ఆహార సంక్షోభం తప్పదా?

– అనుకూలించని వాతావరణం
– అతివృష్టి, అనావృష్టితో అన్నదాత కుదేలు
– తోడవుతున్న ఎల్‌నినో ప్రభావం
న్యూఢిల్లీ: దేశంలో ఆహార సంక్షోభం తప్పేలా లేదు. అననుకూల వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. తొలకరి వర్షాలు పడిన తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఆగస్టు నెల మొత్తం ‘కరువు’ పరిస్థితిని గుర్తుకు తెచ్చింది. ఏ ప్రాంతంలోనూ వర్షాలు సరిగా పడలేదు. భూములు నెర్రలు బారాయి. పంటలు ఎండిపోయాయి. రైతులు ఆశతో ఆకాశం వైపు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. 1901వ సంవత్సరం తర్వాత ఆగస్ట్‌ నెలలో ఇంతటి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దేశంలో ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో ఎల్‌నినో ప్రభావం నడుస్తోంది. అందుకే రుతుపవనాలు ప్రవేశించినా సరైన వర్షం పడలేదు. రాబోయే రోజులలో కరువు పరిస్థితులు ఏర్పడతాయని, ఆహార భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతాయని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్‌ నెలలో దేశంలో సాధారణం కంటే 36% తక్కువగా వర్షపాతం నమోదైంది. దక్షిణ ప్రాంతంలో అయితే సగటు వర్షపాతంలో 60% లోటు కన్పించింది.
ఓ వైపు ఆనందం…మరోవైపు ఆందోళన
సెప్టెంబర్‌ నెల ఆశాజనకంగానే ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. రైతులు సంబర పడుతున్నారు. ఈ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ కూడా తీపి కబురు చెబుతోంది. అయితే బియ్యం ఎగుమతులపై నిషేధం, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలు వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ఆహార భద్రతా సంక్షోభం ఏర్పడుతుందేమోనని పాలకులు సైతం భయపడుతున్నారు. ఒకవేళ సెప్టెంబర్‌లో కూడా వర్షాలు సరిగా పడకపోతే వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి. ఖరీఫ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రబీ సీజన్‌ పరిస్థితి ఏమిటన్నది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గత రెండు సీజన్లలో రబీ పంటల సాగు, దిగుబడి సగటు కంటే తక్కువగానే ఉన్నాయి. మరోవైపు దేశంలో ఆహార నిల్వలు అడుగంటుతున్నాయి. దీంతో పాలకులు, రైతులు రుతుపవనాల సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సానుకూలత ఏది?
ఏదేమైనా దేశం ఆహార సంక్షోభం వైపు పయనిస్తోందన్న మాట మాత్రం వాస్తవం. చాలా కాలం నుండి దేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. రుతుపవనాలు సానుకూలంగా లేకపోవడం, వరదలు, తుపానులు వంటి ప్రతికూలతలు ఎదురవడం దీనికి కారణం. దీనికితోడు 2020లో పంటలపై మిడతలు దాడి చేయడంతో రైతులకు భారీగా నష్టం వచ్చింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున మిడతల దాడి ఎన్నడూ జరగలేదు. 2021లో దేశంలోని ఆరు రాష్ట్రాలలో వర్షపాతం సగటు కంటే తక్కువగా నమోదు కాగా 12 రాష్ట్రాలలో అధిక వర్షపాతం నమోదైంది. దేశంలోని 703 జిల్లాలలో 40% జిల్లాలలో మాత్రమే సగటు వర్షపాతం నమోదైంది. 2015-21 మధ్యకాలంలో వరదలు, అధిక వర్షాల కారణంగా 33.9 మిలియన్‌ హెక్టార్లలోనూ, కరువు పరిస్థితుల కారణంగా 35 మిలియన్‌ హెక్టార్లలోనూ పంటలకు నష్టం వాటిల్లింది.2022 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం దిగుబడి 6% తగ్గింది. ఉత్తర భారతదేశంలో రబీ గోధుమ పంట దిగుబడి 13.5% తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. 2020-21తో పోలిస్తే 2021-22లో వ్యవసాయ రంగంలో అభివృద్ధి మందగించిందని, వాతావరణ మార్పులే దీనికి కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో అంగీకరించారు కూడా. 2022-23 రబీ సీజన్‌లో సైతం పరిస్థితిలో మార్పు లేదు. దేశంలోని పలు ప్రాంతాలలో సకాలంలో వర్షాలు పడలేదు. ఆ తర్వాత బైపర్‌జారు తుఫాను వచ్చి పంటలను సర్వనాశనం చేసింది. ఇప్పుడేమో టమాటా నుండి ఉల్లి వరకూ కూరగాయల ధరలు పెరిగి అధిక ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది. చివరికి పశుగ్రాసం ధరలు కూడా పెరుగుతున్నాయి.