రోజువారి పిల్లల కథల కన్నా మిన్నగా ఆసక్తిదాయకంగా రాసిన ఈ పిల్లల కథా సంపుటి రచయిత కూచిమంచి నాగేంద్ర ఇటీవల విరివిగా బాలల కథలు రాస్తున్నారు. వీరి కథలు పిల్లల మనసెరిగి ఉంటాయి. నాగేంద్ర వెలువరించిన నూతన కథా సంపుటి ‘చందమామలో మేనమామ’.
దీనిలో మొత్తం 23 కథలున్నాయి. ప్రతికథా ఆధునికత ఉట్టిపడుతూ ఉంటుంది. నేటితరం పిల్లలు, పెద్దలు అన్ని పనులకు యంత్రాల మీద, యంత్ర శక్తి మీద ఆధారపడి బతికేస్తున్నారు తప్ప సహజమైన శారీరకశక్తిని వినియోగించక అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు అనే మంచి సందేశాన్ని ప్రయోగాత్మకంగా పిల్లలకు వివరించారు రచయిత ‘పనిలోనే ఆరోగ్యం’ కథ ద్వారా.
చిన్నపిల్లలకు పుస్తక జ్ఞానంతో పాటు లోకజ్ఞానం అత్యవసరమని చెబుతూ విద్యార్థులకు విద్యాబోధన విషయంలో ఎంత గొప్ప బోధన చేసినా అది పిల్లలకు ఒత్తిడి లేని విధంగా ఉంటేనే సత్ఫలితాలు వస్తాయనే నిజాన్ని తెలిపిన కథలు… ‘కొడుకే స్నేహితుడైతే, పిల్లల మనసెరిగిన మాష్టారు’.
ఎనకటికి మన అందరికీ తెలిసిన అత్యంత పాత సామెతలు ‘అంతా మనమంచికే, చెప్పుడు మాటలు చేటు’. ఈ రెండు అంశాలను కథా వస్తువులుగా తీసుకొని నేటి ఆధునిక సామాజిక పరిజ్ఞానం జోడించి అందంగా రాసిన ఈ కథల్లో చక్కని సందేశంతో పాటు పాతలో కొత్త జోడింపు తీరు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.
తెలివిని సందర్భోచితంగా ఉపయోగిస్తే ఎలాంటి భయంకర కష్టాలనుంచైనా బయటపడవచ్చని మంచి నీతిని పంచిన కథ ‘కోడి పిల్ల తెలివి’. మేతకు వెళ్లిన కోడిపిల్ల దారి తప్పి అడవిలోకి వెళ్లి తమ జాతికి బద్ధ శత్రువు అయిన నక్కకు చిక్కి తనదైన తెలివి, మాట తీరు సాయంతో అదే నక్క తోడు రాగా తన ఇంటికి క్షేమంగా చేరుకున్న విషయం ఈ కథ వివరిస్తుంది. ఇదే కోవకు చెందిన మరో యుక్తి కథ ‘అపాయంలో ఉపాయం’. దీనిలో జింక తనదైన మంచితనంతో మరో జింక వైద్యుడు సాయంతో తెలివిగా, నక్క మోసకారితనం నుంచి, సింహం బారిన పడకుండా ఎలా చాకచక్యంగా తప్పించుకుందో ఈ కథ తెలుపుతుంది.
నేటి ఆధునిక నివాసాలన్నీ మట్టికి దూరంగా బతుకుతున్న జీవితాలు. అలాంటి అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఆధునిక పద్ధతితోనే తాజా కూరగాయలు ఎలా పండించుకోవచ్చు, తద్వారా అందమైన ఆరోగ్యాలు ఎలా సమకూరతాయో చెప్పిన కథ ‘మేడమీద పంట’.
నేటి ఆధునిక పిల్లలకు ఏదైనా ఊరికే నోటితో చెప్పేస్తే సరిపోదని, వాటిని ప్రత్యక్షంగా ప్రయోగాత్మకంగా చెప్పినప్పుడే విషయాల మీద నమ్మకం కలిగి ఆచరించడానికి ఎక్కువ అవకాశాలుంటాయని నమ్మిన నాగేంద్ర తన కథలన్నీ ప్రయోగాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విధానానికి చెందిన కథ ‘తాతయ్య పాఠం’. రాము, సోము, ప్రసాద్, ప్రణవి, అనే పిల్లలకు వాళ్ళ తాతయ్య ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల, అనే నాలుగు సుగుణాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూపించారు. దీనిలో చీమ ద్వారా ‘పొదుపు’, తుమ్మెదల ద్వారా ‘ఓర్పు’, సాలెపురుగు ద్వారా ‘పట్టుదల’, పిచ్చుక ద్వారా ‘నేర్పు’ ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించి పిల్లల్లో మార్పుకు శ్రీకారం చుట్టారు. విద్యాబోధనలో కూడా పుస్తకంలోని విషయాన్ని ఊరికే చదివి చెప్పడంతో పాటు అందులోని అంశాలను వీలైనప్పుడు ప్రత్యక్షంగా చూపించగలిగితే తమ బోధనలో కూడా సంపూర్ణ సాధికారిత చేకూరుతుందనే అంశాన్ని అంతర్గతంగా చెప్పారు. అటు పెద్దలకు, ఇటు పిల్లలకు సమదృష్టితో సందేశాలు పంచిన మంచి కథ ‘తాతయ్య పాఠం’.
పిల్లలకు అవసరమైన విషయాలు చెప్పడంలోని నూతన విధానం ఆవిష్కరించిన కథ ‘చందమామలో మేనమామ’. పిల్లలకు ఏది చెప్పాలన్నా మనకు తోచినట్టు, తెలిసింది, చెప్పడం కాదు. వారికి కావలసింది, వాళ్ళ భాషలో చెప్పడం ఉత్తమం అన్న విషయాన్ని ఉత్సాహభరితంగా, ఉత్కంఠకరంగా చెప్పడంలో రచయిత తనదైన శైలిలో సఫలీకతులయ్యారు. ఇలాంటి నూతన ధోరణి నేటి ఆధునిక బాల సాహిత్యానికి అత్యవసరం.
‘అపాయంలో ఉపాయం’ తో మొదలై ‘చెప్పుడు మాటలతోచేటు’ వరకు సాగిన ఈ 23 కథలు వేటికవే వెరైటీగా ఉన్నాయి. ‘యజమానికి ప్రేమతో, కొడుకే స్నేహితుడైతే, మూడో వరం, మేడ మీద పంట’ వంటి పేర్లు చక్కగా ఆసక్తి దయకంగా ఉన్నాయి. మిగతా కథల పేర్లు కూడా ఇదే తీరుగా ఉంటే మరింత ఇంపుగా ఉండేది. కథకు వస్తువు చెప్పే శైలి ఎంత ముఖ్యమో పేరు కూడా అంతే ప్రధానం అన్న విషయం ప్రతి రచయితా గమనించాలి. ఆధునిక విద్యార్థులందరూ విధిగా చదవదగ్గ మంచి కథల పుస్తకం ఇది.
– డా||అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223