(చిన్నా, పెద్దా పెట్టుబడిదారుల సంభాషణ)
పెద్ద పెట్టుబడిదారుడు సూరయ్య. చిన్న పెట్టుబడిదారుడు చంద్రన్న.వీళ్లిద్దరూ కొంతకాలం క్రితం, ఈ అడవిలోకి వచ్చి, కూర్చున్నారు. ఎందుకంటే, వీళ్లు ఇచ్చే లంచాలు తింటూ, అనుకూలంగా ప్రవర్తించే పోలీసులు, ‘శ్రామిక వర్గ రాజకీయ పార్టీలో’ సభ్యులైపోయి, పాత జీవితాలు వదిలేసి, సమాజంలో కొత్త కొత్త పనులు చేస్తున్నారు! పోలీసులే కాదు, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా, తమని తాము జీతాలతో పనిచేసిన శ్రామికులుగా గుర్తించుకుని, శ్రామికవర్గ కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా వున్నారు!
పెద్ద పెట్టుబడిదారుడైతే, ఆ కమ్యూనిస్టు పార్టీని ధ్వంసం చేయాలని, కొందరు సైనికుల్ని అయినా పిలవాలని చాలా ప్రయత్నాలు చేస్తే, ఆ సైనికులు కూడా ”మేము కార్మికులం! మాతో ఇంకా యుద్ధాలు చేయిస్తారా?” అంటూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులైపోయినట్టు తెలిసి తెల్లబోయాడు! అంతేకాదు, ఈ ఇద్దరు బూర్జువాల పిల్లలు కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ప్రకారమే నడుస్తున్నారు మరి!
ఈ ఇద్దరు పెద్దా చిన్నా పెట్టుబడుల బూర్జువాలకూ మతులు పోయాయి! ఊరు నించి వినబడే ‘లాభం ధ్వంసం! లాభం ధ్వంసం’ అనే నినాదాల గురించి తెల్లబోయారు! ”ఇది సాధ్యమా, వీళ్లకి సాధ్యమా!” అనుకుంటూ, ఇంకా పోలీసుల కోసం ప్రయత్నిస్తూ ఇళ్లల్లో వుండిపోయారు, కొన్నాళ్లు, ఇక, సాధ్యం కాదనీ, అయినా రేపటి భవిష్యత్తు మళ్లీ తమదే – అనే నమ్మకంతోటీ అప్పుడు త్వరలోనే వెనక్కి వచ్చేయాలని లేచారు, ఊరూ, ఇల్లూ, తాళాలు పెట్టేసి వదిలేసి పోయి, తిరిగి రావాలని! సూరయ్యకి 4 పరిశ్రమలు ఉండేవి. బ్యాంకుల్లో డబ్బూ, వెండి బంగారాలూ ఎన్నో కూడా! చంద్రన్న, సరుకుల్ని అమ్మించే వ్యాపారి. అతని కార్మికులు పూర్తిగా, ఆ కార్మిక వర్గ పార్టీలో కలిసిపోయారు. సమాజాన్ని కొత్తగా మారుస్తారట, ఆ పనులు చేస్తున్నారు.
సూరయ్య, చంద్రన్నని పిలిచి, ”ఏమిటీ ఘోరం?” అన్నాడు, మొదట.”అవును, ఘోరమే! మా ఆవిడే ఆ పార్టీ పనుల్లోనే వుంటాందండీ! చీకట్లోనే లేచి వంటలు చేసేసి! అన్నీ నా కోసం బల్లమీద పడేసి పోతాంది. ఇప్పుడు పట్టుచీరా లేదు, జరీ చీరా లేదు ఇంట్లో! నేత చీరలూ, వాయిల్ చీరలూ మాత్రమే కడతాంది. చాలా గుడ్డలు పేదవాళ్లకంట, ఇచ్చేసింది. వీళ్లు ఇలా ఎలా మారారో అర్ధం కావడంలేదు సారూ! కోర్టుకి పోదామా అంటే, ఇంకేం కోర్టులు? సుప్రీంకోర్టు వాళ్లే ఇప్పుడు వీధుల్లో జయహో, లాభాలు నాశనాలు హో హో హో అంటూ నినాదాలతో ఊరేగింపులు చేస్తున్నారు!”
సూరయ్య, ”వీళ్లకి బాగా లక్షలకొద్దీ డబ్బు పడేసిందా ఆ కార్మికోళ్ల పార్టీ? అదేదో చేసి వుంటారు!” అన్నాడు ఆగ్రహంగా.
”అబ్బబ్బే! అలా అనుకుంటే, కాదండీ! నేను మొన్నటిదాకా అలాగే అనుకున్నాను. మా ఆవిడ మాటలు వింటేనే, ‘అమ్మో! ఈ ఆడోళ్లు, ఇప్పుడసలు ఆడోళ్లు కారయ్యా! మా ఆవిడా, ఆడపిల్లలూ, జుట్టులన్నీ భూతాల్లాగ నెత్తినిండా డబ్బుపోసి కొన్న సవరాల్ని కూడా అంటించుకుని, జుట్టంతా వీపు మీద కాదు, భుజాలమీదే, మొహాలమీదే మోస్తూ వుండేవారు, అందాల కోసం అంట, మొన్నటిదాకా. ఇప్పుడైతేనా? మా ఆవిణ్ణే నేను పోల్చలేకపోయాను మొన్న. నిక్షేపంగా తల దువ్వుకుని, చక్కని జారుముడి వేసుకుంది. ఎంత అందం వచ్చిందోనండీ. నిజంగా ఇప్పుడు! మా పెద్దమ్మాయి అయితే, క్రాపు చేసేసుకుంది. తనే చేసుకుంది! అయ్యయ్యో! ఇదేం గోరం సార్?”
”సరే, సరే, ఈ మాటలకేం గానీ, రేపు వాళ్లే వెనక్కి పరిగెత్తుకొస్తారు గానీ, అది కాదు, ఇప్పుడెలాగ? ఎలాగ?”
”ఇంకెలాగండీ? కొన్నాళ్లు అడివి వేపు పోదాం. నిన్న సాయంత్రం, ఒక జడ్జి, ఇప్పుడు జడ్జి కాదు, ఒక ‘లీడర్’ అంట! నాయకుడు! ఊరేగింపులో ఏం చెప్పాడంటే, ‘ధనవంతులు అందరూ లేచి అడవికి పోతారా, మాకేం అభ్యంతరం లేదు! అడవులు, మా శక్తులతో తయారైనవి కావు. ఈ వూళ్లూ, ఈ రోడ్లూ, ఈ ఇళ్లూ, అయితే, అన్నీ మనుషుల శ్రమలవి! ఈ రోడ్లూ, మీ ధనిక భవనాలూ, ఈ కరెంట్లూ, ఈ కంప్యూటర్లూ, ఇవీ అవీ, అన్నీ మా వర్గం శ్రమలతో తయారై నడుస్తున్నవే! మీరు ఏదైనా పని చేస్తేనే ఇక్కడ ఉండండి! లేకపోతే, అలాంటివాళ్లకి, ఈ ఇళ్లల్లో వుండే హక్కుల్లేవు! రోడ్డుమీద నడిచే హక్కులేదు! నీళ్లు ముట్టుకునే హక్కులేదు! అవి అన్నీ నిత్యం మా శ్రమలవల్లే తయారై, పరిశుభ్రంగా అందుతున్నాయి!” అని పెద్ద ఉపన్యాసం ఇచ్చుకుంటూ, ఆ నాయకుడితో గుంపంతా అరుస్తూ, చప్పట్లతో, గంతులతో తిరిగిందండీ!…”
”వెంటనే నువ్వు పోలీసుల్ని పిలవొద్దూ?”
”అయ్యయ్యో! వాళ్లు కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రకారం నడుస్తున్నారండీ బాబూ!”
”ఎందుకూ? వాళ్లు జీతాలు బాగా పెంచేసి ఇస్తున్నారా!?”
”అబ్బబ్బే! అలా కాదు, అసలు జీతాల పద్ధతేమీ ఇంకా ప్రారంభం కాలేదు. అవి, ఉండాలా – పోవాలా – అని చర్చలు చేస్తున్నారంట! మీ పెద్దబ్బాయే వాళ్లల్లో ఒకడండీ!”
”ఆు, ఛ! మా అబ్బాయి అయితేనా? ఆఫీసుకి పోతున్నాడు. వాడు, నన్ను అడక్కుండా ఎటూ వెళ్లడయ్యా! ఆస్తి అంతా పోతదంటే వాడికి ఏడుపు కాదూ?”
