ఇల్లందు ‘కారు’లో పోరు

A fight in a 'car' here– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిప్రియపై అసమ్మతి
– ఆమెను ఓడించి తీరుతామంటున్న వ్యతిరేకులు
– ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌ షాడో వ్యవహారాలపై ఆగ్రహం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థులు కొందరికి అసమ్మతి సెగ తాకుతోంది. అభ్యర్థులను మార్చకపోతే సపోర్టు చేసేది లేదంటూ అక్కడక్కడ నిరసన గళం విప్పుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యవహారంపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు పూనుకుంటున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించి జోష్‌ మీదున్న బీఆర్‌ఎస్‌ పెద్దలకు స్థానికంగా అభ్యర్థులపై వ్యతిరేకత ఓ తలనొప్పిగా మారింది. అసమ్మతి గళం విప్పుతున్న నియోజకవర్గాల్లో ఒకటి భద్తాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు. ఇక్కడి ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌పై అసమ్మతి ఫైరవుతోంది. ఆమె భర్త వ్యవహార శైలిపై మొదటి నుంచి సొంత పార్టీ నేతల నుంచి అభ్యంతరాలున్నాయి. ఆయనో షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ ‘కారు’చిచ్చుకు కారణమవుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇంత తెలిసినా అధిష్టానం హరిప్రియ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయడంపై అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి.
భర్త షాడో ఎమ్మెల్యేలా..!
కాంగ్రెస్‌ పార్టీని వీడి హరిప్రియ కారు పార్టీలో చేరినప్పుడే వచ్చేసారి కూడా తనకు టికెట్‌ ఇవ్వాలని ఒప్పందం చేసుకొని మరీ బీఆర్‌ఎస్‌లో చేరారని టాక్‌. ఆ తర్వాత నుంచి ఆమె భర్త హరిసింగ్‌ అన్నీ తానై నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని, ఒక విధంగా చెప్పాలంటే ఆయన షాడో ఎమ్మెల్యేలా ఉన్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇల్లందు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కావడంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో హరిసింగ్‌ దూకుడు పెంచారని టాక్‌.
ఎమ్మెల్యే భర్తకు ఎవరైనా నచ్చకపోతే ఆ నేత విషయంలో ఎందాకైనా వెళ్తారనే గుసగుసలు ఆపార్టీలో వినిపిస్తున్నాయి. టేకులపల్లి మండలానికి చెందిన లక్కినేని సురేందర్‌కు మండలంలో మంచి పట్టుంది. ఆయన ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించాలని కేసులు పెట్టి వేధించటంతో ఆయన జెడ్పీ చైర్మెన్‌ కోరం కనకయ్య వెంట వెళ్ళారు. మరో నేత సత్యనారాయణ కూడా కనకయ్య చెంతకే చేరారు. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మెన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరావు, ఎమ్మెల్సీ తాత మధు వెంట నడుస్తున్నారని సొంతపార్టీ కౌన్సిలర్ల చేత చైర్మెన్‌పై తిరుగుబాటు చేయించేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొందరు కౌన్సిలర్లతో కలిసి చైర్మన్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మున్సిపాలిటీలో మరోనేత పులిగల్ల మాధవరావు ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. అలాగే గార్ల, బయ్యారం, టేకులపల్లి, కామేపల్లి, ఇల్లందు మండలాల్లో కీలక నేతలుగా ఉన్న దుర్గాప్రసాద్‌, మధుకర్‌ రెడ్డి, నలమాస రాజన్న, మూడు కృష్ణప్రసాద్‌ గతంలో బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేగింది. అయినా ఎమ్మెల్యే భర్త వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అసమ్మతి నేతలు చెబుతున్నారు. పార్టీ అధిష్టానానికి హరిప్రియకు టికెట్‌ ఇవ్వొద్దని మొరమెట్టుకున్నారు.
ఎమ్మెల్యే హరిప్రియకు టిక్కెట్‌ ఇచ్చి నెలరోజులు అవుతున్నా ఆమె అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఇటీవల ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ వద్ధిరాజు రవిచంద్రను నియమించారు. ఆయన ఇటీవల కార్ల ర్యాలీతో ఇల్లందుకు వెళ్ళారు. అసమ్మతి నేతలు ఎవరూ ఆ ర్యాలీలో పాల్గొనలేదు. ఆ తర్వాత అసమ్మతి నేతల్లో కీలకంగా ఉన్న ఇల్లందు మున్సిపల్‌ చైర్మెన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరావుతో ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్‌, ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర సమక్షంలో రాజీ కోసం సమావేశమయ్యారు. అక్కడ చైర్మెన్‌, ఎమ్మెల్యే భర్త మధ్య మాటలయుద్దం జరగడంతో చర్చలు అర్థంతరంగా ముగిసినట్టు తెలిసింది. తాజాగా అసమ్మతి శిబిరంలోకి ఇల్లందు మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ జానీపాషా చేరటంతో ఎమ్మెల్యే శిబిరంలో వణుకు ప్రారంభమైంది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే హరిప్రియ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఒకరిద్దరు కావాలనే తనపై, తన భర్తపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులు చేశానని, అవే తన గెలుపునకు బాటలు వేస్తాయని హరిప్రియ విశ్వాసంతో ఉన్నారు. అసమ్మతి నేతలు మాత్రం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా.. ఆమెకు బీ ఫామ్‌ రాకుండా ఉమ్మడి జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి సహాయంతో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. చివరికి అసమ్మతి పైచేయి సాధిస్తుందా? హరిప్రియ నెగ్గుకొస్తుందా? చూడాలి.