జీవితంలో పైకి రావడానికి మనుషులు ఎన్నో మార్గాలు ఎన్నుకుంటారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వత్తిలో ఎదగడానికి ఎన్నో పాట్లు పడుతున్న వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు. చాలా సార్లు వాళ్లు ఎన్నుకునే మార్గాలు నైతికతను, మంచితనాన్ని, మనిషితనాన్ని ప్రశ్నించేవిగానే ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా ఎవరికి నచ్చిన మార్గాన వాళ్ళు ముందుకు వెళ్ళడమే జీవించడం అనే తరం వచ్చేసిన తరువాత ఎదగడమే ముఖ్యం అవుతుంది తప్ప దానికి వాళ్లు ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావించే స్థితిని అందరూ దాటేశారు. కాని ఈ ఎదగడం వారికి ఎంతవరకు సంతోషాన్ని ప్రశాంతతను ఇస్తుందన్నది కొన్ని సందర్భాలలో ఆగి చర్చించుకోవలసి వస్తుంది. అలాంటప్పుడే విజయం కన్నా దాన్ని అందుకున్న మార్గం, దానికి చేరడానికి మనిషి రాజీ పడిన విధానం గురించి చర్చ మొదలవుతుంది. అప్పుడు జీవితంలో పైకి రావడం కోసం నైతికంగా తాము రాజీ పడడం పెద్ద తప్పిదం అని అర్ధం అయి మనుషులు సత్యాన్వేషణ మొదలెడతారు. వారికి తగిలిన ఎదురు దెబ్బల వల్లే వారిలో ఈ మార్పు వస్తుంది కాని కాలక్రమేణా ఆ మార్పును అంగీకరించే వ్యక్తులూ తగ్గిపోతున్నారు.
కార్పొరేటీకరణ గురించి పెద్దగా మాట్లాడుకోని రోజుల్లోనే వచ్చిన సినిమా ‘ది అపార్ట్మెంట్’. 1960లో వచ్చిన ఈ సినిమా కథ ఉద్యోగ ప్రపంచంలో ఎదగడానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నుకున్న దారులను చర్చిస్తుంది. ప్రస్తుతం అదే మార్గాన ప్రయాణిస్తున్న లక్షలాది వ్యక్తుల జీవితాలలోని ఒంటరితనం వెనుక కారణాన్ని చూపిస్తుంది.
సి.సి. బడ్ బాక్స్టర్ ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్‌గా పని చేస్తుంటాడు. ఒక పెద్ద ఆఫీసులో వందలాది సామాన్య క్లర్కుల మధ్య అతనో అనామకుడు. జీవితంలో పైకి రావాలన్నది అతని ఆశయం. ఆ గానుగెద్దు ఉద్యోగంలో అందరిని దాటుకుని వత్తిలో ఎదగాలంటే పై అధికారులను మెప్పించాలని అతనికి అర్ధం అవుతుంది. అందుకని తన ఇంటిని ఆ అధికారుల కామక్రీడలకు అందుబాటులో ఉంచుతూ ఉంటాడు. అతని పై ఆఫీసర్లయిన నలుగురు వ్యక్తులు ఆఫీసు అయిపోయిన తరువాత తమ గర్ల్ ప్రెండ్లను అతని ఇంటికి తీసుకెళుతుంటారు. ఎవరికి ఏ రోజు తన ఇల్లు ఖాళీ ఉంచాలో చూడడం బాక్స్టర్‌కు ఓ పనిగా మారుతుంది. దీని కోసం ఆఫీసు అయిన వెంటనే అతను ఇంటికి రాడు. ఆ సమయంలో ఏదో ఓ జంట ఇంట్లో ఉంటుందని అతనికి తెలుసు కాబట్టి ఒక్కడే ఆఫీసులోనూ, ఆ తరువాత రోడ్లపైన కాలక్షేపం చేస్తూ ఆ జంట వెళ్లిపోయారని తెలిసిన తరువాత ఇల్లు చేరతాడు. ఒక్కోసారి రాత్రుళ్లు కూడా అతను వీధుల్లో గడపాల్సి వస్తుంది. అతను ఇంతగా కష్టపడేది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం.
