పుతిన్‌పై కిరాయి సేన విఫల తిరుగుబాటు

ఇరవై రెండు సంవత్సరాల పాటు రష్యాలో తిరుగులేని అధినేతగా ఉన్న వ్లదిమిర్‌ పుతిన్‌ నాయకత్వానికి తొలిసారిగా వాగర్‌ కిరాయి సాయుధ మూక రూపంలో విఫల సవాలు ఎదురైంది. ఒక్క తూటా కూడా పేలకుండా తిరుగుబాటు ముగిసినప్పటికీ పుతిన్‌ బలహీనత వెల్లడైంది. తన లక్ష్యం పుతిన్‌ను అధికారం నుంచి తొలగించటం కాదని, తిరుగుబాటు నేత ఎవగెనీ ప్రిగోఝిన్‌ సోమవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఉదంతానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. దీని గురించి ఊహించిందే అన్నట్లుగా పశ్చిమ దేశాల స్పందన ఉంది. అధికార గణం తగిన సన్నద్దతను ప్రదర్శించలేదని మాస్కో మీడియా విమర్శించింది. మిలిటరీ అధికారులతో వచ్చిన పేచీలే దీనికి మూలమా లేక నాటో హస్తం ఉందా అన్నది తేలాల్సి ఉంది. పరస్పర విరుద్దంగా మాట్లాడిన ప్రిగోఝిన్‌ తన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకొని తిరుగుబాటు జరిపాడా లేక మరొకటా అన్నది స్పష్టం కాలేదు.
మాస్కోను పట్టుకుంటామంటూ ఉక్రెయిన్‌ లోని రష్యా ఆధీనంలో ప్రాంతాల నుంచి బయలు దేరిన ఈ ప్రయివేటు దండు (పిఎంసి) జూన్‌ 24 శనివారంనాడు ఒక్క తూటాను కూడా పేల్చకుండానే సరిహద్దులోని రష్యా నగరమైన రోస్టోవ్‌ అన్‌ డాన్‌లోని మిలిటరీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకొన్నది. అక్కడి నుంచి మాస్కో నగరానికి 360 కిలోమీటర్ల దూరంలో ఉండగా(కొన్ని వార్తల ప్రకారం రెండు వందల కిమీ) నాటకీయ పరిణామాల మధ్య తన దళాలు వెనక్కు తిరుగుతున్నట్లు, తిరిగి ఉక్రెయిన్‌లో పోరు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాలని వాగర్‌ కంపెనీ అధిపతి ఎవగెనీ ప్రిగోఝిన్‌ ప్రకటించాడు. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ అధినేత అలెగ్జాండర్‌ లుకషెంకో మధ్య వర్తిత్వంలో కుదిరినట్లు చెబుతున్న రాజీ మేరకు వాగర్‌ దళం, దాని అధిపతి మీద ఎలాంటి విచారణ ఉండదు. దళాలు తిరిగి ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతానికి వెళతాయి. అధిపతి ప్రిగోఝిన్‌కు బెలారస్‌ ఆశ్రయం కల్పిస్తుంది. వాగర్‌ దళాలు తమ వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగిస్తే వారి మీద ఎలాంటి విచారణ ఉండదు. తిరుగుబాటులో పాల్గొనని వారిని మిలిటరీ కాంట్రాక్టుదళంలో సర్దుబాటు చేస్తారు. జూలై ఒకటవ తేదీలోగా వారు దరఖాస్తు చేసుకోవాలి. రాజీ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే స్వాధీనం చేసుకున్న రోస్టోవ్‌ నగరం నుంచి వాగర్‌ దళం వైదొలిగింది. ప్రిగోఝిన్‌ శుక్రవారంనాడు ఒక ప్రకటన చేస్తూ అవసరం లేకున్నా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ పోరుకు దిగాడని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాడు. తమ దళాల మీద రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశాల మేరకు రాకెట్లు, హెలికాప్టర్లు, ఫిరంగులతో మిలిటరీ దాడి చేసి రెండువేల మందిని హతమార్చినట్లు ఆరోపించాడు. తమ తిరుగుబాటుకు కారణం ఇదే అని చెప్పాడు. షోయిగుతో భేటీ తరువాత సైనిక దళాల చీఫ్‌ వాలెరె గెరాసిమోవ్‌ తమ దండు మీద దాడులకు ఆదేశించినట్లు ఆరోపించాడు. ఈ ఆరోపణను మిలిటరీ తిరస్కరించింది. ఉక్రెయిన్‌లోని బఖుమట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటంలో వాగర్‌ దళం కీలకపాత్ర పోషించింది.
