సింధుకు చుక్కెదురు

సింధుకు చుక్కెదురు– ప్రీ క్వార్టర్స్‌లో పరాజయం
– జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500
కుమమోటో (జపాన్‌) : భారత స్టార్‌ షట్లర్‌ పి.వి సింధు పోరాటానికి తెరపడింది. జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పి.వి సింధు పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో పి.వి సింధు 21-17, 16-21, 17-21తో మూడు గేముల మ్యాచ్‌లో ఓటమి చెందింది. సుమారు 75 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కెనడా అమ్మాయి మిచెలి లీ పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో సింధు పైచేయి సాధించింది. విరామ సమయానికి 11-8తో ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కెనడా షట్లర్‌ పుంజుకుంది. 8-3తో ఆరంభంలోనే ముందంజ వేసింది. సింధు పుంజుకుని 16-16తో స్కోరు సమం చేసింది. ఇక్కడ వరుసగా ఐదు పాయింట్లు సాధించిన మిచెలి లీ రెండో గేమ్‌ను 21-16తో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ నువ్వా నేనా అన్నట్టు సాగింది. 17-17 వరకు ప్రతి పాయింట్‌కు ఆధిక్యం చేతులు మారింది. కానీ మరోసారి ఆఖర్లో వరుసగా నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న కెనడా షట్లర్‌ 21-17తో మూడో గేమ్‌తో పాటు క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఒత్తిడిలో అద్భుతంగా ఆడే అలవాటున్న పి.వి సింధు తాజా మ్యాచ్‌లో ఒత్తిడిలోనే చిత్తవటం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, మహిళల డబుల్స్‌లో గాయత్రి, ట్రెసా జోడీ సైతం నిష్క్రమించటంతో జపాన్‌ మాస్టర్స్‌లో భారత షట్లర్ల పోరాటానికి తెరపడింది.