ఆ నలుగురు ఆఫీసర్లు అతని గురించి మంచిగా పై అధికారికి ఓ రిపోర్టు పంపిస్తారు. నలుగురు నుంచి ఓ వ్యక్తిపై ఇంత మంచి రిపోర్టు వచ్చాక వీళ్లందరి పై అధికారిగా వ్యవహరించే షెల్డార్క్ బాక్స్టర్ గురించి వివరాలు తెలుసుకుంటాడు. అతని ఇంటిని ఆ నలుగురు వాడుకుంటున్నారన్నది షెల్డార్క్‌కు తెలుస్తుంది. బాక్స్టర్‌ని పిలిచి అతనికి ప్రమోషన్ ఇస్తూనే అతని ఇంటి తాళాన్ని తనకూ అందుబాటులో ఉంచమని చెబుతాడు షేల్డార్క్. అతనూ ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉంటాడు. అంత పెద్ద అధికారి తనను సహాయం కోరడం తాను పైకి ఎదగడానికి దొరికిన అదష్టంగా బాక్స్టర్ భావిస్తాడు. తన ఇంటి తాళం బాస్‌కు ఇచ్చి కొత్త సీటుకి మారతాడు.
ఆ ఆఫీసులో ఫ్రాన్ కుబ్లిక్ అనే ఓ అందమైన అమ్మాయి లిప్ట్ ఆపరేటర్‌గా పని చేస్తూ ఉంటుంది. బాక్స్టర్ ఆమెను ఇష్టపడతాడు. షెల్డార్క్‌కు ఇంటి తాళం ఇచ్చిన రాత్రి అతను బాక్స్టర్‌కి రెండు సినిమా టిక్కెట్లను ఇస్తాడు. తనతో సినిమాకు రమ్మని బాక్స్టర్ ఫ్రాన్‌ను కోరతాడు. ఆమె ముందుగా తాను ఒకరిని కలవాలని అతన్ని కలిసి తరువాత అక్కడకు వస్తానని అంటుంది కాని ఆమె సినిమాకు రాదు. ఆ రాత్రి ఆమె బాక్స్టర్ ఇంట్లో షెల్డార్క్‌ను కలుస్తుంది. అతనితో తన సంబంధం ముగిసిందని ఆమె భావిస్తుంది. కాని షెల్డార్క్ ఆమెను మాటలతో మళ్లీ లోబరుచుకుంటాడు. ఆ రాత్రి అతనితో ఆమె అక్కడే గడుపుతుంది. అయితే అప్పటికే వివాహితుడైన షెల్డార్క్ తనను కేవలం ఉపయోగించుకుంటున్నాడని, అతనితో తన భవిష్యత్తు శూన్యం అన్న సంగతి ఫ్రాన్‌కు అర్ధం అవుతుంది. షెల్డార్క్‌తో సంబంధం మానుకోవాలని ఆమె అందుకే అనుకుంటుంది. కాని మళ్ళీ అతని మాటల మత్తులో పడిపోయి అతనితో గడపడానికి ఒప్పుకుంటుంది.
ఆ రాత్రి ఇల్లు చేరిన బాక్స్టర్‌కు ఆ ఇంట్లో పగిలిన స్త్రీలు ఉపయోగించే చిన్న మేకప్ అద్దం కనిపిస్తుంది. దాని షెల్డార్క్‌కు మరుసటి రోజు తెచ్చి ఇస్తాడు బాక్స్టర్. కాని అదే అద్దం మళ్ళీ ఫ్రాన్ చేతిలో చూసిన తరువాత అతనికి ఆమె షెల్డార్క్ ప్రియురాలన్నది అర్ధమవుతుంది. తాను ఇష్టపడే స్త్రీ తన ఇంట్లోనే తన బాస్ స్వార్ధానికి బలవుతుందని తెలిసి అతనికి బాధ కలుగుతుంది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. క్రిస్మస్ ముందు రోజు ఫ్రాన్ ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. షెల్డార్క్‌ని బాక్స్టర్ ఇంట్లో కలుస్తుంది. కాని అతను తనను ఉపయోగించుకుంటున్న విధానం ఆమెను ఇంకా నిరాశలోకి నెట్టేస్తుంది. తన శరీరం కోసమే అతను ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, తాను అతనికి ఓ వస్తువు మాత్రమే అని ఆమెకు అర్ధం అయి ఎంతో వేదన అనుభవిస్తుంది. ఆమె షెల్డార్క్‌తో పాటు ఆ ఇంటి నుండి బైటికి రాదు. అతను భార్యను కలవడానికి కానుకలు తీసుకుని హడావిడిగా వెళ్లిపోతే, తన జీవితం ఎంత హీనస్థితికి చేరిందో అర్ధమై దు:ఖంతో ఆమె అక్కడే కొంత సేపు గడుపుతుంది. ఓ అలమారలో నిద్ర మాత్రలను చూసి అవన్నీ మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది ఫ్రాన్.
