ఓ అభిమాని కోరిక..

A fan's wish..నటుడు, నిర్మాత, జర్నలిస్ట్‌ సురేష్‌ కొండేటి హీరోగా ‘అభిమాని’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ది డిజైర్‌ ఆఫ్‌ ఏ ఫ్యాన్‌ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‌లైన్‌. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుంది. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో ఎస్‌కే రెహ్మాన్‌, కంద సాంబశివరావు నిర్మిస్తున్నారు. నేడు (ఆదివారం) హీరో సురేష్‌ కొండేటి పుట్టిన రోజు నేపథ్యంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈచిత్ర గ్లింప్స్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ‘మూవీ గ్లింప్స్‌ చాలా బాగుంది. ‘అభిమాని’ అంటే కేవలం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. స్ఫూర్తిదాయకంగా ఈ మూవీ తీశారని అనుకుంటున్నాను’ అని తెలిపారు. ‘గతంలో నేను కొన్ని సినిమాలలో నటించినా, అవన్నీ ఒక ఎత్తు… ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నాది ప్రధాన పాత్ర. రాఘవేంద్రరావు ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయాన్ని పొందుతుందని, నటుడిగా నేను మరో స్థాయికి చేరుకోవడానికి ఆ విజయం దోహదం చేస్తుందని భావిస్తున్నాను’ అని సురేష్‌ కొండేటి అన్నారు.