– ఏడు జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తి
-16 రోజుల్లోనే లక్ష్యానికి చేరువలో
– సర్వే విధుల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర సర్వే శుక్రవారం నాటికి కోటి కుటుంబాల మైలురాయిని దాటింది. 16 రోజుల్లో 90 శాతానికి పైగా కుటుంబాల లెక్కలను సర్కార్ తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు గాను శుక్రవారం నాటికి ఎనిమిది జిల్లాల్లో సర్వే దాదాపు పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్లగొండ, మెదక్‌లలో 99.9, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99 శాతం సర్వే పూర్తయింది. కామారెడ్డిలో 98.5, మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. జోగుళాంబ గద్వాల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, ఖమ్మం, నారాయణపేట, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, సూర్యాపేట, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నిర్మల్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో 90 శాతం సర్వే పూర్తయింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో 80 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 75.1 శాతం సర్వే పూర్తయింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇండ్లకు తాళాలున్నవి మినహాయిస్తే దాదాపుగా సర్వే పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రజలందరూ స్వచ్చందగా సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మొదట్లో అనుమానాలు, అపోహలు వ్యక్తమైనప్పటికీ కుల గణన భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో అన్ని వర్గాల్లో సర్వేపై సానుకూలత వ్యక్తమైంది.
రికార్డు స్థాయిలో సర్వే
సెప్టెంబర్ 12న సర్వే కోసం ప్రభుత్వం క్యాబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన ఈ సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమై అవసరమైన విధి విధానాలను ఖరారు చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు ప్రణాళికశాఖను నోడల్ విభాగంగా ప్రభుత్వం నియమించింది. నవంబర్ 6 నుంచి 8 వరకు ఇండ్ల గణనను చేపట్టారు. సర్వేలో బాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలున్నట్టు గుర్తించారు. అనంతరం నవంబర్ 9 నుంచి ప్రభుత్వం సర్వేను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183, పట్టణ ప్రాంతాల్లో 51,73,166 మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్టు సర్వేలో లెక్కతేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది మొత్తం87,807 మంది ఎన్యుమరేటర్లు విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించటంతో పాటు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 8788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొన్నారు.