– పక్కన ఉన్న మూడు షాపులు దగ్ధం
– రాజేంద్రనగర్ పరిధిలోని సన్‌సిటీలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
బాణసంచా దుకాణాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్‌సిటీలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సన్ సిటీలోని రోడ్డుపై ఉన్న ఒక బాణాసంచా దుకాణంలో నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దుకాణంలో ఉన్న టపాకులు క్షణాల్లో అంటుకొని సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న హోటల్లోని సిలిండర్ పేలింది. ఆ శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు ఫైర్ ఇంజన్లు సుమారు ఐదు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చాయి.
షాప్‌కు నిప్పుంటించిన గుర్తు తెలియని వ్యక్తి
బాణాసంచా దుకాణానికి అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి నిప్పుంటించాడు. ముఖానికి హెల్మెట్ ధరించి వచ్చిన ఒక వ్యక్తి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో లభ్యమయ్యాయి. దాంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దుకాణం యజమానిని కూడా వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దుకాణం యజమానికి తెలిసిన వ్యక్తే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.