ఇల్లు చేరిన బాక్స్టర్ తన మంచంపై అపస్మారక స్థితికి చేరిన ఫ్రాన్‌ను చూస్తాడు. అతని పక్కింట్లో ఓ డాక్టర్ ఉంటాడు. ఈ ఇంట్లో నుండి వచ్చే రకరకాల స్త్రీల మాటలు అతనికి వినిపిస్తూ ఉంటాయి. బాక్స్టర్ ఓ స్త్రీ లోలుడని ఆ డాక్టర్ అర్ధం చేసుకుంటాడు. తాను ప్రేమించిన ఫ్రాన్ తన ఇంట్లోనే బాస్‌తో గడుపుతుందన్న బాధ మొదలయ్యాక బాక్స్టర్ ఓ రోజు తాగి తన ఇంటికి ఆ బార్‌లో కలిసిన ఓ స్త్రీని తీసుకు వస్తాడు. అప్పుడే మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న ఫ్రాన్ ను చూస్తాడు. ఆమెను కాపాడడానికి పక్కింటి డాక్టర్‌ను తీసుకొచ్చినప్పుడు, అతను ఆ ఇంట్లో ఇద్దరు స్త్రీలను చూసి బాక్స్టర్ స్త్రీ లోలత్వానికి ఫ్రాన్ బలయిందని అర్ధం చేసుకుంటాడు. అయినా ఓ డాక్టర్‌గా ఎక్కువ వివరాలు అడుగుతూ కాలయాపన చేయకుండా ఫ్రాన్ ప్రాణాలను కాపాడతాడు. ఆమెను రెండు రోజులు అక్కడి నుండి కదిలించవద్దని చెప్పడంతో బాక్స్టర్ ఫ్రాన్‌కు సేవలు చేస్తాడు. ఆమెకు అపుడు తన ఉద్యోగ ఎదుగుదల కోసం బాక్స్టర్ ఆ ఇంటిని బాస్‌కు వాడుకొమ్మని ఇచ్చాడని అర్ధం అవుతుంది. తాను కూడా జీవితంలో ఎదగడానికే ఓ వివాహితునితో సంబంధం పెట్టుకుంది. కాని ఆ జీవితం పట్ల ఆ ఇద్దరిలో మొదటిసారి విముఖత ఏర్పడుతుంది.
బాక్స్టర్ అంతకు ముందు తన ఇంటిని వాడుకోవడానికి ఇచ్చిన మరో ఆఫీసర్ తన గర్ల్‌ప్రెండ్‌తో ఆ ఇంటికి వస్తాడు. బాక్స్టర్ అతన్ని ఇంటి నుండి పంపేస్తాడు. కాని అతను అక్కడ ఫ్రాన్‌ను చూస్తాడు. ఆమెను గుర్తుపడతాడు. ఫ్రాన్‌తో బాక్స్టర్ ప్రేమ కథ నడుపుతున్నాడని అనుకుని ఈ విషయం ఆఫీసులో మిగతావారికి చేరేస్తాడు. ఫ్రాన్ బావకు ఈ విషయం చెప్పడంతో అతను ఫ్రాన్‌ను ఆ ఇంటి నుండి తీసుకెళ్లడానికి వస్తాడు. అక్కడ తనను కాపాడడానికి నేరం తన మీద వేసుకున్న బాక్స్టర్‌లోని మానవీయ కోణం మొదటిసారి ఫ్రాన్‌ను ఆకర్షిస్తుంది.
