కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిం దంట. ఇదే కోవలో ఇప్పుడు మోసాలు చేసే ‘అడ్డగాడిద’ లొచ్చి… తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక రైతుల్ని నిలువునా ముంచాయి. అవునండీ ఇది ముమ్మాటికి నిజం. గేదె, ఆవు, మేక పాలకున్న గిరాకీ మనకందరికీ తెలిసిందే. వీటికి మించి గాడిద పాలకు మాంచి గిరాకీ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆ పాలు తాగితే హృద్రోగాలతోపాటు ఆస్తమా తదితర దీర్ఘకాల రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తుండటమే దీనికి కారణం. జనంలో ఉన్న ఆ విశ్వాసం, నమ్మకాన్ని ఆసరా చేసుకుని చెన్నైకి చెందిన ‘డాంకీ ప్యాలెస్’ అనే ఓ దొంగ కంపెనీ…పై మూడు రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులకు గాడిదలను అంటగట్టింది. ఒక్కో రైతు నుంచి రూ.లక్ష నుంచి రెండు లక్షల దాకా తీసుకుని, ఒక్కో గాడిదను అప్పగించింది. వాటి పాలను తామే మార్కెట్ చేస్తామంటూ నమ్మబలికింది. తద్వారా కోట్లు సంపాదించ వచ్చంటూ రైతులకు చెప్పింది. రెండు మూడు నెలలపాటు వాటి పాలను తానే కొని, అమ్మి, వచ్చిన డబ్బును రైతుల ఖాతాల్లో వేసింది. ఆ రకంగా ఒక్కో రైతుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వచ్చాయి. ఇక్కడి దాకా కథ బాగానే నడిచింది. ఆ తర్వాత ఆ ‘డాంకీ’ కంపెనీ బోర్డు తిప్పేయటంతో లక్షన్నర, రెండు లక్షలు కట్టిన ఆ రైతులు లబోదిబోమన్నారు. తమను మోసం చేసిన ‘అడ్డ గాడిదల’ అంతు తేలుస్తామంటూ చెన్నై రైలెక్కారు. తీరా చూస్తే, అక్కడ ‘డాంకీ ప్యాలెస్’ కాదుగదా.. దాని బోర్డు కూడా లేదు. అదన్నమాట మ్యాటర్. ఈజీ మనీ (తేలిగ్గా వచ్చే డబ్బు) కోసమని, సోషల్ మీడియాలో వచ్చే అడ్డమైన ప్రకటనలను నమ్మి, డబ్బులు కడితే, ఆ తర్వాత ఇలాగే చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మోసం చేసిన అడ్డ గాడిదలను తలుచుకుని విలపించాల్సి వస్తుంది. సో… బీ కేర్‌ఫుల్…
– బి.వి.యన్.పద్మరాజు