”మనిషి ఊపిరి కొయ్యడానికి కత్తే కానక్కరలేదు, జీవితాల్ని చెరచడానికి మరుక్షణం మృత కళేబరం చెయ్యడానికి, తుపాకులూ యుద్ధాలే రానక్కరలేదు. నూరేళ్లు నవ్వుతూ తుళ్లుతూ వేయిరేకలతో వెలుగులు వెదజల్లుతూ పుష్పించవలసిన బతుకుల్ని భగ్గున మండించడానికి పెట్రోలే అక్కర్లేదు. దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే గొంతు పిసగ్గలదు” అని 1977 నాటి దివి సీమలో తుఫాను బీభత్సాన్ని గూర్చి ‘కొయ్యగుర్రం’ కావ్యంలో నగముని పేర్కొంటాడు. నిజమే కదా! ప్రాణం నిలిపే నీళ్లు ప్రాణాన్ని తీస్తాయి కూడా! అయితే కారకులు, కాపాడవలసినవారు మాత్రం కొయ్యగుర్రాలై కదలక మెదలక నిలుస్తారని కావ్య సారాంశం! ఇది ఇప్పటికీ వాస్తవం. మానవుని మేధోపరిజ్ఞానం వల్ల తుపానులు వస్తాయని ముందుగానే తెలుసుకోగలిగాడు. తుఫానులొస్తే ముంచెత్తుతాయనీ తెలుసు. మరి ఎదుర్కోవడానికి ఎందుకు సిద్ధపడటం లేదనేది ఒక సమస్య! ఇక రెండవది అసలు ఇంత బీభత్సాన్ని సృష్టించే వరదలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రకృతిలో వచ్చిన మార్పులకు కారకులెవ్వరన్నది మౌలిక ప్రశ్న.
వర్షం ప్రకృతి. వరద స్వయంకృతి. సూర్యుడు ప్రకృతి. మండి మసైపోవటం మన స్వయంకృతి. లేదంటే ప్రకృతి ఎందుకో మానవ సమూహం మీద మహాద్వేషాన్ని వెల్లగక్కుతోంది. కోపావేశంతో మనుషుల్ని ముంచెత్తుతోంది. నిజమే మరి! ఎందుకు! ప్రకృతే మన ఎదుగుదలకు, అభివృద్ధికి కారణ భూతమయ్యింది. ప్రకృతే అండగా లేకపోతే మనమెక్కడీ మరి ప్రకృతికి మనమేమిచ్చాము! పొందినదాంట్లో పదోవంతన్నా ప్రకృతికిస్తున్నామా లేదు. అడవుల్ని మింగాం. గనులను తవ్వాం. నదులనూ, చెరువులనూ, కాలువలనూ కబ్జా చేస్తున్నాం కదా! నేలను సరుకును చేసి వ్యాపారం కొనసాగిస్తున్నాం. చెట్లను నరికాం, పుట్టలు తవ్వాం. ప్లాస్టిక్ భూతాన్ని గుట్టలుగా పడదోసాం. భూమితల్లి కడుపు చీల్చి ఖనిజాలను అమ్మేసాం. ఇంకా ఎన్నెన్నో చేశాం. కానీ ఒక్క పచ్చని కలనైనా కన్నామా! లేదు లేదు. ప్రకృతికి మాత్రం కోపం రాదా! ప్రతీకారజ్వాల ఎగయదా! అమ్మకు కూడా కోపం రాదూ! వస్తుంది. నియమం తప్పితే, నీతి తప్పితే, ధర్మం తప్పితే ఎవ్వరికైనా కోపం వస్తుంది. ప్రకృతిని నిందించి ఫలితం లేదు. అన్నిటికి కారకుడు మనిషే, మానవ సమూహమే. దుఃఖం ఎక్కడుందో దాని కారణాలూ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కనీసంగా కన్నీళ్లను తుడవాల్సిన వాళ్లే కరువైనారు.
