చలి పులితో పోరాటం

చలిపై గాలి సవారి చేస్తూ
బెబ్బులిలా వేటాడుతోంది
గూడేలు గుడిసెలు గజగజలాడాయి
మేడలు ఫ్లాట్లు వెచ్చటి దుప్పట్లో
పండుగ చేసుకుంటున్నాయి

దోమలు ఘీ రావాలు చేస్తూ
విరామ మెరుగక రక్తం జుర్రేస్తుంటే
కంపెనీలు అలుపెరగని యాడ్సుతో
‘మస్కిటో’లతో జేబులు పిండేస్తున్నాయి

వీధుల్లో చెత్తబండ్లే కాస్త చుక్కేసుకని
వీధులన్నిటికీ స్నానాలు చేయిస్తున్నాయి
పాపం చలైనా, ఎండైనా కడుపు గోలకు
జోల పాడాలంటే తప్పని పనులు మరి

స్వెట్టర్లు తొడుక్కుని కూరగాయలు
చలి గాయాలు తప్పించుకుంటూ
లూనా బండ్లెక్కి రండమ్మ రండంటూ
వంట ఇళ్ళల్లో ఘుమఘుమలు రేపాయి

చలిపులిని పాల వ్యాన్లు వెంటాడుతూ
ప్యాకెట్లను గురి చూసి బాణాలు చేసి
బడ్డీ కొట్ల లోపలకి విసురుతున్నాయి
బట్లర్లై వ్యాపారులు సేవలందిస్తున్నారు

ఇప్పుడూ వెరపెరుగని కష్టజీవి సాహసమే
జనం బతుకు దినాన్ని దొర్లిస్తోంది, ఔ కదా

– ఉన్నం వెంకటేశ్వర్లు