– రైళ్ల వేగం, భద్రతకే తొలి ప్రాధాన్యం : ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
– ఉత్తమ ప్రతిభ కనబర్చిన రైల్వే ఉద్యోగులకు అవార్డుల ప్రదానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’తో రైలు ప్రయాణీకులు అద్భుత ప్రయాణ అనుభూతిని పొందుతారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. జోన్ పరిధిలో దీన్ని సాధించేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,017 రూట్ కి.మీ.లను విద్యుద్దీకరించామన్నారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇది ఒక రికార్డుగా నిలిచిపోతుందనీ, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో మిషన్ ఎలక్ట్రిఫికేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్, గోల్డెన్ డయాగోనల్, హై డెన్సిటీ రూట్లలో గరిష్ట వేగం గంటకు 130 కి.మీకి పెంచామన్నారు. దక్షిణ మధ్య రైల్వే 68వ వారోత్సవాలను శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డులు అందచేశారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనుంజయులు, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరవింద్ మల్కేడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నెట్‌వర్క్‌కు 383.85 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను జోడించి, నూతన ప్రాంతాలకు మొదటిసారిగా రైలు మార్గాన్ని అనుసంధానించామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జోన్ ఆదాయం రూ. 21,635.49 కోట్లకు పెరిగిందన్నారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.