వరద నివారణ విధానాన్ని తీసుకురావాలి

A flood control system should be introduced–  శాసనసభలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వాతావరణంలో అనేక మార్పులు రావడంతో అకాల వర్షాల వస్తున్నాయనీ, దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని శాసనసభా ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ‘రాష్ట్రంలో ఏర్పడిన అతివృష్టి వల్ల సంభవించిన పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు’ అనే అంశంపై లఘుచర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. కృష్ణా డెల్టా పరిధిలో లోటు వర్షపాతం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదై అపార నష్టాన్ని మిగిల్చిన తీరును వివరించారు. వరదల్లో కొట్టుకుపోయి 42 మంది చనిపోవడం, వేలాది ఇండ్లు దెబ్బతినడం, చాలా మంది రోడ్లపాలు కావడం బాధాకరమన్నారు. వరదలతో పంట, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ప్రత్యేకంగా వరద నివారణ విధానాన్ని రాష్ట్రంలో తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌లోని రిజర్వాయర్లు, చెరువులు కబ్జాకు గురై అవి కుచించుకుపోయాయనీ, దీంతో వాననీళ్లు కాలనీలను ముంచెత్తుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌ నగరంలోని 30 శాతం బిల్డింగ్‌లు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీలోకి సీనరేజీ వాటర్‌ ను వదలటాన్ని తప్పుపట్టారు. వాతావరణ శాఖ హెచ్చరికలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని కోరారు. వర్షాల సీజన్‌ ఇంకా అయిపోలేదనీ, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో కూడా భారీ వర్షాలు పడే ప్రమాదమున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
భద్రాచలం రాముణ్ని కాపాడండి రైతు ఆధారిత బీమా పథకాన్ని తీసుకురండి : కేంద్రానికి సండ్ర వినతి
పంట నష్టం చెల్లింపు, బీమా వర్తింపు కోసం మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్‌ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య వాపోయారు. రైతు ఆధారిత బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. సర్వే నెంబర్‌ ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలం వాసులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. భద్రాచలంలో కరకట్ట నిర్మాణ సమస్యను పరిష్కరించాలనీ, పోలవరం బ్యాక్‌ వాటర్‌ ఎఫెక్ట్‌ నుంచి భద్రాచలం రాముణ్ని కాపాడాలని కేంద్రాన్ని కోరారు.
ప్రత్యేక కమిటీ వేయాలి : బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు
వాతావరణ మార్పుల అధ్యయనం కోసం రాష్ట్రంలో ప్రత్యేక కమిటీని వేయాలనీ, అందులో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు ఉండేలా చూడాలని బీజేపీ సభ్యులు రఘునందన్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి భేటీ అయి విలువైన సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి చేసేలా చూడాలన్నారు. వరదల్లో 42 కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వర్షాలొచ్చిన ప్రతిసారీ సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్ల బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అక్కడి రైతుల నుంచి భూములను సేకరించి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.10 వేల పంట నష్టపరిహారం అందలేదనీ, వారికి ఇప్పించాలని కోరారు. ఛనాఖా-కొరటా నేటికీ పూర్తికాలేదనీ, దీనివల్ల 26 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కడెం ప్రాజెక్టుపై పాండ్య కమిటీ సూచనలను అమలు చేయాలని సూచించారు. వరదల్లో ఇండ్లు కూలిపోయిన, దెబ్బతిన్నవారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులను బాగు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
చెక్‌ డ్యామ్‌లతో నీట మునుగుతున్న పంటలు : ఈటల
భూగర్భజలాలు పెంచేందుకు చెక్‌ డ్యామ్‌లు నిర్మించడం మంచిదే అయినప్పటికీ ఇష్టానుసారంగా 6 ఫీట్లు, 10 ఫీట్లు..ఇలా ఎత్తు పెంచుకుంటూ పోవడం వల్ల రైతులు నష్టపోతున్నారనే విషయాన్ని సభ దృష్టికి బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్‌ తీసుకొచ్చారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఒండుమట్టి చెక్‌డ్యామ్‌ల వద్ద పేరుకుపోవడం వల్ల నీరు పరుచుకుని చుట్టూ, వెనుక ఉన్న పంట చేలల్లో నీళ్లు నిలవడంవల్ల పంటలు దెబ్బతింటున్నాయన్నారు. దీనికి పరిష్కర మార్గాన్ని చూపెట్టాలనీ, లేకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. వరదలతో నష్టపోయిన పాడి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. పూర్తిగా కూలిన ఇండ్లకు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు ఇచ్చే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
బాధితులు ఎదురు చూస్తున్నారు..తక్షణమే సహాయం ప్రకటించాలి : సీతక్క
ప్రభుత్వం సాయం చేస్తుందనే ఆశతో వరద బాధితులు ఎదురుచూస్తున్నారనీ, వారికి తక్షణమే సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ములుగు నియోజకవర్గంలో 15మంది వరదల్లో కొట్టుకుపోయారని వాపోయారు. జంపన్నవాగు చుట్టూ కిలోమీటర్ల మేర ఇసుకమేటలు వేసి, రాళ్లు తేలి పంట పొలాలు దెబ్బతిన్నాయంటూ సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ఆ భూములను చదును చేసుకునేందుకు సహాయం చేయాలని కోరారు. చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు పంటలనే కాకుండా గొర్లు, బర్లను కూడా కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారన్నారు. వారందర్నీ ఆదుకోవాలన్నారు. గోదావరి నది పరివాహక, జంపన్న వాగు పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కొండ ప్రాంతాల్లో ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు.
చెన్నూరు ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి : బాల్క సుమన్‌
చెన్నూరు ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ ఎస్‌ సభ్యులు బాల్క సుమన్‌ వేడుకున్నారు. పెండింగ్‌లో ఉన్న వాగులపై 19, ఆర్‌ అండ్‌ బీ పరిధిలో 7 బ్రిడ్జీలను సత్వరమే పూర్తయ్యేలా చూడాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు మునుగుతున్నాయని కొందరు కావాలని అపోహలు సష్టిస్తున్నారనీ, ఇది పూర్తిగా అవాస్తవమని పలు సంవత్సరాల్లో వచ్చిన వరదలు, పంటలు నీట మునిగిన విషయాన్ని సభలో వివరించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు రమేశ్‌బాబు, రెడ్యానాయక్‌, రేఖానాయక్‌ తమతమ నియోజకవర్గాల్లో జరిగిన నష్టాలను వివరిస్తూ రోడ్లు వేయించాలనీ, వాగులపై బ్రిడ్జీలు కట్టించాలని సభను కోరారు.