ఊహించని ట్విస్టులతో సాగే సినిమా

‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్ర దర్శకుడు అశోక్‌ తేజ దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. క్యాథరిన్‌ హీరోయిన్‌గా, సందీప్‌ మాధవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్‌ ఫిలిమ్స్‌, శ్రీమహా విష్ణు మూవీస్‌ బ్యానర్‌లపై దావులూరి జగదీష్‌, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు సంపత్‌ నంది క్లాప్‌ నివ్వగా, నిర్మాత సి.కల్యాణ్‌ స్విచ్చాన్‌ చేశారు. ప్రసన్నకుమార్‌, జెమిని కిరణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,’నా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కు పదిరెట్లు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు. ‘స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా ఇది. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌’ అని హీరోయిన్‌ క్యాథరిన్‌ చెప్పారు. హీరో సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ,’ఇందులోని ప్రతి సన్నివేశం, అలాగే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు. ఇందులో పోలీస్‌ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నా’ అని అన్నారు. చిత్ర సమర్పకుడు సోమ విజయప్రకాష్‌, నిర్మాతల్లో ఒకరైన పల్లి కేశవరావు మాట్లాడుతూ,’ చిత్రీకరణ పూర్తయ్యే వరకు కంటిన్యూ షెడ్యూల్‌ ఉంటుంది. అందరి ఊహలకు భిన్నంగా ఉండే సినిమా ఇది’ అని తెలిపారు.