అంతకు ముందు దేశ పౌరులనుద్దేశించి టీవీలో మాట్లాడిన పుతిన్‌ తిరుగుబాటును వెన్నుపోటుగా, విద్రోహంగా వర్ణిస్తూ దీనివెనుక ఉన్న వారిని శిక్షించాలని చెప్పాడు. ఈ కారణంగా ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య ఆగదన్నాడు. తిరుగుబాటు ప్రారంభం కాగానే బెలారస్‌ నేత లుకషెంకో ఒక ప్రకటన చేస్తూ పుతిన్‌కు మద్దతు ప్రకటించాడు. మరో ప్రయివేటు దండు చెచెన్‌ దళాల నేత కదరివ్‌ కూడా ఉక్రెయిన్‌లో ఉన్న మూడువేల మంది తమ వారిని వాగర్‌ దళం మీద పోరుకు పంపుతున్నట్లు చెప్పాడు. వాగర్‌ దళాలు వస్తున్న మార్గంలో అనేక చోట్ల తనిఖీ కేంద్రాలు, భారీ ఎత్తున రష్యన్‌ మిలిటరీ సాయుధ శకటాలను రంగంలోకి దించారు, మాస్కో చుట్టూ భద్రతను పటిష్టం కావించారు.
అరవై రెండు సంవత్సరాల ప్రిగోఝిన్‌ ఒక నేరగాడు. పదేండ్ల పాటు జైలులో ఉండి విడుదలైన తరువాత ఆహార సరఫరా కాంట్రాక్టరు అవతారమెత్తాడు. ఆ క్రమంలో పుతిన్‌ వంట వాడని ఎగతాళి చేసేంతగా దగ్గరయ్యాడు. మిలిటరీ అధికారులతో సంబంధాలు పెట్టుకొని వారి మద్దతుతో జైళ్లలోని నేరగాండ్లు, నిరుద్యోగులను చేరదీసి వాగర్‌ కంపెనీ పేరుతో కిరాయి సాయుధ దళాన్ని ఏర్పాటు చేశాడు. మిలిటరీ అందచేసిన ఆయుధాలు, నిధులతో లిబియా, సిరియా తదితర దేశాల్లో అమెరికా వినియోగించిన ఐఎస్‌ కిరాయి మూకలను ఎదుర్కొనేందుకు పని చేశాడు. దాని కొనసాగింపుగానే ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ మిలిటరీతో తలపడి ఆప్రాంతాలను పట్టుకోవటంలో, క్రిమియాను స్వాధీనం చేసుకోవటంలో కూడా కీలక పాత్ర పోషించాడు. 2016 ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా కొంత మందితో కలసి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసినట్లు కూడా వెల్లడైంది. తమ వద్ద పాతికవేల మంది ఉన్నట్లు ప్రిగోఝిన్‌ ప్రకటించాడు. మరో పాతిక వేల మంది కలుస్తారని, తిరుగుబాటులో కలసి వచ్చే వారందరినీ కలుపుకుంటామన్నాడు. తాము ఎందుకోసమైతే బయలు దేరామో అది ముగిసిన తరువాత మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు తిరిగి వస్తామని చెప్పాడు. రక్షణ మంత్రి దేశాన్ని, పుతిన్‌ను కూడా తప్పుదారి పట్టించాడన్నాడు.
