ సంస్థ డై లింక్‌ అనే లెఫ్ట్‌ పార్టీ నుండి చీలిపోయింది. యుద్ధం విషయంలో తలెత్తిన భేదాభిప్రాయం కారణంగానే ఆ చీలిక ఏర్పడింది.గాజాలో కొనసాగుతున్న మారణకాండ విషయంలో కూడా జర్మనీలో ఇదే పరిస్థితి ఉంది. ప్రజానీకం అందరూ ఇజ్రాయిల్‌ దురాగతాన్ని వ్యతిరేకిస్తుంటే, జర్మన్‌ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రదర్శ నలను, సభలను నిషేధించింది. అటువంటి కార్యకలాపాలు యూదు వ్యతిరేకతను వ్యక్తం చేస్తాయనే సాకుతో ఆ నిషేధాలను అమలు చేస్తోంది. యానిస్‌ వరూఫకిస్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ మేథావులు వక్తలుగా హాజరవు తున్న ఒక సదస్సును జర్మన్‌ ప్రభుత్వం భగం చేసింది. ఇజ్రాయిల్‌ దురాగతాలను ఖండించే కార్యక్రమాలను అడ్డుకోడానికి ”యూదు వ్యతిరేకత” అనే సాకును చూపించడం ఇప్పుడు అన్ని పశ్చిమ సంపన్న దేశాలకూ మామూలై పోయింది. బ్రిటన్‌లో ఒకప్పుడు లేబర్‌ పార్టీ నాయకుడుగా ఉన్న జెరెమీ కోర్బిన్‌ను ఆ పార్టీనుండి బయటకు వెళ్ళగొట్ట డానికి కూడా అతగాడు ”యూదు వ్యతిరేకత”ను రెచ్చగొడుతున్నాడనే సాకునే చూపించారు. నిజానికి అతడు బాధిత పాలస్తీనా ప్రజానీకానికి అండగా నిలబడ్డాడు. అమెరికాలో వివిధ యూనివర్సిటీల క్యాంపస్‌లలో ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా విస్తృతంగా చెలరేగుతున్న నిరసనలను అణచివేయడానికి కూడా ఈ ”యూదు వ్యతిరేకత”నే సాకుగా చూపిస్తున్నారు. ఈ విధంగా ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి వ్యవహరించడం అనేది తేలికగా జరగాలంటే యుద్ధం, శాంతి వంటి ప్రధాన సమస్యలకు రాజకీయ చర్చలలో చోటు లేకుండా చేయడం ఒక మార్గంగా పాలక పార్టీలు ఎంచుకున్నాయి. త్వరలో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు కమలాహారిస్‌, అటు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇద్దరూ ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరాకు అనుకూలమే. అందుచేత అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగే చర్చల్లో గాని, ప్రచారంలో గాని యుద్ధం, శాంతి వంటి ప్రధానమైన అంశం అసలు ఎక్కడా కనిపించదు. వారిద్దరికీ అంగీకారం కుదరని ఇతర, అప్రధాన అంశాల మీద చర్చ, వాదప్రతివాదాలు నడుస్తాయి కాని ప్రజలం దరినీ కలవర పరుస్తున్న ముఖ్యమైన సమస్య మాత్రం ఎక్కడా కనిపించదు. ఇజ్రాయిల్‌ దూకుడుకు అమెరికన్‌ రాజకీయ పార్టీల నుండి ఇంత మద్దతు లభించడానికి ఒక కారణం ఆ పార్టీలకు ఇజ్రాయిల్‌-అనుకూల దాతల నుండి ఉదారంగా విరాళాలు లభించడమే. ఆగస్టు 21న డెల్ఫీ ఇనీషియేటివ్‌ అనే పత్రిక వెల్లడించిన ప్రకారం, ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టిన కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వంలోని సగం మందికి పైగా మంత్రులకు ఇజ్రాయిల్‌-అనుకూల దాతల నుండి భారీగా విరాళాలు ముట్టాయి. ఆ సహాయంతోటే