మూగ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల పరిధిలోని జిన్నెలగూడెం గ్రామానికి చెందిన పుట్టుకతో చెవులు వినపడని మూగమ్మాయి ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తల్లి బుచ్చమ్మ గత కొన్ని సంవత్సరాల క్రితం కొనిచ్చిన మోబైల్ ఫోనే పుట్టుకతో చెవిటి, మూగ అయిన సౌందర్యకు ప్రపంచం. దాంతోనే ప్రతి రోజూ కాలక్షేపం చేస్తుండేదని అన్నారు.. ఫేస్ బుక్, వాట్సాప్, రీల్స్ చేసి అప్ లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులు తన సెల్ ఫోన్ లాక్కొని, ఎంతకీ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు (సూపర్ పవర్) తాగిందని వారు తెలిపారు. సౌందర్య పరిస్థితిని గమనించిన తల్లి బుచ్చమ్మ, బంధువులు హుటాహుటిన ఆళ్ళపల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని రాగా, తాగిన మందు ఆర్ఎంపీ కక్కించే ప్రయత్నం చేసినా సౌందర్య సహకరించ లేదు. దాంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు ఆర్ ఎంపీ సూచించారు. దాంతో వారు సౌందర్యను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న 108 వాహనంలో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో ఆమె పరిస్థితి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.