రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై యాక్షన్ డ్రామా చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘కోరమీసం’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కార్తికేయన్ మాట్లాడుతూ, ‘ ఇది చాలా మంచి సినిమా. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీసుకొస్తున్నాం. ఈ సినిమా ఒక పండుగలా ఉంటుంది. అందుకే దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు. ‘నా గత చిత్రాల మాదిరిగానే ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా కంటే ఎక్కువగా నా సినిమా మాట్లాడాలి. ‘జిగర్ తండ’లో చూసిన దానికంటే డబుల్ ఎక్స్ రేంజ్‌లో సినిమా ఉంటుంది. ఇది సీక్వెల్ అని చెప్పలేం. ఫస్ట్ పార్ట్‌లో సేతు పాత్ర (బాబీ సింహా క్యారెక్టర్)ను లారెన్స్ చేయాల్సింది. కానీ అప్పుడు కుదర్లేదు. ఈ సినిమా కోసం మళ్లీ లారెన్స్‌ని అడిగాను. ఈ సినిమాలో లారెన్స్ గ్యాంగ్ స్టర్‌లా.. ఎస్ జే సూర్య ఫిల్మ్ మేకర్‌లా కనిపిస్తారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి’ అని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అన్నారు. ఎస్ జే సూర్య మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. మొదటి పార్ట్ ఫుల్ సక్సెస్ అయింది. కార్తీక్ సుబ్బరాజ్ అంటే ఏంటో ఆ సినిమా నిరూపించింది. ఇప్పుడు లారెన్స్ చేస్తుండటంతో అది తమిళ, తెలుగు, హిందీ సినిమాగా మారింది’ అని చెప్పారు. ‘ఈ సినిమా కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జ్ నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’ అని రాఘవ లారెన్స్ తెలిపారు.