”అయ్యయ్యో! ఎలాగ? మనం కళ్లు మూసుకుని కూర్చుంటే ఎలాగ? ఆస్తులన్నీ మనవే అంటారా? వాళ్లు అలాగే అంటున్నారు. పనులకు దిగనివాళ్లు, వాళ్ల ఇష్టంతో వాళ్లు దిగకపోతే, ఎటో పోకపోతే, అలాంటి వాళ్లకి అరెస్టులంట! అసలు, జైళ్లన్నీ ఖాళీ చేసేశారండీ! అక్కడవున్న వాళ్లల్లో చాలామందిని మనం, జైళ్లల్లో అన్యాయంగా పెట్టించామంట! జైళ్లన్నీ ఖాళీ! ఖాళీ! బూర్జువాలందర్నీ అక్కడ పెడతారంట! బూర్జువాలం అంట మనం! సూరయ్యగారూ! మీ సరుకులన్నీ అమ్మిస్తూ నేను బాగా సంపాదించాను గానీ, అదెక్కడుంది? బ్యాంకుల్ని మూసేశారు! ఇంకా ఇక్కడే వుండి, జైళ్లకే పోదామంటారా? నేనలా వెళ్లనండీ. అడివికి పోతేనే మంచిది. రేపు మళ్లీ మన రోజు మంచిదవుతుందా! నా జాతకం అలాగే వుంది, మీరు కూడా…. ఏమో, ఏం జాతకాలో! నమ్మాలనిపించడంలేదు! వెనక్కి వచ్చేస్తాం! ఇంటికి రాగానే నా పెళ్లాన్ని చావగొట్టాలి, చచ్చినా సరే! రెండోది దొరకదా? అంతా చేస్తాను. నేను పోతానండీ అడవికి.”
”అక్కడ ఎలా వుంటాం? ఏం తింటాం?”
”ఏదో తింటాం లెండి! చాలా గడ్డి వుంటుంది లెండి అడివి నిండా. మా వాళ్లు అదీ చెప్పారు. వాళ్లే భోజనాలు పంపిస్తారంట కొన్నాళ్లు. ఎన్నాళ్లో! మనం అన్నాళ్ళు అక్కడే వుండిపోతామా? ఆర్నెలల్లో రామా? నేను వెళ్తానండీ!” అంటూ లేచాడు చంద్రన్న.
”ఉండు! ఆగు! ఆగు! తప్పదంటే, ఇక్కడే జైల్లో వుంటానా? పోదాం గానీ, ఏం తీసుకుపోవాలి? బ్యాంకు ఎక్కౌంట్లు పట్టుకుందాం.”
”ఇంకేం ఎక్కౌంట్లు? అవన్నీ వాళ్ల శ్రమలంట! అదీ నిజమేలెండి! అన్నీ వాళ్లు స్వాధీనం చేసుకున్నారు! ఇక, నేను వెళ్తానండీ! మనం వడ్డీలతో, లాభాలతో సంపాదించిందంతా శ్రామిక వర్గపు శ్రమల వల్లేనంట! అంటున్నారు వాళ్లు! నేను జైల్లోకి వెళ్లలేనండీ! సిగ్గుచేటు! ఏదో పనిచెయ్యాలంట ఇక్కడే వుంటే! ఏం పని చేస్తాను? నేనిక చెప్పలేను. ఇంకా ఈ ఊళ్లోనా! అడివిలోకే పోతా, రెండు జతల గుడ్డలు పట్టుకుని! ఫోను వుందిలెండి” అంటూ చంద్రన్న లేచిపోయి చకచకా ఎటో పరిగెత్తాడు.
సూరయ్యకి, నించోవాలో, కూర్చువాలో, ఏం చెయ్యాలో తోచలేదు!
”ఒరేరు!” అని పనివాణ్ణి పిలిచాడుగానీ, ఒక్కడూ లేరు, మాయం! పెళ్లమూ రాదే! ఎక్కడ చచ్చింది?
***
కాలం గడుస్తోంది! కాలం! కాలం! కాలమే సూరయ్యని కూడా మార్చినట్టుంది! చంద్రన్నని వెతుక్కుంటూ తను కూడా రెండు గుడ్డల సంచితో, అడవి వేపే భారంగా అడుగులేస్తూ నడిచాడు!
***
అక్కడ చంద్రన్న, ఒక చెట్టు కింద చిన్న గుడిసెలో, గుడిసో, పందిరో, ఉన్నాడు అక్కడే! రెండు రోజులకోసారి క్యారేజీతో భోజనాలు వస్తున్నాయంట!
తర్వాత, సూరయ్యకి కూడా అలాగే మొదలై సాగుతోంది భోజనం.