ఫ్రాన్ ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాక తాను జీవిస్తున్న విధానం పట్ల రోత కలుగుతుంది బాక్స్టర్‌కి. షెల్డార్క్ ఇచ్చిన ప్రమోషన్‌ను కాదని అతనికిచ్చిన తన ఇంటి తాళం తీసేసుకుంటాడు బాక్స్టర్. షెల్డార్క్ సెక్రెటరీ ఫ్రాన్‌కు అతను ఇలాగే తననూ, ఇంకా ఎందరినో ఉపయోగించుకున్నాడని చెబుతుంది. ఇది తెలిసి ఆ సెక్రెటరీని ఉద్యోగం నుండి తీసేస్తాడు షెల్డార్క్. దీనితో ఆమె ఈ వ్యవ్యహారం అంతా ష్కెల్డార్క్ భార్యకు తెలియజేస్తుంది. ఆమె అతన్ని వదిలి వెళ్లిపోతుంది. ఇక భార్య లేదు కాబట్టి ప్రాన్‌ని వివాహం చేసుకుంటానని ఆమెకు చెప్తాడు షెల్డార్క్. తాను కోరుకున్నట్లే ఓ ధనవంతుడి భార్య అయ్యే అవకాశం వచ్చినా ఫ్రాన్‌కు అది ఆనందం కలిగించదు. అప్పుడే మాటల మధ్య బాక్స్టర్ ఉద్యోగం వదిలి వెళ్లిపోయిన సంగతి ఆమెకు తెలుస్తుంది. దానితో షెల్డార్క్‌ని వదిలి బాక్స్టర్ ఇంటికి చేరుతుంది ఫ్రాన్. కొత్త సంవత్సరం రోజున ఆ చిన్న ఇంట్లో పేకాట ఆడుకుంటూ ఆనందంగా తమ జీవితంలో మరో అధ్యాయాన్ని మొదలెడుతుంది ఆ జంట.
ఫ్రాన్ అన్నీ తెలిసే వివాహితునితో సంబంధం పెట్టుకుంటుంది. తన జీవితంలో ఎదుగుదలకు ఇది అవసరం అని ఆమె అనుకుంటుంది. కాని ఆ జీవితం ఆమెకు తప్తిని ఇవ్వదు. చివరకు అతనికి భార్య అయ్యే అవకాశం దొరికినా కూడా ఆమె ఆ జీవితాన్ని వదిలి వేస్తుంది. బాక్స్టర్ కూడా కేవలం కెరీర్‌లో ఎదుగుదల కోసం ఓ బ్రోకర్‌గా మారతాడు. అధికారుల అవసరాలు తీర్చే యంత్రంగా జీవిస్తుంటాడు. కాని ఆ జీవితంలో ప్రమోషన్ లభించినా అది ఇచ్చిన ఆనందం కన్నా కోల్పోయిన ఆత్మ విశ్వాసం అతన్ని బాధిస్తుంటుంది. అందుకే చివరకు ఆ ఉద్యోగం వద్దనుకుంటాడు. తమ జీవిత పంధాను మార్చుకుని నీతిని నమ్ముకుని జీవించడంలోనే సుఖం ఉన్నదని అర్ధం చేసుకుని జీవితాన్ని కొత్తగా తిరిగి మొదలెడుతుంది ఆ జంట.