ఎక్కడైనా మిలిటరీ లేదా పారామిలిటరీ తిరుగుబాట్ల గురించే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలుసు. తొలిసారిగా కిరాయి మిలిటరీ ఒక పెద్ద దేశంలో విఫల కుట్రకు పాల్పడటం ఇదే ప్రథమం. ప్రపంచంలో ఇలాంటి సంస్థలు 16వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో ఓడలు, గనులు, చమురు బావుల వంటి వాటికి సాయుధ కాపలాతో పాటు ఎవరు డబ్బులిస్తే వారి తరఫున ఇతర దేశాలు మీద యుద్ధాలు చేసేందుకు కూడా జనాలను పంపుతాయి. కొంత మంది వర్ణించినట్లు పురాతన వృత్తులలో రెండవదిగా కిరాయి మిలిటరీ ఉంది. అధికారికంగా లేదా అనధికారికంగా మన దేశంతో సహా దాదాపు అన్ని దేశాలూ పిఎంసిలను కలిగి ఉన్నాయి. వివిధ దాడుల్లో అమెరికా సైనికులు మరణించటంపై తలెత్తిన నిరసన కారణంగా గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా కిరాయి మూకలను రంగంలోకి దించుకతోంది. దీంతో సైనికుల మరణాలను తగ్గించుకోవచ్చు, పౌరుల నుంచి నిరసనలు ఉండవు. నిరంతరం మిలిటరీని పోషించాలంటే ఖర్చుకూడా ఎక్కువ. రాబోయే రోజుల్లో అధికారిక మిలిటరీ బదులు ఇలాంటి వారితోనే యుద్ధాలు జరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 1990 దశకంలో ప్రతి 50మంది మిలిటరీ సిబ్బందికి ఒకరు కాంట్రాక్టు ప్రయివేటు మిలిటరీ ఉండగా ఇప్పుడు పదికి ఒకరు ఉన్నట్లు అంచనా. ఆయుధాలతో పాటు పిఎంసిల నిర్వహణ పెద్దలాభసాటి వ్యాపారంగా మారింది. లాటిన్‌ అమెరికాలో పోలీసుల కంటే కిరాయి సిబ్బంది ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. 1990లో అమెరికా త్రివిధ దళాల్లో 21లక్షల మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం 14లక్షలకు కుదించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారిక మిలిటరీ కంటే ఇలాంటి కిరాయి దళాలనే అమెరికా ఎక్కువగా దింపింది. అక్కడ అమెరికా 14లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టగా మూడో వంతు ప్రయివేటు మిలిటరీ కాంట్రాక్టర్లకే వెళ్లింది. 2001లో 140 బి.డాలర్లు చెల్లించగా 2019 నాటికి 370 బి.డాలర్లకు పెరిగింది. ఇరాక్‌ మీద దాడి చేసిన అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా అదే చేశాయి. కొన్ని కంపెనీలు పిఎంసి కంపెనీల పేరుతో స్టాక్‌ మార్కెట్లో వాటాలను కూడా అమ్ముతున్నాయి.
సిరియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా పిఎంసిలను రంగంలోకి దింపగా వాటిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా వాగర్‌ వంటి కంపెనీలను మోహరించింది. చమురు సంపదలున్న అరేబియా దేశాలు ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. ఎమెన్‌ వంటి చోట్ల అదే జరిగింది. లాటిన్‌ అమెరికాలో నిరంకుశ పాలకులు ఇలాంటి దళాలతో ప్రతిపక్షాల నేతలు, ఇతరుల మీద దాడులు, హతమార్చటం వంటి దారుణాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ కొనసాగుతోంది. ఏ ప్రయివేటు మిలిటరీ చరిత్రను చూసినా వారి వెనుక మిలిటరీ అధికారులు ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చేది కూడా వారే. ప్రపంచ మిలిటరీ చరిత్రను చూసినపుడు క్రీస్తుపూర్వం నుంచి తరువాత కూడా కిరాయి సైనికుల ప్రస్తావన, వినియోగం కనిపిస్తుంది. ఆసియా దేశాలపై దండెత్తిన అలెగ్జాండర్‌ సేనలో ఐదువేల మంది వరకు ఉన్నారని చరిత్రకారులు చెప్పారు. అతన్ని ఎదుర్కొన్న పర్షియా మిలటరీలో పదివేల మంది గ్రీకులు ఉన్నారు. మన దేశంలోని పాలకులు కూడా కొందరు గ్రీకులను తెచ్చుకున్నట్లు వారిని యవనులుగా వర్ణించినట్లు చరిత్రలో ఉంది. రోమ్‌ పాలకులు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకొనేందుకు, దానిపై దాడులు చేసేందుకు ఇతర దేశాలూ కూడా వేలాది మంది కిరాయి బంట్లను సమకూర్చుకున్నాయి. చైనా యుద్ధ ప్రభువులు కూడా ఇరుగుపొరుగు దేశాలకు చెందిన వారిని కిరాయికి తెచ్చుకున్నారు. చివరికి క్రైస్తవ మతంలో పోప్‌లు కూడా కిరాయి మూకలను రంగంలోకి దించారు. దక్షిణ ఫ్రాన్సులోని కాథర్స్‌ అనే క్రైస్తవ తెగవారి మీద 1.209లో పోప్‌ మూడవ ఇన్నోసెంట్‌ పవిత్ర యుద్ధం పేరుతో కిరాయి మూకలతో దాడి చేయించినట్లు ఉంది.
