సింధుకు చుక్కెదురు

సింధుకు చుక్కెదురు– తొలి రౌండ్లోనే పరాజయం
– ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000
జకర్తా (ఇండోనేషియా) : పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ఓ టైటిల్‌ విజయం వేటలో పి.వి సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సీజన్‌లో మరోసారి భారత అగ్రశ్రేణి షట్లర్‌ తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో వరల్డ్‌ నం.12 పి.వి సింధు 15-21, 21-15, 14-21తో పరాజయం పాలైంది. వరల్డ్‌ నం.26 చైనీస్‌ తైపీ షట్లర్‌ వెన్‌ చి చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో తగ్గినా.. రెండో గేమ్‌లో పుంజుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు అంచనాలను అందుకో లేదు. 12-12తో ఓ దశలో రేసులో నిలిచినా.. ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి భారీ మూల్యం చెల్లించింది. యువ షట్లర్‌ ఆకర్షి కశ్యప్‌ సైతం 18-21, 6-21తో రచనాక్‌ ఇంటనాన్‌ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్ప జంట 21-15, 21-15తో కెనడా షట్లర్లపై విజయం సాధించారు. రుతుపర్ణ, శ్వేతపర్ణ జంట 12-21, 9-21తో వరుస గేముల్లో పరాజయం పాలై ఇంటిబాట పట్టింది.