‘ఇది కల్పాంతమో యిమ్మహౌగ్ర సలిలం బేకార్ణవాకారమై… జగముల్ పోజేసెనో ధాతయెయ్యిది దిక్కెక్కడ ఎవ్విధంబునం బ్రాణంబు రక్షించకోలొదవున్…’ అంటూ ఎర్రన హరివంశంలో పాడిన పద్యం గుర్తుకొస్తోంది. మన్నూ, మిన్నును ఏకం చేస్తూ వరద సృష్టించిన బీభత్సంతో రాష్ట్రం తల్లడిల్లిపోయింది. వాగులూ వంకలూ పొంగి పొర్లాయి. రోడ్లూ, వంతెనలు, ఇండ్లు కొట్టుకుపోయాయి. లక్షలమంది సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వేల ఎకరాల పంట నీట మునిగి రైతులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షలతో రాష్ట్రం చిగరుటాకులా వణికిపోయింది. ఉమ్మడి నల్గొండ, మానుకోట, ఖమ్మం జిల్లాల్లో నేటికి వాన ఉధృతి కాస్త తగ్గింది. కానీ ప్రజల కంట కన్నీరు మిగిల్చింది. వేలాదిగా ఇండ్లు కూలిపోయాయి. అయినవారిని కోల్పోయిన వారు కొందరైతే, కట్టుబట్టలతో మిగిలినవారు ఇంకొందరు. ఖమ్మం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పోటెత్తిన మున్నేరు వరద ప్రజల కష్టాలకు కారణమైంది. కోలుకోలేని దెబ్బ తీసింది. ఇండ్లన్నీ బురదమయ మయ్యాయి. దాచుకున్న బియ్యం, పప్పులు పనికిరాకుండా పోయాయి. రూపురేఖలు మారిపోయిన ఇండ్లను చూసుకొని కన్నీరుమున్నీర య్యారు. గంగారంలో సైంటిస్ట్ అశ్వినినీ, ఆమె తండ్రిని పొట్టన పెట్టుకొని విషాదాన్ని మిగిల్చింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే వరద మిగిల్చిన నష్టం రూ.వెయ్యి కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసిందంటే వరద బీభత్సం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మహబూబాబాద్ వరద ప్రమాదం నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చెరువులకు గండ్లు పడటంతో గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. కొట్టుకుపోయిన రోడ్లు జలవిలయానికి అద్దం పడుతు న్నాయి. రాకపోకలు నిలిచి జనజీవనం స్తంభించింది. రైల్వే ట్రాక్ ధ్వంసమై పట్టాలు గాల్లో వేలాడాయి. ఇలా ఉమ్మడి ఖమ్మం, వరంగంల్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు వరద కన్నీటిని మిగిల్చింది. అటు ఆంధ్రాలో బుడమేరు పొంగిపొర్లడంతో రెండులక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. పందొమ్మిది మంది మరణించారు. విజయవాడ మూడు రోజుల నుండి నీటిలో నానుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 481 రైళ్లు రద్దు చేశారు.దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
హుసేన్‌సాగర్ పొంగిపొర్లడంతో హైదరా బాద్ నగర ప్రజలు కూడా నిన్నటి వరకు బిక్కుబిక్కుమంటూ బతికారు. వరుణుడు కాస్త శాంతించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రకరకాల జ్వరాలతో ఆస్త్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈ వరద దెబ్బకు మరిన్ని అంటురోగాలు ప్రబలే ప్రమాదమూ లేకపోలేదు. వరద బాధితులను ఆదుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలను లెక్క చేయకుండా సహాయ చర్యలను పరిశీలించారు. రేవంత్‌రెడ్డి ఈ పాటికే తక్షణసాయంగా రూ.పదివేలు ప్రకటించారు. చనిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ.ఐదు లక్షలు అందజేస్తున్నా రు. తక్షణం జరగాల్సి చర్యలు సరే! మరి ముందస్తు జాగ్రత్తల సంగతేంటి?
ఈ ప్రకృతి ప్రకోపానికి కారణమెవరు? ప్రకృతితో మమేకమై సాగాల్సిన మనిషి ప్రయాణం రియల్ ఎస్టేట్‌కు దాసోహమంటోంది. ఇసుక రవాణా కోసం చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఊళ్లో ఉండాల్సిన ఇళ్లు చెరువులోకి వస్తే, చెరువులో ఉండాల్సిన నీరు ఇండ్లను ముంచేస్తోంది. ఇదంతా కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న మనిషి అవివేకం కాదా! ప్రకృతి ఎప్పుడు విజృంభిస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సిందేనా? వాస్తవానికి రాష్ట్రంలో ఇలాంటి విపత్తులు ఎదురయితే ఎదుర్కొనే కమిటీ నిర్వహణ సక్రమంగా లేదు. అది సమావేశమై పదేండ్లు గడిచిపోయింది. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వాల చిన్నచూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
‘నువ్వెంత నేనెంత రవ్వంత… ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత… ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం… ఇష్టంగా గుండెకు హత్తుకుందాం… కన్నెరైతే నీరై ఓ కొంచం… తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం… ‘ అన్నట్టు ప్రకృతి ముందు మనిషి పిసరంత. దాంతో పెట్టుకుంటే నాశనమయ్యేది మనిషే. కనుక ప్రకృతిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు, అక్రమ ఇసుక తవ్వకాలపై దృష్టి పెట్టాలి. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముంపు ప్రాంతాలను ముందే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా సంబం ధించిన కమిటీతో పని ప్రారంభించాలి. ాబోయ తరాలైనా ప్రకృతి కోపానికి బలవ్వకుండా చూడాలి. పంట నష్టపోయిన రైతులకు, కౌలురైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు కేంద్రం వెంటనే ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి తగు సహాయసహకారాలు అందించి ప్రజలను ఆదుకోవాలి.