సమాజానికి ఉపయోగపడే సినిమా

సమాజానికి ఉపయోగపడే సినిమాబిగ్‌ బాస్‌ ఫేం అర్జున్‌ అంబటి హీరోగా, కిశోరి ధాత్రక్‌ హీరోయిన్‌గా రవిశంకర్‌, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్‌ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టై న్మెంట్స్‌ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ లాంచ్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ ఘనంగా నిర్వహించింది. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్‌ మొదటి పాటను, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను, ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్‌ మాట్లాడుతూ,’ఇదొక మంచి సోషల్‌ పాయింట్‌ మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అందరూ తప్పకుండా మా సినిమాను చూడండి’ అని చెప్పారు. ‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవికి అభిమానిని. అలాంటి వాళ్ల స్ఫూర్తితోనే ఇండిస్టీకి వచ్చాను. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరి సహకారంతో అవుట్‌ఫుట్‌ బాగా వచ్చింది. సినిమా ప్రతిఒక్కరూ ఎంజారు చేసేలా ఉంటుంది’ అని నిర్మాత రాఘవేంద్రగౌడ్‌ అన్నారు. డైరెక్టర్‌ సతీష్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్‌ అద్భుతంగా పని చేశారు. చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని స్పెషల్‌ ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. అవి థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇది చిన్న సినిమా కాదు. కంటెంట్‌ ఉన్న సినిమా’ అని తెలిపారు. హీరో అర్జున్‌ అంబటి మాట్లాడుతూ, ‘ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పోచంపల్లిలో చేశాం. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు. ఓ మంచి సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు.