కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘బాపు’. ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. బలగం సుధాకర్ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అలాగే మేకర్స్ ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధుర ఆడియో ద్వారా సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత మధుర శ్రీధర్ కూడా గెస్ట్‌గా విచ్చేశారు. విశ్వక్ సేన్ టీజర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’నా ఫస్ట్ సినిమా కూడా ఇండిపెండెంట్ సినిమా. ఇండిపెండెంట్ సినిమా గెలవడం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమా సక్సెస్ అయితేనే మేకర్స్‌కు ఉత్సాహం, ధైర్యం వస్తుంది. నిజాయితీగా తీసిన సినిమా ఇది. టీజర్ చూస్తే చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’ అని చెప్పారు. ‘పల్లెటూర్లలో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి?, డబ్బు అవసరాలు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నాం. అలాగే వారం ముందుగానే ఫిబ్రవరి 14 నుంచి ప్రీమియర్ షోలు వేయాలని డిసైడ్ అయ్యాం’ అని నిర్మాత మధుర శ్రీధర్ అన్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ..’ఇందులో నేను చేసింది రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన రష్మికకు థ్యాంక్స్’ అని తెలిపారు.