రెండే రెండు రోజుల్లోనే చంద్రన్న లేచాడు. ”నేనిక వుండలేను ఇక్కడ. ఊళ్లోకే పోతానండీ!”
”ఊళ్లోకా! అక్కడ పని చెయ్యాలన్నావు?”
”అదే, చేస్తా! లేకపోతే, జైల్లో వుంటానా? జైళ్లో కూడా పనులు చెయ్యాలంటండి! ఊళ్లోనే వ్యవసాయం పనే. ఫర్వాలేదు. మీరూ వచ్చేస్తారా?”
సూరయ్యకి కోపం! ఆగ్రహం! ”ఏంటి, నన్ను, నీలాంటి సరుకులు అమ్మించేవాణ్ణి అనుకుంటున్నావా? నా కమీషన్లతో బతికావు నువ్వు! నన్ను కూడా పిరికిపందని అనుకుంటున్నావు? నీ పెట్టుబడి, ఎంత? సింగినాదం అంత! యాభైలక్షలన్నా వుంటదా? నా పెట్టుబడి యాభైకోట్లు! నీతో నన్ను పోల్చుకుంటూ మాట్లాడకు!”
”క్షమించండి! ఒక కోటి దాకా అన్నా సంపాదించాలను కున్నాను. కానీ, జరగలేదులే! నా వర్కర్లు మంచివాళ్లే. అయినా జరగలేదు! అయ్యో, పోయి, ఏదో పని మొదలుపెడతా!” అంటూ చంద్రన్న లేచాడో లేదో, అటు పరిగెత్తాడు.
***
ఆ మర్నాడు గొడవయ్యింది సూరయ్యకి, క్యారేజీ తెచ్చిన చిన్న కొడుకుతో! రెండడుగుల ఎత్తు క్యారేజీ కాదు. ఒక్క చిట్టి గిన్ని క్యారేజీ అది! బుజ్జి గిన్ని! దాన్ని చూడగానే, ”ఇదేమిటి?”అని, కెవ్వున అరిచాడు, కొడుకు మీద, సూరయ్య. ”నా ఆస్తి అంతా నీకే రాద్దామనుకున్నాను?” అన్నాడు.
కొడుకు ధీమాగా ఆ గిన్ని అక్కడ పారేసి, మన ఆస్తి అంతా పార్టీ ఎప్పుడో తీసేసింది. ”ఇక రోజూ రాను. రానూపోనూ గంటలు గంటలవుతోంది. ఇక రాను” అనేసి వెనక్కి తిరిగాడు. తిరక్కముందే మాయం!
కొడుకు అలా చెయ్యడనే సూరయ్య అనుకున్నాడు. కానీ చేశాడు, కుమారుడు!
”కమ్యూనిస్టు జబ్బా?” అనుకున్నాడు పెట్టుబడిదారీ తండ్రి!
***
సూరయ్యకి గడ్డం, మీసం అంతా పెరిగిపోయింది. తల జుట్టుని ముడేసుకోవలిసి వచ్చింది. అలా చెయ్యకపోతే, చెట్లకొమ్మలు జుట్టుని లాగుతున్నాయి. ఇక, భోజనం? దూరంగా చిన్న గుడిసె! ఆ వృద్ధురాలెవరో రోజుకి ఒక్క చేప ముక్క కాల్చి ఇస్తోంది. అతడు ధనవంతుడని తెలుసు. అయినా, ఎందుకో జాలిపడింది! పార్టీవాళ్లు తిడతారని కూడా తెలుసు!
సూరయ్య, చెట్లకింద ఎప్పుడెప్పుడో రాలి ఎండిపోయిన పళ్లు ఏరుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. కాస్త దూరంగా నీళ్లమడుగు లాంటిది. అందులో చేపలున్నాయి… ఆ ముసలమ్మ ఒక బుట్ట ఇస్తే, దాన్ని నీళ్లలోకి ముంచితే నాలుగు చేపలు దొరుకుతాయి. అడవిలో ముసలమ్మ ఆ చేపలు తీసుకుని అన్నం కూడా తెస్తుంది.
గడిచింది, ఎన్నాళ్లో! తెలియడం లేదు! ఊళ్లో అయితే, రోజూ వర్కర్లు వచ్చారో లేదో అన్నీ తెలిసేది! లాభం లెక్కలైతే, వేలల్లో, లక్షల్లో, తెలిసేవి!
(మిగతా రేపటి సంచికలో)
రంగనాయకమ్మ