ఇక వర్తమాన అంశానికి వస్తే వాగర్‌ కంపెనీ నేత తిరుగుబాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా గూఢచారులు పసిగట్టి జోబైడెన్‌కు సమాచారమందించినట్లు అమెరికా మీడియా పేర్కొన్నది. ఈ సమాచారం పుతిన్‌కు ఎందుకు అందలేదు అన్నది ప్రశ్న. ఒక వేళ తెలిసి ఉంటే తగిన జాగ్రత్తలతో రోస్టోవ్‌ నగరంలోని మిలిటరీ కేంద్రం వద్ద భద్రతా చర్యలెందుకు తీసుకోలేదు? అనేక ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానాలు లేవు. తమకు చెల్లించాల్సిన మొత్తాలకు కోత పెట్టారని విమర్శించినట్లు, దళాన్ని మిలిటరీ ఆధీనంలో ఉంచేందుకు వాగర్‌ తిరస్కరించినట్లు వార్తలు వచ్చినప్పటికీ జాగ్రత్తలు తీసుకోలేదు. నాటో నేతలతో ప్రిగోఝిన్‌ సంబంధాల్లో ఉన్నట్లు కుట్ర తరువాత కొన్ని సూచనలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై అవసరం లేకున్నా దాడికి దిగినట్లు పుతిన్‌ మీద ఆరోపణే అందుకు నిదర్శనం. మూడు వారాలుగా జరుపుతున్న ఎదురుదాడుల్లో ఉక్రెయిన్‌ భారీగా నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు ఆశ్చర్యం కలిగించలేదన్నట్లుగా అమెరికా, పశ్చిమ దేశాల స్పందన ఉంది. బెలారస్‌ నేత లుకషెంకోతో వాగర్‌ యజమాని జరిపిన రాజీ చర్చల్లో రష్యా రక్షణ మంత్రి షొయిగు, సైనిక అధికారి వాలెరీ గెరాసిమోవ్‌ను తొలగించేందుకు, వాగర్‌ దళాన్ని ఆఫ్రికా పంపేందుకు అంగీకరించినట్లు నిర్ధారణకాని వార్తలు వచ్చాయి. ప్రిగోఝిన్‌పై దేశద్రోహ విచారణ కొనసాగుతుందని కూడా సోమవారంనాడు కొన్ని వార్తలు పేర్కొన్నాయి. తిరుగుబాటుకు తగినంత మద్దతు లభించకపోవటం, వాగర్‌ దళంలోని కొందరు కమాండర్లు కూడా సిద్ధం కాలేదని వార్తలు వచ్చినందున నేత తోకముడిచినట్లు చెబుతున్నప్పటికీ ఎక్కడా మిలిటరీ ఎందుకు ప్రతిఘటించలేదు, విఫలమైన తరువాత అణచివేయకుండా పుతిన్‌ రాజీకి ఎందుకు అంగీకరించాడు? ఒక వేళ శిక్షిస్తే ఇతర కిరాయి దళాలు తన పట్టునుంచి జారతాయని భావించారా? పుతిన్‌ ఒక బూర్జువా, వాగర్‌ కంపెనీని పెంచి పోషించటంలో అతగాడేమీ తక్కువ తినలేదు. పశ్చిమ దేశాలు చెబుతున్నట్లు పుతిన్‌-రక్షణ మంత్రి- మిలిటరీ అధికారుల మధ్య నిజంగానే సంబంధాలు సజావుగా లేవా? పుతిన్‌ మీద కాదు నా తిరుగుబాటు అని చెబుతున్న ప్రిగోఝిన్‌ ఎవరి మీద కుట్రకు తెరలేపినట్లు? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ప్రస్తుతానికి సశేషమే.
ఎం. కోటేశ్వరరావు
సెల్‌:8331013288