కలహాల నేపథ్యంలో రైతు ఆత్మహత్యా యత్నం.. పరిస్థితి విషమం

– పరిస్థితి విషమం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ రైతు క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణానికి యత్నించిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దూరు గ్రామానికి చెందిన పోలెబోయిన లక్ష్మయ్య అనే రైతు మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ పడ్డాడని, నాటి నుంచి ఇంటి పట్టున లేకుండా సమీపాన నడిమిగూడెం గ్రామంలో జరిగే జాతర వద్దే మూడు రోజులుగా ఉంటున్నాడని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పూట పురుగుల (గడ్డి) మందు తాగిన విషయం మాకు ఆలస్యంగా తెలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. లక్ష్మయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక వైద్యులు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయగా పైలట్ పరమ శ్రీహర్ష, ఈఎంటి ప్రేమలత 108 వాహనంలో తీసుకెళ్లారు. లక్ష్మయ్య భార్య పద్మ అనారోగ్యంతో ఇంటి వద్ద, అతని తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇంతలో తాను ఇలా ఆత్మహత్యకు యత్నించాడని గ్రామస్తులు నిట్టూర్చారు.