మొన్న బుధవారం రాత్రి ఎప్పటిలాగే వర్షం వస్తోందని భావించారు. వానలు పడటం లేదని బెంగపడిన వాళ్లకు ఊరడింపనే అనుకొన్నారు. అకస్మాత్తుగా వరద మొదలైంది. భూపాలపల్లి జిల్లా మోరంచగ్రామం ఆసాంతం వరదలో మునిగింది. నిద్రిస్తున్న ఇండ్లలోకి నీళ్లు ముంచెత్తాయి. 280 కుటుంబాలు నీళ్లపాలయ్యాయి. తెల్లారేసరికి ఏమున్నది వాళ్లకి వరద బురద తప్ప. వాళ్లుతినే బియ్యం కొట్టుకుపొయ్యాయి. దుస్తులు, విత్తనాలు, ఎరువులు, దాచుకున్న నగలు, పశువులు సమస్తమూ కొట్టుకుపోయాయి. మనుషులూ కొట్టుకుపోయారు. ఊరు ఊరంతా నిరాశ్రయలయ్యారు ఎన్ని కన్నీళ్లు గుండెకోతను ఆపుతాయి. ఇక ఏటూరునాగారం ములుగు జిల్లా జంపన్నవాగు వరద దిగ్బంధనంలో కొట్టుకుపోయిన ఎనిమిదిమందీ మృతదేహాలై బయటపడ్డారు. ఉమ్మడి వరంగల్‌జిల్లా, ఉమ్మడి ఖమ్మంజిల్లా, కరీంనగర్, నిజామాబాద్ వరదలతో హౌరెత్తింది. ఇప్పటికే పదిహేడుమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరెంతో మంది ప్రజల బతుకుల్లో కన్నీళ్లు ముంచెత్తుతున్నాయి. సర్వం కోల్పోయారు. దుఃఖమొకటే వారికి తోడుగా మిగిలింది.
నగరాలు కూడా వరదలమయమవుతున్నాయి. బురదవీధులు తాండవమాడుతున్నాయి. మహానగరమైన భాగ్యనగరమూ అందుకు మినహాయింపు కాదు. ఎక్కడ నాళాలుంటాయో, ఎక్కడ గుంతలు దిగబడతాయో, ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. నగరంలోని అనేక ప్రాంతాలు, బురదలతో నిండిపోయి ఉన్నాయి. మురికివాడల బాధలు వర్ణనాతీతం. వరదలు చేసిన నష్టం ఎంతో ఇంకా అంచనా వేయాలి. వేలాది పంట పొలాలు ఇసుకమేటలు వేసి, నీళ్లలో మునిగి నష్టం జరిగింది. పాతిండ్లు, గోడలు కూలి చనిపోయినవారూ, నిరాశ్రయులూ ఉన్నారు. జాతీయ రహదారులనేకం వరదకు కొట్టుకునిపోయాయి. ఇక గ్రామాల మధ్య దారులు మూసుకుపోయాయి. చుట్టుముట్టిన నీటి నుండి మనుషుల్ని కొందర్ని రక్షించి ఒడ్డుకు చేర్చినా, వారి భవిష్యతేమిటి? నిరాశ్రయులైన వేలాది మందికి ఆశ్రయం కల్పించడం ఆదుకోవడం తక్షణావసరం. ఇక పోలవరం ప్రాజెక్టుతో మునిగిపోయే ప్రాంతాల గోస ఇలాంటి వరదల్లో మరింత పెరుగుతుంది. ఇది ప్రతిసారీ కొనసాగే ఘోష.
నగరాలలో చెరువులు, కుంటలు రియలెస్టేట్ వ్యాపారుల కబ్జాలకు గురయ్యాయి. వర్షాలు వస్తే నీరు పారటానికి కాలువలూ మూసుకుపోయి ఉంటున్నాయి. ఇక చెరువుల్లోనూ ఇండ్లు మొలిచాక నీటికి మాత్రం నివాసం అక్కరలేదా! ప్రజలంతా ఆలోచించాల్సిన సమస్య. నష్టపోయిన ప్రజలకు ఓదార్పునిచ్చి, ప్రభుత్వం వారిని ఆదుకోవాలి వరదలను శాశ్వత ప్రాతిపదికన అరికట్టడానికి ప్రణాళికలు వేయాలి.