ఆ ఇద్దరూ కేవలం తమ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తారు. నీతి, తప్పొప్పులు వారిని బాధించవు. కాని తాము ఎన్నుకున్న మార్గం తమకు ప్రశాంతతను ఇవ్వదని, ఇంకా ఆందోళన వైపుకు తమను నెట్టేస్తుందని తమ అనుభవాలతో అర్ధం చేసుకున్న తరువాత వాళ్ళు దారి మార్చుకుంటారు. తన ఇంట్లో బాస్ గడుపుతుంది ఫ్రాన్‌తో అని తెలిసిన తరువాత బాక్స్టర్ మళ్ళీ తన ఇంటిని బాస్ కోసం తెరిచే ఉంచుతాడు. ప్రమోషన్ అందుకోవడమే అతని లక్ష్యం. కాని అది అందాక ఆ జీవితం అంత గొప్పగా అనిపించదు. అలాగే ప్రాన్ కూడా తాను మోసపోతున్నానని అర్ధం చేసుకుని కూడా షెల్డార్క్‌కు అందుబాటులో ఉంటూనే ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే తనకి ఇదే మార్గం అని ఆమె నమ్ముతుంది. కాని అతని భార్య స్థానం దక్కిన తరువాత ఆమెకు ఆ జీవితంపై కోరిక పోతుంది. బాక్స్టర్ సహచర్యంపై కోరిక కలుగుతుంది. నిరుద్యోగిగా మారిన అతని కోసం ధనవంతుడైన వ్యక్తిని వదులుకుంటుంది. ఇక్కడ నీతి పాఠాలకన్నా ఎన్ని దారులు తొక్కి విజయాలకు అందుకున్నా ఆ జీవితాలు డొల్లలే అన్న సత్యం అవగతమై ఆ డొల్ల జీవితాల కోసం తమను తాము మోసం చేసుకోకూడదనే ఎరుక ఆ ఇద్దరిలో రావడం సినిమాను ఫక్తు కామెడీగా మిగల్చదు. ఆ ఎరుకే ఈ కథనానికి బలం అయి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
‘ది అపార్ట్మెంట్’ సినిమా ఇప్పటికీ ఓ గొప్ప చిత్రంగా సినీ ప్రేమికుల మదిలో నిలిచిపోయింది. ముఖ్యంగా పటిష్టమైన స్క్రీన్ ప్లే సినిమాకెంత బలమో చర్చించడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఆ రోజుల్లో ఇలాంటి అనైతిక జీవన విధానాన్ని కథా వస్తువుగా తీసుకోవడం పట్ల చాలా మంది అభ్యంతరం చూపారు. పైగా ఇలాంటి గ్రే షేడ్స్ ఉన్న వ్యక్తులు సినిమాకు ప్రధాన పాత్రలవడం చాలామందికి నచ్చలేదు. అయినా అన్ని విమర్శలూ దాటుకుని పది ఆస్కార్‌లకు నామినేట్ అయి, ఐదు పురస్కారాలు అందుకుంది ఈ చిత్రం.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బిల్లీ విల్డర్ హాలీవుడ్ గొప్ప దర్శకులలో ఒకరు. ఇరవై ఒక్కసార్లు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డులకు నామినేట్ అయి ఏడు అవార్డులను గెలుచుకున్న ప్రఖ్యాత వ్యక్తి. పటిష్టమైన స్క్రీన్ ప్లేల గురించి చర్చించేటప్పుడు ఈయన పేరు మొదట వస్తుంది. బాక్స్టర్ పాత్ర వేసిన జాక్ లెమ్మన్ కామెడీని పండించడంలో దిట్ట. ఫ్రాన్ పాత్రతో షిర్లీ మాక్లిన్ హాలీవుడ్‌లో సుస్థిర స్థానాని సంపాదించుకున్నారు. ఎందరో సినీ నటులు, దర్శకులకు నచ్చిన సినిమాగా ఇప్పటికీ చర్చకు వచ్చే ‘ది అపార్ట్మెంట్’ సినిమాను అధ్యయనం చేసేవారికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. విషయ పరంగా చూస్తే నేటికీ సరిపోయే గంభీరమైన కథా వస్తువు ఇది. బ్లాక్ అండ్ వైట్ తరం అంతమవుతున్న సమయంలో వచ్చిన ఈ సినిమా ఓ శకానికి ముగింపు పలుకుతూ, కొత్త ప్రయోగాలకు నాందిగా కూడా నిలుస్తుంది. ఇలాంటి కథావస్తువు ఆ రోజుల్లో అతి పెద్ద ప్రయోగం. నాయికా నాయకుల పాత్రల చుట్టూ పేరుకున్న స్టీరియోటైపులను బద్దలు కొట్టిన సినిమాగా కూడా విశ్లేషకులు దీన్ని ప్రస్తావిస్తారు. ఉత్తమ దర్శకత్వానికి, స్క్రీన్ ప్లేకు కూడా అకాడమీ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్ పొందిన ఉత్తమ చిత్రాల నడుమ గర్వంగా నిలుస్తుంది.
– పి.జ్యోతి,
98853 84740