వారు అధికారంలోకి రాగలిగారు. అదే పత్రిక, అదే రోజున వెల్లడించిన మరొక అంశం ఏమంటే బ్రిటిష్‌ పార్లమెంట్‌లో ఉన్న కన్సర్వేటివ్‌ పార్టీ (ప్రతిపక్షం)లోని ఎంపీలలో మూడో వంతుకు ఇజ్రాయిల్‌-అనుకూల దాతల నుండి విరాళాలు అందాయి. అంటే ఇజ్రాయిల్‌-అనుకూల దాతల నుండి ఇటు పాలక పక్షానికి, అటు ప్రతి పక్షానికి కూడా విరాళాలు అందుతున్నాయి! అందుచేతనే ఇరుపక్షాలూ ఇజ్రాయిల్‌ను సమర్ధిస్తున్నాయి.ఇంకొక పక్క పాలస్తీనాను సమర్ధించేవారి గతి ఏమౌతుందో తెలియడానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి. అమెరికన్‌ పార్లమెంటులో (అమెరికన్‌ కాంగ్రెస్‌) సభ్యులుగా ఉన్న జమాల్‌ బౌమన్‌, కోరీ బుష్‌ అనే ఇద్దరు నల్లజాతి ప్రతినిధులు పాలస్తీనాకు అనుకూలంగా వైఖరి అవలంబించి ఇజ్రాయిల్‌ దురాగతాలను తీవ్రంగా విమర్శించారు. ఇద్దరూ అభ్యదయవాదులే. ఇజ్రాయిల్‌కు అనుకూలంగా వ్యవహరించే ఒక సంస్థ ఎ.ఐ.పి.ఎ.సి (అమెరికన్‌- ఇజ్రా యిల్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ ) జోక్యం చేసుకుని కోట్ల డాలర్లను కుమ్మరించి వారిద్దరినీ ఎన్నికలలో ఓడించేందుకు ప్రయత్నించింది. బౌమన్‌ని ఓడించడం కోసం ఒక కోటి డెబ్భై లక్షల డాలర్లు, కోరీ బుష్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రకట నలకు 90 లక్షల డాలర్లు ఈ సంస్థ ఖర్చు చేసినట్టు ఆగస్టు 31న డెల్ఫీ ఇనీషియేటివ్‌ పత్రిక బైటపెట్టింది. ఐతే కోరీ బుష్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రకటనలలో గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాగతాల గురించి నేరుగా ప్రస్తావించ లేదు. దాంతో వారి ప్రయత్నం ఫలించలేదు. ఈ వివరాలన్నీ చూస్తే పశ్చిమ సంపన్న దేశాల ప్రభుత్వాలు, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాభిమతానికి వ్యతిరేకంగా యుద్ధం, శాంతి వంటి ప్రధాన అంశాలమీద సైతం వ్యవహరించ గలుగుతున్నాయి అన్నది స్పష్టమవుతోంది. దాని వెనుక కొన్ని లాబీల, స్వప్రయోజనపరుల భారీ విరాళాలు ఉన్నాయి. గతంలో పాలక వర్గాలు ప్రచారం ద్వారా ప్రజల్లో తలెత్తే ప్రతికూలతను తారుమారు చేసే ఎత్తుగడలను అనుసరించాయి. కాని, ఇప్పుడు ఆ మాదిరి ప్రచారం ప్రజాభిప్రాయాన్ని మార్చలేక పోతున్నది. కాని రాజకీయ వ్యవస్థ లను ధనబలంతో తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే ప్రక్రియలో ఒక కొత్త దశ.రాజకీయ వ్యవస్థలు నైతికంగా పతనమౌతున్న ధోరణి ఈ దశలో కనిపిస్తున్నది. ఇటువంటి నైతిక పతనం ఫాసిజం బలపడడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం పశ్చిమ సంపన్న దేశాలలో ఫాసిజం వాస్తవంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ, ఆ దేశాలలో ఇప్పటికే ప్రజల అధికారాలను గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా హరించడం జరుగుతోంది.
(స్వేచ్ఛానుసరణ)
– ప్రభాత్‌ పట్నాయక్‌