బాణాసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం

– పది మంది మృతి
చెన్నై : తమిళనాడులోని అరియలూర్‌ జిల్లా వి.విరగలూర్‌ గ్రామంలోని దీపం ఫైర్‌ వర్క్స్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదం లో ముగ్గురు మహిళలతోసహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పరిశ్రమ ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌, ఒక వ్యాన్‌ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సోమవారం ఉదయం పనిలోకి వచ్చిన కార్మికుల బృందం పరిశ్రమలో చిక్కుకుపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నా.. బాణాసంచా పేలుళ్లు కారణంగా సహాయక కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు. పేలుళ్ల కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుళ్ల కారణంగా మృతదేహాలు చిధ్రమయ్యాయి. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాల కు రూ.3 లక్షల చొప్పున, తీవ్ర గాయాలైన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.